ఈనెల 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి.
కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, మిరియాల రాజిరెడ్డి, తుమ్మల రాజిరెడ్డి, చక్రపాణి, విశ్వనాధులు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నుండి 44 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ కార్మిక 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9 న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కార్మిక శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా సింగరేణి సంస్థను పరిరక్షించే విధంగా జాతీయ సంఘాల జేఏసీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక సంఘాలు ఉండకూడదని కుట్రతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లేబర్ చట్టాలను తెచ్చిందని, కార్పొరేట్ శక్తులకు లాభం చేసే ఈ నాలుగు కోడ్ల అమలు వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని, భూపాలపల్లి ఏరియాలోని అన్ని సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు మాతంగి రామ్ చందర్, నూకల చంద్రమౌళి, బడి తల సమ్మయ్య, కంపేటి రాజయ్య, గణేష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.