మిర్చి కనీస మద్దతు ధర ముప్పై వేల రూపాయలు ప్రకటించాలి

మార్కెట్లో రైతులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి.

ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన రైతు సంఘాల ప్రతినిధి బృందం

మిర్చి రైతు రామక్కకు మెరుగైన వైద్యం అందించాలి.

తెలంగాణ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

నేటిధాత్రి, వరంగల్

రైతులు పండించిన మిర్చి పంట క్వింటాకు 30 వేల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించి, మార్కెట్ దోపిడిని అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల తరపున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం నాడు తెలంగాణ రైతు సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను రైతు నాయకుల బృందం మిర్చి యార్డు పర్యటించి ధరల పరిస్థితి, రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మిర్చి రేటు తగ్గడంతో తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని నాయకులతో తమ వేదనను వెలిబుచ్చారు. కుంటి సాకులతో ధరలు తగ్గిస్తున్నారని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో మార్కెట్ అయినా ఏనుమాములలో అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా మిర్చికి ధర పలకకపోవడం అన్యాయం అన్నారు. కనీసం మార్కెట్లో ప్రకటించిన జెండా పాట ప్రకారంగా నైనా రైతులందరి మిర్చి పంటను కొనుగోలు చేయకపోవడం దోపిడీకి నిదర్శనం అన్నారు. ప్రకటించిన జెండా పాటకు అమలయ్యే ధరకు 4 వేల రూపాయల వరకు క్వింటాకు తేడా ఉంటుందన్నారు.

మిర్చి రైతుకు ఎకరం పంట పండించడానికి ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతున్నదని, దిగుబడి మాత్రం 4 కింటాల వరకు పంట మాత్రమే వస్తున్నదని ఆ రకంగా చూస్తే రైతులు తీవ్రంగా నష్టపోతూ దోపిడి గురవుతూ అప్పుల పాలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో యదేచ్చగా మిర్చి రైతులు దోపిడి గురవుతున్న మార్కెట్ యంత్రాంగం ప్రభుత్వం చోద్యం చూస్తున్నది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్లోనే రైతులు దోపిడీ గురికాకుండా మార్కెట్ అధికారుల పరిశీలన ఉండాలని అన్నారు . ఇప్పటికైనా తక్షణమే మార్కెట్లో మిర్చి రైతులను దోపిడీ చేస్తున్న మధ్య దళారులు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ కార్యదర్శి, ఉన్నత అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో మార్కెట్ను సందర్శించి మిర్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల గోడును అర్థం చేసుకొని క్వింటా మిర్చి కనీస మద్దతు ధర 30వేల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మార్కెట్కు భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల్ చల్పూర్ గ్రామం నుండి చిర్ర రమక్క మహిళా రైతు 11 బస్తాల మిర్చి పంటను మార్కెట్కు తీసుకురావడం జరిగింది. మిర్చి పంటకు ఎకరాకు పెట్టుబడి లక్షలలో ఖర్చు పెట్టి మార్కెట్కు అమ్మడానికి వస్తే, రేటు సరిగా రాకపోవడం పెట్టుబడి కూడా రాదు అని ఆవేదనతో రైతు గుబులు చెంది హార్ట్ ఎటాక్ రావడం జరిగింది. మార్కెట్ లో వైద్య సదుపాయాలు లేక ఎంజీఎం హాస్పటల్ కు తరలించడం జరిగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అని చెప్తున్న ప్రభుత్వం మార్కెట్లో వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సోమీడి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా తక్షణమే మార్కెట్లో హాస్పటల్ ఏర్పాటు చేసి నిత్యం డాక్టర్లు వైద్య సదుపాయాలు అందించే విధంగా హాస్పటల్ నిర్మాణం చేయాలని, వైద్యం అందించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు కాసర్ల రామ్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నాయకుడు సోమ రామ్మూర్తి, తెలంగా ణరైతు సంఘ నాయకులు ఊరటి అంశాల రెడ్డి, మోకిడి పేరయ్య, బల్లు ఎల్లయ్య, సిర్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *