
Education Schemes.
ప్రభుత్వం మొక్కు”బడి” పథకాలు…
విశ్వ జంపాల,న్యాయవాది,మరియు విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-
భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంత వ్యత్యాసాలు చూపకుండా, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక బేధాలు పాటించకుండా, రాజు, పేద తేడా లేకుండా అందరికి ఒకే రకమైన, నాణ్యమైన విద్యా-వైద్యాన్ని అందించాల్సిన భాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం.ప్రజలు తమ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు.ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.నేటి బాలలే రేపటి పౌరులు” అన్న నినాదాన్ని నిజం చేయాలన్న ఆలోచన ఏ మాత్రం పాలకులకు ఉన్నా, పుట్టిన ప్రతి బిడ్డను 5 ఏళ్ళ వయస్సులో దత్తత తీసుకోవాలి. విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసి సమాజానికి అందించాలి. ఆ భాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. నిజానికి ఇది ప్రభుత్వం మీద ఉన్న చట్ట బద్ధమైన బాధ్యత కూడా.అన్ని ఉచితం అని ఊదర గొట్టే ప్రభుత్వాలు విద్యా-వైద్యం కోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్గిన సంస్థలను ఏర్పాటు చేయాలి. బోధన రుసుములు, ఉపకార వేతనాలు, పరీక్ష ఫీజులు, భోజన సౌకర్యం, దుస్తులు, పుస్తకాల పంపిణీ, బస్సు-రైలు పాసులు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వాహణ మొదలైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రజలను ప్రలోభ పెట్టే సాధనాలుగా సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతున్నాయి. మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు గాని సామాన్య ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. విద్యా-వైద్య సమస్యలు ప్రజలను నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు పథకాలెన్ని ఉన్న ఫలితం శూన్యం. నల్లబల్ల పథకం (ఓ బి బి) 1987, ఏపీ ప్రాథమిక విద్యా పథకం (అప్పీప్) 1984, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డీపీఈ పి) 1996, సర్వశిక్ష అభియాన్ (ఎస్ ఎస్ ఏ) 2002, (దీన్ని 2007లో రాజీవ్ విద్యా మిషన్ (ఆర్ వి ఎమ్) గా మార్చారు. ఏపీ పాఠశాలల ఆరోగ్య పథకం (ఏపీ ఎస్ హెచ్ పి) 1992, విద్యా విషయక దూరదర్శన్ కార్యక్రమం (ఈటీవీపీ) 1986, పాఠశాల సంసిద్ధాంత కార్యక్రమాలు (ఎస్ ఆర్ పి), ఆవాస పాఠశాలలు (ఆర్ ఎస్), దూరదర్శన్ పాఠాలు (టీవీ లెసన్స్), రేడియో పాఠాలు, టెలికాన్ఫరెన్సింగ్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం (స్పాట్) 1993, సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం (సీసీఆర్ టీ), జాతీయస్థాయి సంస్థలు :- కేంద్రీయ విద్యా సలహా సంఘం (సి ఏ ఈ బి) 1921, కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘం (సి ఏ ఎస్ ఈ) 1929, సార్జంట్ విద్యా కమీషన్, సెకండరీ విద్యా కమీషన్, యూనివర్సీటి గ్రాంట్ కమీషన్ (యూజీసీ) 1948, జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణా మండలి (ఎన్ సి ఈ ఆర్ టీ) 1961, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టీ ఈ) 1973, ప్రాంతీయ విద్యా సంస్థ (ఎన్ ఐ ఈ పి ఏ) 1979, కేంద్రీయ ఆంగ్ల మరియు విదేశీ భాషల సంస్థ (సి ఐ ఈ ఎఫ్ ఎల్) (ఇఫ్లూ) 1958. రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు :-రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి (ఎస్ సి ఈ ఆర్ టీ) 1967, పాఠ్య పుస్తకాల రచయితల కమిటి, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (ఎస్ ఐ ఈ టీ) 1985, రాష్ట్ర విద్యా నిర్వహణ మరియు శిక్షణ సంస్థ (ఎస్ ఐ ఈ ఎమ్ ఏ టీ) 1979, రాష్ట్ర వనరుల కేంద్రం (ఎస్ ఆర్ సి) 1978, జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ (డైట్) 1989, మండల వనరుల కేంద్రం (ఎమ్ ఆర్ సి), స్కూల్ కాంప్లెక్స్ (ఎస్ సి), మొదలియర్ విద్యా కమీషన్, కొఠారీ విద్యా కమీషన్, ఛటోపాధ్యాయ విద్యా కమీషన్ 1983, జాతీయ విద్యా విధానం 1986, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి, బడిబాట, రాష్ట్ర విద్యా చైతన్య ఉత్సవాలు, కస్తూర్భా బాలికా విద్యాలయాలు, సక్సెస్ పాఠశాలలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 2009, సాక్షర భారత్ (2009), మధ్యాహ్న భోజన పథకం 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం (ఎన్ సి ఎఫ్) 2005, ప్రొఫెసర్ యశ్ పాల్ నివేదిక 1993, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2000. విద్యా