Efficient Rice Procurement in Warangal District
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి
వరంగల్ జిల్లా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.శుక్రవారం హన్మకొండలోని డిసిసిబి భవన్ ఆడిటోరియంలో జెడ్పి సీఈఓ, ఇంచార్జి డిఆర్డీఓ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా సహకార అధికారి నీరజలతో కలిసి వరంగల్ డివిజన్ లో వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక,శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2025 -26 సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని,కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాలలో ఏర్పాటు చేయకూడదని, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లు, తేమ శాతాన్ని నిర్ధారించేయంత్రాలు సమకూర్చడం జరుగుతుందని,సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేసి నిల్వ చేయాలని, కొనుగోలు సమయంలో ఎప్పటికప్పుడు ధాన్యం, రైతుల వివరాలను ట్యాబ్ లలో నమోదు చేయాలని, రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తూ రైతుల వివరాలు నమోదు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, నీడ, వైద్య వసతి తదితర మౌలిక వసతులు కల్పించాలని, తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తమ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గన్ని సంచులు రైతులకు అందించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ,ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షించాలని, కొనుగోలు ప్రక్రియలో భాగంగా తేమశాతం యంత్రాలు, టార్పాలిన్లు, త్రాగునీరు, నీడ తదితర విషయాలకు సంబంధించి పి.సి.ఎస్.ఎ.పి. యాప్, గన్ని సంచుల నిర్వహణ కోసం మేనేజ్మెంట్ యాప్, పట్టాదారు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఆధార్, మొబైల్ నెంబర్ నిర్వహణపై ఓ.పి.ఎం.ఎస్. యాప్ లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

ప్రభుత్వం వరి ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు రూ .2 వేల 369 లుగా నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్ల కు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, జిల్లాలో టాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు మాత్రమే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయబడిన రైతుల పంట సాగు డేటా ప్రకారం మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, హార్వెస్టర్ వినియోగ సమయంలో ఆర్ పి ఎం 18-20 ఉండేలా పర్యవేక్షించాలని, ఇలా నిర్దేశిత వేగంతో వినియోగించినట్లయితే తాలు పోయి నాణ్యమైన ధాన్యం వస్తుందని ,హార్వెస్టర్ యంత్రాల వినియోగ సమయంలో నిబంధనలను పాటించాలని, కోతకు వచ్చిన తర్వాత మాత్రమే పంట కోయాలని, బ్లోయర్ యాక్టివ్ మోడ్ లో ఉండాలని ,రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 48 గంటలలో సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్యాడి క్లీనర్లను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు,సీఓలు, డిఆర్డీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
