లింగంపల్లి పురవీధుల్లో ఆకట్టుకున్న స్వయంసేవకుల కవాతు…
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి స్వయంసేవకుల పథ సంచలన కార్యక్రమం వైభవంగా, స్ఫూర్తివంతంగా, కన్నులపండుగగా, పాల్గొన్నవారికే కాకుండా చూసేవారికి కూడా ఉత్సాహాన్నిచ్చే విధంగా జరిగింది.
ముందుగా జరిగిన సమావేశంలో సికింద్రాబాద్ విభాగ్ బౌధ్ధిక్ ప్రముఖ్ శ్రీ.అచ్చవెల్లి.భాను ప్రకాశ్
గారు తమ వక్త సందేశంలో భాగంగా మాట్లాడుతూ, హిందూ సంఘటన కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించబడింది అన్నారు. సంఘ్ స్వయంసేవకులకు క్రమశిక్షణ, దేశభక్తి వంటి ఉన్నతమైన సద్గుణాలు అలవడే విధంగా శిక్షణనిస్తుంది అన్నారు. సంఘం అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక సమాజసేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది అన్నారు. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద స్మారక కేంద్రం, శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తికేంద్రం, అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ మందిరం సంఘ కృషివల్లనే నిర్మించబడ్డాయి అన్నారు. తిరుమల పవిత్రత ఏడుకొండలు కాక రెండు కొండలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదన, రామసేతు విధ్వంస ప్రతిపాదన సంఘ ఉద్యమాలవల్ల ఆగాయి అన్నారు. సంఘ పనిని సమాజమంతాకలిసి వేగంగా ముందుకు తీసుకువెళ్లి భారతదేశాన్ని తిరిగి విశ్వగురువు స్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ విభాగ్ సహకార్యవాహ్ శ్రీ.నారాయణ మూర్తి గారు కూడా పాల్గొన్నారు.
తరువాత గణవేష్ (uniform) ధరించిన స్వయంసేవక్ లు అందరూ కాళ్ళు, చేతులు ఒకేసారి, ఒకే విధంగా కుదుపుతూ సైనిక కవాతులాగా మనోహరంగా పథసంచలన చేస్తూ, గుల్మోహర్ చౌరస్తా నుడి ప్రారంభము అయి ప్రశాంతి నగర్, బాపు నగర్, గోపీనగర్, నెహ్రూ నగర్ , ఆదర్శనగర్ బస్తీ వీధుల్లో సంచరించారు. సంఘ ఘోష్ (RSS musical band) లయబద్ధంగా వాదన చేస్తూ పథసంచలనకి అత్యంత ఉత్సాహం ఇచ్చింది. పరమపవిత్ర భగవాధ్వజాన్ని పుష్పాలంకృతమైన వాహనంలో తెచ్చారు. బస్తీవాసులు పూలుచల్లి అడుగడుగునా స్వాగతం పలికారు.
