https://epaper.netidhatri.com/
నెల రోజుల కాంగ్రెస్ పాలనపై ‘‘మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు’’ నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే..
`పథకాలు మంగళం సమర్పయామి అనుకోవడమే!
`పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే.
`మమ.. అనుకొని చేతులు దులుపుకోవడమే!
`కూర్చునేది లేదు…కుదురుకుంటున్నట్లు లేదు!
`సీటు కాపాడుకోవడం కోసం కూడా సమయం సరిపోయేట్టు లేదు.
`రెండు లక్షలు అప్పు చేసుకోమన్నారు…రాగానే మాఫీ మర్చిపోయారు.
`రైతుభరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు.
`ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు.
`అసెంబ్లీ సాక్షిగా ఇస్తామని ఎక్కడా చెప్పలేదని తేల్చేశారు.
`మహిళలకు అన్ని బస్సు సర్వీసులు ఫ్రీ అన్నారు…పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌కు పరిమితం చేశారు.
`హైదరాబాద్, డిల్లీ యాత్రలకే పుణ్య కాలం పోతోంది.
`చీమ చిటుక్కుమన్నా డిల్లీకే వెళ్లాలి.
`అడుగుముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి.
`సంక్షేమం గాలికి…కాంగ్రెస్ నేతల పరుగులు డిల్లీకి.
హైదరాబాద్,నేటిధాత్రి:
గాలి వానకు గొడుకు పడితే ప్రయోజనం వుంటుందా? ముళ్లకంచెను నీటిలో నాటితే నాటుకుంటుందా? కాంగ్రెస్ పరిస్ధితి కూడా అంతే… కాంగ్రెస్‌ను నమ్ముకున్న తెలంగాణ అరవైఏళ్లు గోసపడిపంది. అందుకే తెలంగాణ కోసం కేసిఆర్ కొట్లాడిరది. తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తెలంగాణలో వెలుగులు నింపింది. కొన్ని సార్లు ప్రజలు కూడా మాయలో పడిపోయే అవకాశం వుంటుంది. అయితే అది తాత్కాలికమే. ఎల్లకాలం ప్రజలను ఎవరూ మోసం చేయలేదు. కాంగ్రెస్ చేసిన మోసం అధికారంలోకి వచ్చిన మరునాడే తేలిపోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీల మీద సంతకాలన్నారు. తెలంగాణ ప్రజలు కొంత నమ్మారు. దాంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా కాంగ్రెస్‌లో మార్పు రాలేదు. మారు కావాలని పదే పదే తెలంగాణ ప్రజలకు చెప్పి,నమ్మించిన కాంగ్రెస్ పార్టీ మారిందా? అంటే మారలేదు. గతం తాలూకు బాగోతాలు మర్చిపోలేదు. అందుకే తొలి రోజు నుంచే పాలన గాలికొదిలేశారు. రాజకీయం మాత్రమే చేస్తున్నారు. అసలు అధికారంలోకి వచ్చామన్న నమ్మకం వారికే లేదు. అందుకే సంక్షేమం గాలికి వదిలేశారు. రైతులకు ఇచ్చిన హమీలు మర్చిపోయారు. బిఆర్‌ఎస్ అధికారంలో వున్నప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ రైతాంగ సంక్షేమం, తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం పనిచేశారు. కాని కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం అన్నది మర్చిపోయింది. బిఆర్‌ఎస్ అధికారంలో వున్న సమయంలో నీటి పారుదల ప్రాజెక్టు గేట్లు ఎత్తితే గంగమ్మ ఉరకలెత్తి, పరుగు పరుగున పొలాలకు చేరినట్లు, రైతు బంధు వేయగానే ట్రింగ్, ట్రింగ్ మంటూ రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం పడేది. మరి ఇప్పుడు ఎవరు ఏం చెబుతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి రైతు భరోసా వేశామంటాడు. మరో మంత్రి రైతు భరోసా వస్తుందంటాడు..మరో మంత్రి వేస్తామంటాడు..ఇందులో ఎవరి మాటలు నిజమో వాళ్లుకే తెలియకుండా పోయింది. తెలంగాణ రైతులకు సంకటంగా మారింది. అంటున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, నేటి ధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో నెల రోజుల కాంగ్రెస్ పాలనపై పంచుకున్న ఆసక్తి కరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసి, పదే పదే అబద్దాలు వల్లెవేసి, చెప్పిందే చెప్పి, అధికారంలోకి వచ్చారు. వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజలను మోసం చేస్తున్నారు.