ప్రైవేటీకరణ కోసం పున్నయ్య కమిటి (1992), స్వామినాదన్ కమిటి (1992), బిర్లా-అంబాని కమిటి (2000), విద్యా హక్కు చట్టం 2009, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ఫీజు రియంబర్స్మెంట్ తదితర కమిటీలు కమిషన్లు పథకాలు ప్రవేశపెట్టాయి. వికలాంగుల కోసం, స్త్రీ విద్యకోసం, బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుంది. వీటితో పాటు ఒక్కొక్క స్కూలు మొత్తం 57 రకాల రికార్డులను మరియు రిజిష్టర్లను నిర్వహిస్తుంది. వీటన్నింటినీ ప్రభుత్వాలు మొక్కు “బడి” పథకాలుగా మార్చడం విశేషం. ఆయా పథకాలను ఎట్లా ప్రవేశ పెట్టాలో, ఎట్లా నీరు కార్చాలో మన దేశ పాలకులకు తెలిసినంతగా ప్రపంచంలో మరే దేశ పాలకులకు తెలియదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాషాయ విష గరళంగా మార్చిన సంగతి విధితమే. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని విద్యావేత్తలు సామాజికవేత్తలు విద్యార్థి సంఘాలు మేధావులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన తిరోగమన విధానాన్ని భారతీయ సమాజంపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి తన గొయ్యి తానే తీసుకోవడం తప్ప మరొకటి కాదనేది నిజం. కాషాయం కషాయంగా మారి విషంగా మారితే ప్రజలు సహించరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి పెద్దలు గ్రహించాలి. విద్యా కాషాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యా కాషాయంతో బహుజన దేశంగా ఉన్న భారతదేశాన్ని బ్రాహ్మణ దేశంగా మార్చాలని ప్రయత్నిస్తూన్న బిజెపి అంతర్గత కుట్రపూరిత ఎజెండాను ప్రజల అర్థం చేసుకొని తిప్పి కొట్టడానికి ఎంతో కాలం పట్టదు.ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నప్పటికీ విద్యా-వైద్యం సామాన్యుడి దరి చేరడం లేదు. కారణమేదైన పాపం ప్రభుత్వాలదే. అక్కరకు రాని చుక్కలు ఎన్ని ఉంటేనేమి? సూర్యుడు ఒక్కడుంటే చాలు! అన్నట్లు వందల కొలది సంక్షేమ పథకాలు పెట్టడం కన్నా, అన్ని రకాల మౌళిక వసతులతో కూడిన సమీకృత/ఏకీకృత విద్యా-వైద్య సంస్థలను మండల కేంద్రం యూనిట్ గా స్థాపించడం మేలు. ఆరంభ సూరత్వం ఆ పైన అలసత్వం అనేది ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత 74.04 శాతంగా ఉంది. అక్షరాస్యత శాతం పెరిగిన దానికన్నా రెట్టింపు స్థాయిలో నాణ్యత ప్రమాణాలు, విలువలు దిగజారి పోయాయి. దేశంలో ఉపాధ్యాయులు, డాక్టర్ల కొరత 40 శాతానికి మించే ఉంటుంది. 5వ, తరగతికి వచ్చే సరికి 78%, 10వ, తరగతికి వచ్చే సరికి 62 శాతం, ఉన్నత విద్యకు వచ్చేసరికి 7 శాతానికి విద్యార్థుల సంఖ్య మించడం లేదు. 7 శాతంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల అవసరాలను, మౌళిక వసతులను కూడా ప్రభుత్వం తీర్చక పోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనం.విద్యార్ధులు చదువు మానివేయడం వెనుక ప్రధాన కారణం పేదరికం. పేదరికానికి ప్రధానకారణం నిరుద్యోగం, మన దేశంలో నిరుద్యోగం 31 శాతం ఉంది. మిగతా 69 శాతం మందిని ఉద్యోగులుగా ప్రభుత్వం ప్రకటిస్తున్నటికీ, చాలా మంది అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేని వారిగా, నిర్దిష్ట ఆదాయం లేని వారిగా, అరకొర పనులతో చాలిచాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం మన దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలు. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి విద్యను ఒక సాధనంగా ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. పేదరికంతోనే ప్రజలు విద్యకు, వైద్యానికి దూరమవుతున్నారు. జాతీయ ఆరోగ్య ముసాయిదా ప్రకారం 6.3 కోట్ల మంది ప్రజలు ప్రతీ యేటా వైద్య ఖర్చుల కారణంగా దారిద్య్రంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రభుత్వం పేదరిక-నిరుద్యోగ నిర్మూలనకై కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు అందడం లేదు. రోగమొకటైతే, మందొకటి పెడితే రోగమెట్లపోవును అన్నట్లుంది ప్రభుత్వ పని విధానం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, విద్యను ఆయుధంగా మలచుకోగలిగితే నిరుద్యోగం, పేదరికం నిర్మూలించవచ్చు. ప్రపంచంలో అత్యంత విలువైనవి, అవసరమైనవి మానవ వనరులు. మానవ వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులను సమాజ అవసరాలకు, దేశ అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దాల్చిన సామాజిక, చట్ట బద్ధమైన భాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.