
ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి.
గత సంవత్సరం నిర్వహించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులలో సుదూర ప్రాంతాలకు కేటాయింపు .
ఇప్పుడు బదిలీలు చేపట్టకుండా పదోన్నతులు ఇస్తే వారికి తీరని అన్యాయం.
ఈ సంవత్సరం బదిలీలు చేపట్టకపోతే వచ్చే సంవత్సరం జనగణన నేపథ్యంలో కూడా చేపట్టడం వీలుకాదు.
పూర్తిస్థాయిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు ఇవ్వాలి.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.
కేసముద్రం/ నేటి దాత్రి
బదిలీలు నిర్వహించకుండా ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు చేపడితే గత సంవత్సరం సుదూర ప్రాంతాలకు కేటాయించబడిన వారికి తీరని అన్యాయం జరుగుతుందని, కాబట్టి ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని బదిలీల అనంతరమే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెస్సీవ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ గత సంవత్సరం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాలకు కేటాయించబడ్డారని, ఇప్పుడు ప్రభుత్వం బదిలీలు చేపట్టకుండా పదోన్నతులు చేపడితే వారికి తీరని అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి సూచించారు. కొత్తగా ప్రమోషన్ పొందే వాళ్లకేమో దగ్గరగా ఉండే అవకాశం ఇవ్వడం, గత సంవత్సరం ప్రమోషన్లు పొందిన వారినేమో సుదూర ప్రాంతాలలో అలాగే ఉంచడం సమంజసం కాదని అన్నారు.
ఈ సంవత్సరం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టకపోతే వచ్చే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనగణన చేపడుతున్న నేపథ్యంలో అప్పుడు కూడా బదిలీలు చేపట్టడం సాధ్యం కాదని అన్నారు. కావున ఉపాధ్యాయులందరికి బదిలీలు నిర్వహించి, ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడే ఖాళీలను డీఎస్సీ నిర్వహించి నింపే అవకాశం ఉంటుందని వివరించారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే కాకుండా నిరుద్యోగుల జీవితాల్లో కూడా వెలుగులో నింపిన వారవుతారని అన్నారు.
అనంతరం మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు మాట్లాడుతూ టిపిటిఎఫ్ మొదటి రోజు సభ్యత్వ నమోదు లో భాగంగా కేసముద్రం స్టేషన్, బ్రహ్మం గారి గుడి తండా, ఉప్పరపల్లి, అర్పనపల్లి, కాంట్రపల్లి, భవాని గడ్డ తండా, వెంకటగిరి,చంద్రు తండా, ఇంటికన్నె,కోరుకొండ పల్లి, మహమూద్ పఠన్, కస్తూర్బాగాంధీ, కేసముద్రం విలేజ్ లలో గల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదుతో పాటు, ఆయా పాఠశాలల్లో ఉండే సమస్యల సేకరణ కూడా గావించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శులు వీసం నర్సయ్య, మోహన్ కృష్ణ, ఊట్కూరి ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు