
భద్రాచలం 16 ఫిబ్రవరి 24.
భద్రాచలం నేటి దాత్రి
ఎజెండా ప్రకారము మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా సంబంధిత యూనిట్ అధికారులు నిర్వహించి మీ యొక్క కార్యాలయం ప్రగతి నివేదికలను సిద్ధంగా ఉంచుకొని పాలకవర్గ సమావేశం విజయవంతంగా జరిగేటట్లు కృషి చేయాలని, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సంబంధిత యూనిట్ అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం నాడు తన చాంబర్లో ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాలలో పనిచేయుచున్న యూనిట్ అధికారులతో ఈ నెలలో జరగబోయే ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి తీసుకోవలసిన చర్యలపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ కార్యాలయంలో జరగబోయే పాలకవర్గ సమావేశానికి గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు , జడ్పీ సీఈఓ లు, ఎమ్మెల్సీలు,శాసనసభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇతర రాజకీయ ప్రజాప్రతినిధులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మహబూబాబాద్, ఖమ్మం జిల్లా కలెక్టర్ తో మొదలుకొని వివిధ శాఖల జిల్లా అధికారులు వారికి సంబంధించిన ప్రగతిని గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఐటీడీఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు, గిరిజనులకు ఏ విధముగా అమలు చేస్తున్నవి, తదితర అంశాల గురించి చర్చించడం జరుగుతున్నందున, సంబంధిత యూనిట్ అధికారులు మీ శాఖకు సంబంధించిన ప్రగతిని గిరిజనులకు చేరవేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలను, నివేదికల రూపంలో తయారు చేసుకొని ఉంచుకోవాలని, అలాగే బడ్జెట్ కు సంబంధించిన ప్రపోజల్ వెంటనే పై అధికారులకు నివేదించి బడ్జెట్ను తెప్పించుకోవాలని, ఐ టి డి ఏ కార్యాలయంతో పాటు పాలకవర్గ సమావేశం జరిగే గిరిజన భవనం, పరిసరాలు మరియు కార్యాలయం గదులు సమావేశం హాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. గత పాలకవర్గ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు ఏ ఏ శాఖలకు సంబంధించిన అంశాలు, సమస్యల గురించి తెలియజేశారో వాటిని పరిష్కరించి నివేదికలు పంపించిన జాబితాలు సంబంధిత యూనిట్ అధికారులు వారికి తెలియజేయడానికి దగ్గర ఉంచుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ఐటీడీఏకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని, అటువంటి చెడ్డ పేరు రాకుండా ప్రతి యూనిట్ అధికారి బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్ ఓ సురేష్ బాబు ,డి ఎం జి సి సి విజయ్ కుమార్, ఏవో భీమ్ ,డిటి ఆర్ ఓ ఎఫ్ఆర్ శ్రీనివాస్, ఏడి అగ్రికల్చర్ భాస్కర్, ఏపీఓ పవర్ మునీర్ పాషా, ఏసీఎంవో రమణయ్య, జేడీఎం హరికృష్ణ, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది-