అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
రాష్ట్ర ప్రభుత్వం హెచ్.సి.యు. భూములను వేలం వేసే ఆలోచనను రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రామారపు వెంకటేష్,మచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్.సి.యు.) భూముల్ని కాపాడాలని, హెచ్.సి.యు. విద్యార్థులపై లాఠీచార్జి నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు సెక్రటేరియట్ ముట్టడించాలని పిలుపునిచ్చిన సందర్భంగా గురువారం నిర్వహించే సచివాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్ళనీయకుండా తెల్లవారు జామున ఇంటి వద్దకు వచ్చి ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది.
ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్ లు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్.సి.యు. విద్యార్థుల పట్ల కర్కశంగా, అత్యంత పాశవీకంగా వ్యవహరిస్తూ, అక్రమ లాఠీ చార్జీలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీ ఛార్జి కి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.
హెచ్.సి.యు. భూములను కార్పొరేట్, పెట్టుబడిదారులకు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హెచ్సీయూలో చెట్లను నరికి వేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలను విరమించుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూములను, విశ్వవిద్యాలయాల భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని తెగ నమ్మాలని చూడటం కంచే చేను మేసిన చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, భవిష్యత్ విద్యార్థుల ప్రయోజనాలకు, యూనివర్సిటీలో పరిశోధనల అభివృద్ధికి, నాణ్యమైన ప్రయోగశాలల నిర్మాణానికి ఉపయోగపడే భూములను వేలం వేసే పద్ధతులను విడనాడాలని ప్రభుత్వాన్ని ఈసందర్బంగా డిమాండ్ చేశారు.