వారి చేతగాని తనం కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్‌మీద లేని పోని అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ నెల రోజులు గడిపేశారు. ఇక ఇంకా ఎలా కాలం గడపాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. బిఆర్‌ఎస్ పేరు చెప్పి మరింత కాలం పబ్బం గడుపుకోవాలని మాత్రమే చూస్తున్నారు. కాని ప్రజలకు మేలు చేసే అంశం మర్చిపోయారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశమిచ్చారు. ఒక్క ఛాన్స్..ఒక్క ఛాన్స్ అంటూ గత ఏడాది కాలంగా ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాయకులు వేడుకుంటూ వచ్చారు. అయినా ప్రజలు కనికరించేట్లు కనిపించలేదు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు లేని పోని, అలవి కాని హామీలను గుప్పించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలనే కాపీ కొట్టి, కొత్తగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలను ఏదో విధంగా నమ్మించారు. అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే ప్రజా గ్రహానికి గురయ్యారు. గతంలో ఇలా పది రోజలకే ప్రజల నుంచి ఇంతటి వ్యతిరేక ఎదుర్కొన్న ప్రభుత్వం ఏదీ లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధానానికి, అదికారంలోకి వచ్చి అనుసరిస్తున్న ఆచరణకు పొంతన లేదు. అందుకే ప్రజలకు కూడా పది రోజులకే కాంగ్రెస్ పాలన ఎలా వుంటుందో అర్ధమైంది. అప్పుడు ప్రజల తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ అంటేనే కరంటు కష్టాలు, ప్రజలకు నష్టాలు..రైతులకు ఆపసోపాలు..అన్ని వర్గాల ప్రజలను అయోమయానికి గురిచేయడమే… గతంలో చూసినవే… యాభై ఏళ్లు ప్రజలు అధికారమిచ్చినా ఎలాంటి సంక్షేమాలు అమలు చేయని, కాంగ్రెస్, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వేడుకుంటున్నప్పుడే బిఆర్‌ఎస్ చెప్పింది. కాంగ్రెస్ మాటలు నయవంచనకు రూపాలని పేర్కొనడం జరిగింది. అయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కనికరించి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ హామీలు అరుంధతీ నక్షత్రమే.. పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే అని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పథకాలు మంగళం సమర్పయామీ! అన్నదే ఇక వినపడేది.. ముమ్మాటికీ నిజమయ్యేది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది.
ఇచ్చిన హామీలలో రెండిరటిని చూపించి మమ అనిపించడం తప్ప చేసేదేమీ లేదు.
సరిగ్గా పాలనపై దృష్టిపెట్టేది లేదు. పెట్టేంత సమయం కాంగ్రెస్ నాయకులకు లేదు. ఎంత సేపు కుర్చీ కాపాడుకోవడం కోసం ఆరాటం మాత్రమే వుంటుంది. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు కూడా వచ్చేందుకు సమయం వుండదు. కుర్చీలో కూర్చునేందుకు ఎలాంటి రాజకీయాలుచేశారో..ఎలాంటి మభ్యపెట్టే మాటలు చెప్పారో…కుర్చీ కాపాడుకోవడానికి కూడా అవే మాటలు చెబుతారు. కుర్చీలను అంటిపెట్టుకొని వుంటారు. ప్రజలకోసం ఆలోచించే తీరిక చేసుకోరు. పట్టుమని నెల రోజుల కాకముందే లుకలుకలు. కుదురుకోకముందే కుర్చీలాటలు. వాటిని కాపాడుకునేందుకు ఎత్తుగడలు. అనునిత్యం కుర్చీలకు కాపలాలు ..ఇక ప్రజల బాగోగులు ఎలా చూస్తారు.. కుర్చీలాటతో నెంబర్ల లెక్కలు వేసుకుంటున్నారు. పరిపాలన చేస్తామని వేడుకుంటే, అవకాశమిస్తే కుర్చీల కోసం అప్పుడే అంతర్గత కుమ్ములాటలను చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల మేలు ఏనాడు పట్టించుకోరు..గతం చెప్పిన సత్యమే ఇది…గతంలోకి తొంగిచూస్తే కనిపించే నిజాలివే…
అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు ఆశలు కల్పించారు.
