*తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత స్థానికులుగా మొదట మాదే..
కోలా లక్ష్మీపతి
*పవిత్రత ప్రశాంతత పరిరక్షణ ధ్యేయంగా..
*తిరుమల పరిరక్షణ సైన్యం ఏర్పాటు…
*రెవెన్యూ పంచాయతీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అడ్డుకుంటాం…
తిరుపతి(నేటి ధాత్రి)
తిరుమల కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా మేము ఉనికి కోల్పోయి కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని. ఇక్కడ పుట్టి, పెరిగిన స్థానికులుగా తిరుమలను కాపాడుకునే బాధ్యతతో మొదటగా మేము సంఘటితంగా తిరుమల పరిరక్షణ సైన్యం గా ఏర్పడ్డామనీ తిరుమల స్థానికుడు కోలా లక్ష్మీపతి వెల్లడించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
తిరుమల శ్రీవారి ఆలయం అభివృద్ధి కోసం దశాబ్దాల తరబడి కొండపై నివసిస్తున్న స్థానికులైన మేము మా స్థలాలు ఇతరత్రా వాటిని టిటిడి అభివృద్ధి కోసం అప్పగించి, ప్రత్యామ్నాయంగా జీవనోపాధి క్రింద షాపులు, హాకర్ లైసెన్స్ లు బాలాజినగర్ లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుండి కూడా టిటిడి ధర్మకర్తల మండలితో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా తిరుమల స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొండపై అన్నింటిలోనూ అవకాశాన్ని స్థానికులకే ఉండేలా చేశారు. అటు తర్వాత గత 6 ఏళ్లుగా ఈవిధానానికి స్వస్తి పలికి స్థానికులకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా స్థానికేతరులందరికీ రాజకీయ ఒత్తిడిలతో కొండపై పలు విధాలుగా స్థానం కల్పించడంతో స్థానికులైన మేము జీవనోపాధి కోల్పోయి మా ఉనికి ప్రమాదంలో పడింది. పైగా ప్రస్తుత టిటిడి యాజమాన్యం తిరుమల కొండపై స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా టిటిడి రెవెన్యూ, పంచాయితీ విభాగం పూర్తిగా అవినీతిమయమై ఇష్టారాజ్యంగా వందలాది తట్టలు, హాకర్ లైసెన్స్ లు విచ్చలవిడిగా కొండపై వెలిశాయి.
ప్రతినిత్యం ఏదోఒకచోట లైసెన్స్ లు లేకుండానే పంచాయితీ, రెవెన్యూ, విజిలెన్స్, ఆరోగ్యశాఖ విభాగం అధికారులు అనధికారికంగా తట్టలు పెట్టిస్తూనే వున్నారు. ఈవిధంగా వ్యవహరించుకుంటూ పోతే తిరుమలలో స్థానికేతరులు ప్రాబల్యం పెరిగిపోయి అసాంఘిక శక్తుల ప్రమేయంతో ప్రమాదకరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి మీరు పూర్తిగా తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి మావంతుగా స్థానికుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది.ఇకపై అనధికారికంగా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడినా తిరుమల పరిరక్షణ సైన్యంగా మా ముఖ్య సైనికులు అడ్డుకుంటామని. చట్టపరంగా కూడా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటామని కోలా లక్ష్మీపతి వివరించారు.
మరో ముఖ్య సైనికుడు వి కృష్ణ, కే హరిప్రసాద్, వాసుదేవన్ లు మాట్లాడుతూ పాలకమండలి ఉన్నతాధికారులు తిరుమలలో టిటిడి రెవెన్యూ పంచాయతీ విభాగం అవినీతి కారణంగా సంస్థ ఉనికి ప్రమాదకరంలో పడిందని అన్నారు.
దయచేసి ప్రక్షాళన మీరు మొదలు పెడితే మావంతు సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. తిరుమలలో ఆక్రమణలు అనధికారిక తట్టలపై ఫిర్యాదు చేసినప్పుడల్లా దుకాణాలపై కక్ష తీర్చుకునేలా దాడులు నిర్వహించడం ఇబ్బందులకు గురి చేయడం పంచాయతీ రెవిన్యూ విభాగానికి పరిపాటిగా మారిందన్నారు. ఇకపై కొండపై రాజకీయ ఒత్తిడితో పంచాయతీ రెవిన్యూ విజిలెన్స్ ఆరోగ్య శాఖ ఎవరైనా సరే అనధికారికంగా తట్టలు పెట్టాలని చూస్తే తిరుమల పరిరక్షణ సైన్యం మూకుమ్మడిగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. తిరుమల పరిరక్షణ కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించేందుకు 250 మంది సభ్యులతో ఏర్పడిన తిరుమల పరిరక్షణ సైన్యం 15 మంది ముఖ్య సైనికులతో కార్యాచరణ కు దిగుతుందని వెల్లడించారు.ఈ సమావేశంలో పాల్గొన్న
ముఖ్య సైనికులు ఎమ్.వేలు,కె. ప్రహ్లాద, పి.భాస్కర్, జి.వరప్రసాద్, కె.వెంకటేశ్వర్లు, పొన్నా నాగరాజు పి.త్రిలోక్ కుమార్, ఎం.మణి, ముని నాయుడు,చెంజి సురేష్, ఎం.ఆర్.బాలాజి తదితరులు పాల్గొన్నారు.