
Telangana Governance Day in Bhupalpally
సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డా బెల్లయ్య నాయక్ అన్నారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా సాయుధ వీరులు నిజాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 17, 1948న మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు అది పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య, వరంగల్ కు చెందిన షేక్ బందగి భాను నాయక్ లకు నివాళులర్పించారు.
తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన నాటి సాయుధ పోరాటంలో ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయక ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజని, ఈ శుభదినాన్ని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి… ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి, గడిచిన పదేళ్లలో ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తమ భాదలు తీరతాయని ఆశించారో అవి నెరవేరలేదన్నారు. ప్రభుత్వ ఆశ, ఆలోచన, ఆచరణ ప్రతీది ప్రజా కోణమేనని, అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, బాధ్యతగా ఉండాలని, ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలని, అమరుల ఆశయాలు ఉండాలని, యువత ఆకాంక్షలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ, విధ్వంసమైన తెలంగాణ పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
ఏఎస్పి నరేష్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.