ఇప్పుడు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే తాము నిజాయితీగా చెప్పిన మాటలన్నా, కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్దాలు కొంత మేర నమ్మారు. దాంతో రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రైతులను ఒక రకంగా కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టారు. వెళ్లి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొమ్మని చెప్పారు. అయితే రెండులక్షల రుణం ఎలా ఇస్తారన్న సోయి కూడా లేకుండా చెప్పిన కాంగ్రెస్ మాటలను రైతులు నమ్మడమే పాపమైంది. నమ్మితేనే కదా! మోసం చేసేది అన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటనే పదే పదే చెప్పి గోబెల్స్ ప్రచారం చేశారు. జనాన్ని బురిడీ కొట్టించారు. రెండు లక్షల రుణమాపీ సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. అధికారంలోకి రావాలంటే ఇలాంటి అబద్దాలు చెబితే తప్ప తెలంగాణ ప్రజలు నమ్మేలా లేరని చెప్పారు…అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పినన్నీ అలవి కాని హామీలే… చేతులెత్తేసేవే అని మేం మొదటి నుంచి హెచ్చరించినవే..అయినా జనం కాంగ్రెస్‌ను నమ్మారు. ఎలా చెప్పారంటే డిసెంబర్ 9 నాడే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పడంతో ప్రజలు కూడా నమ్మారు. అంతే తప్ప కాంగ్రెస్‌ను పూర్తిగా విశ్వసించలేదు. గత కాంగ్రెస్ చరిత్రలు ప్రజలకు బాగాతెలుసు. పల్లె ప్రజానికం కొంత అమయకులు. అందుకే వారిని సులభంగా మోసం చేయగలిగారు. అదే అర్భన్ ప్రజలు కాంగ్రెస్‌ను అసలే నమ్మలేదు. బిఆర్‌ఎస్ అభివృద్ధి నమూనాను చూశారు. పదేళ్ల క్రితం తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు ఎంత తేడా వుందన్నదానిని గుర్తించారు. ఈ అభివృద్దికి బ్రేక్ పడొద్దని విశ్వసించారు. బిఆర్‌ఎస్‌కు అర్భన్ ప్రాంతాలు మద్దతుగా నిలిచాయి. కొన్ని విషయాలు తాము కూడా ప్రచారం చేసుకోలేదు. 2019 తర్వాత సుమారు 7లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కాని కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వలేదని చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. నెల గడుస్తున్నా రైతు భరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని తేల్చేశారు. ఎన్నికల ముందు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. రెండిరటికి పరిమితం చేశారు. తొలి పధకంలోనే కోత కోశారు. హైదరాబాద్ నుంచి డిల్లీకి యాత్రలకే పుణ్యకాలం గడిచిపోతుంది. చీమ చిటుక్కుమన్నా డిల్లీకి వెళ్లాలి. అడుగు ముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి. సంక్షేమంగాలికి..కాంగ్రెస్ నాయకుల పరుగులు డిల్లీకి..ఇంతే కాంగ్రెస్ పాలన..ఇంతకు మించి ఒక్క అడుగు కూడా వేయలేని అబద్దాల లాలన. తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.