సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.
#ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి
దనసరి అనసూయ సీతక్క పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి,
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం జరుగుతుందని, చాలా సంతోషకరమని అన్నారు.
ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని మర్చిపోతే మాత్రం మానవ మనుగడకు భవిష్యత్తు కష్టతరం అవుతుందని , ” నాకోసం పనిచేస్తే నాలోనే ఉండిపోతావు – జనం కోసం పనిచేస్తే జనంలో ఉండిపోతావ్ అని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని ఖిలషాపూర్ అనే గ్రామంలో జన్మించారని పశువుల కాపరిగా ఉంటూ రాజుల సైన్యాలను వారి ఆగడాలను ఎదిరించి, అరికట్టి ఉమ్మడి హక్కుల కోసం పోరాడారని , అన్యాయాలను ఎదిరించిన ఆయన జీవిత చరిత్ర మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో గౌడ్ అన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కరించడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చూస్తానని పేర్కొన్నారు.
మహనీయుల విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేయుటకు, బీసీ భవన్ ఏర్పాటు చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వం బి.సి. రిజర్వేషన్ 42 శాతం అమలు కు కట్టుబడి ఉందని ,
బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనీ ఈ సందర్భంగా మంత్రి కోరారు.
ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య 100 రక్షక కవచాలను మంత్రి అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇంచార్జీ సర్దార్ సింగ్, బి.సి. కులస్థులు,
బి.సి. సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.