https://epaper.netidhatri.com/
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే…
`జనగామ నియోజకవర్గ సమస్యలు నెల రోజుల్లో తీరుస్తా!
`ముఖ్యమంత్రి కేసిఆరే వచ్చి భరోసా ఇచ్చారు.
`జనగామను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా!
`సమస్యలు లేని జనగామ ఆవిష్కరిస్తా!
`కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతికతే లేదు.
`జనగామ ఒకప్పుడు కరువు ప్రాంతం.
`ఇప్పుడు జనగామ జిల్లా అంతా సస్యశ్యామలం.
`ఫ్లోరైడ్ సమస్య తీరిపోయింది.
`చెరువులన్నీ ఎప్పుడూ నిండుగా వుంటాయి.
`చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయిస్తా!
`చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా!
`కాంగ్రెస్ పార్టీ అంటేనే అతుకుల బొంత.
`అరవై ఏళ్లు పాలించి చేసిందేమీ లేదు.
`పదేళ్లలో కేసిఆర్ పాలన, తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శమౌతోంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
జనగామ ఒకదశలో మోడువారిన ఎడారి. జనగామ అత్యంత కరువు ప్రాంతం. సాగునీటి అవకాశాలు చాలా తక్కువ. తాగు నీటి సమస్య అధికం. పైగా ఫ్లోరైడ్ బాధతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి జీవగడ్డ. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గొప్ప చరిత్ర జనగామ కు వుంది. అంతటి వీరోచితమైన ఉద్యమ నేపథ్యమే కాదు, సర్థార్ సర్వాయి పాపన్న ఏలిన నేల. అలాంటి జనగామ ప్రాంతం నిరంతరం పోరు కాలమే చూసింది. కష్ట కాలమే అనుభవించింది. అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్ష పూరిత పాలనలో అడుగడుగునా అవస్థలకు లోనైంది. సమస్యలకు నిలయంగా మారింది. సాగు నీరు లేదు. తాగు నీరు కరువు. అలాంటి జనగామ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. గడచిన పదేళ్లలో ఎంతో గొప్పగా ప్రగతిని సాధించింది. ముఖ్యమంత్రి కేసిఆర్ కు జనగామ అంటే ప్రత్యేకమైన అభిమానం. పైగా జనగామ, చేర్యాల ప్రజా సమస్యలు, ప్రాంత అవస్థలు ఆయన కు తెలుసు. అందుకే మిషన్ కాకతీయ తొలి ఫలితాలు జనగామ నియోజకవర్గానికి అందించారు. మొదటి దశలోనే జనగామ జిల్లా, నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులను ఏక కాలంలో మరమ్మత్తులు చేయించారు. చెరువులు నింపడం జనగామ తోనే మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు జనగామ ప్రాంతమంటే అంత మమకారం. అలాంటి జనగామ నుంచి ఈసారి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో వున్నాను. నన్ను జనగామ ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే గా ఎన్నికైన క్షణం నుంచి పెద్ద పాలేరుగా పని చేస్తా! జనగామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…అంటున్న పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు..విశేషాలు ఆయన మాటల్లోనే…
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.
ప్రగతి అనేది ఒక దగ్గర ఆగేది కాదు. నిరంతరం నీటి ప్రవాహం లాంటిది. ఇప్పటికే అనేక సమస్యలకు పరిష్కారం జరిగింది. జనగామ జిల్లా కేంద్రమైంది. మెడికల్ కాలేజీ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి జరిగింది. ఇంకా కొన్ని ప్రాధాన్యతా క్రమంలో వెనుకబడి వున్నాయి. వాటిని గుర్తించడం జరిగింది. పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిశీలన జరుగుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మొదలుపెట్టడం జరుగుతుంది. అలాంటి ఎన్ని సమస్యలు వున్నా జనగామ నియోజకవర్గ సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తా! ఈ విషయం ముఖ్యమంత్రి కేసిఆర్ తోనే చెప్పించా… ప్రజలకు భరోసా కల్పించాను.
జనగామ ఇప్పటికే అనేక రంగాలలో అభివృద్ధి జరిగింది.
