Indiramma Houses Inaugurated in Mulugu
పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది
#పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం.
#అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.
#వెంకటాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన ….
#రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు.
పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని మంత్రి వివరించారు.
ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
