Horse Dance Steals the Show at Urs Festival
గుర్రం డ్యాన్స్ అదిరింది……
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలం బర్దిపూర్ గ్రామంలోని ఊరీస్ షరీఫ్ హజరత్ షానూరే ఇమామ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్దల నడుమ జరుగుతున్న ఈ పవిత్ర ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 5:30 గంటల వరకు సర్కారీ గంధం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. గుర్రం, ఒంటెల పై గంధం, పూలతో అలంకరించి భక్తిపూర్వకంగా ఊరేగింపు నిర్వహించారు.భాజాభజంత్రీల సన్నాయి మేళాల మధ్య సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా మార్చింది. ఊరేగింపులో గుర్రం చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుర్రంతో పాటు ఒంటె కూడా డప్పు చప్పుళ్లకు తగినట్లుగా అడుగులు వేయడంతో భక్తులు ఆనందభరితులయ్యారు. జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్ కల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉత్సవాలను వీక్షించేందుకు తరలివచ్చారు. ఈ దృశ్యాలను వీక్షించి పరవశించిపోయారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించుకుంటూ ఉర్సు ఉత్సవాలు భక్తి, ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా కొనసాగుతున్నాయి.