జనగామ కొన్ని దశాబ్దాలుగా గొప్ప విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది. హైదరాబాద్ కు కూత వేటు దూరంలో వున్నట్లే లెక్క. గతంలో జనగామ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పట్టేది. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్డు రవాణా రంగంలో ఎంతో పురోగతి తెచ్చారు. అసలు ఒకప్పటి రహదారులకు ఇప్పుడు మనం చూస్తున్న రోడ్లకు ఎంతో తేడా వుంది. అదే ఉమ్మడి రాష్ట్రంలో వుంటే మన జనగామ గతంలో ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుండేది. చుక్క నీరు లేక అల్లాడిపోయేది. కరంటు కోతలతో విలవిలలాడిపోయేది. ఉపాధి కరువై వలసలు వెళ్లేది. మరి ఇప్పుడు జనగామ ప్రాంతంలో ఉపాధి కోసం ఉత్తరాధి నుంచి యువత వస్తున్నారు.
కరువు ప్రాంతం అన్నపూర్ణగా మారి సాగు పనుల కోసం ఇతర రాష్ట్రాలనుండి వచ్చి ఉపాధి పొందుతున్నారు.
సాగు సాగక వేలాది మంది జనగామ చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ పనుల కోసం వెళ్లి వస్తుండే వారు. ఇప్పుడు అలాంటి వాళ్లంతా ఊళ్ళలో హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. బంగారు పంటలు పండిస్తున్నారు. అయినా ఇంకా తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఆ బాధ్యత నాది. జనగామ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా! సమస్యలు లేని జనగామ ఆవిష్కరిస్తా! అందుకు అందరి సహకారం అవసరం. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా , ప్రజలందరితో తలలో నాలుకలా వుండేందుకు ప్రయత్నం చేస్తా. ప్రజల్లో మమేకమౌతా. ప్రతి ఇంటికి బంధువునౌతా. అన్ని కుటుంబాలలో సభ్యుడినౌతా. వారి మంచీ, చెడుకు తోడుగా వుంటా. ప్రజలు ఏ సమస్య తో వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో వుంటా. ప్రజలకు సేవ చేస్తా. జనగామ కు కీర్తిని తీసుకొస్తా. జనగామలోనే కాదు, తెలంగాణ లో ఎక్కడా కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతికతే లేదు. అసలు కాంగ్రెస్ వల్లనే తెలంగాణ అరవై సంవత్సరాల పాటు అష్టకష్టాలు అనుభవించింది. తీరని గోసను ఎల్లవోసింది. తెలంగాణ వచ్చాకనే తెలంగాణ కు కళ వచ్చింది. జనగామ కు కూడా వెలుగొచ్చింది.
చేర్యాల ప్రజల న్యాయ పరమైన డిమాండ్ రెవెన్యూ డివిజన్.
చేర్యాల ప్రజలు వివిధ పనుల కోసం అటు గజ్వేల్, ఇటు హుస్నాబాద్, జిల్లా కేంద్రం సిద్దిపేట కు వెళ్లాల్సివస్తోంది. ప్రజలకు ఎంతో ఇబ్బంది ఎదురౌతోది. ప్రజలు పడుతున్న ఇబ్బంది నాకు అర్థమైంది. అందుకే ఎన్నికల వేధిక మీదనే ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. జనగామ, చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా! కాంగ్రెస్ పార్టీ అంటేనే అతుకుల బొంత.
అరవై ఏళ్లు పాలించి చేసిందేమీ లేదు. కనీసం మంచినీళ్లిచ్చింది లేదు.
పదేళ్లలో కేసిఆర్ పాలన, తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శమౌతోంది. జనగామ నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి సమస్యలున్నా దయచేసి ప్రజలు నా దృష్టికి తీసుకురాల్సిందిగా కోరుతున్నాను. జనగామ ప్రజాశీర్వాద సభ గొప్పగా జరిగింది. ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో హజరయ్యారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఎంతో సంతోషించారు. సభ సక్సెస్ వెనుక నాకు తోడ్పాటునందించిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నన్ను కడుపులో పెట్టుకొని దీవించి గెలిపించే ప్రజలను, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకుంటాను. జై తెలంగాణ. జై జనగామ.