Government Urged to Recognize Two-Wheeler Mechanics
టూ వీలర్ మెకానిక్స్ ని ప్రభుత్వం గుర్తించాలి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో టూ వీలర్ మెకానిక్ గా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంతోష్ వృత్తి లో భాగంగా మంచిర్యాల వెళ్లి భీమారం తిరుగు ప్రయాణం చేస్తున్న మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై మంచిర్యాలలో గత పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర టు వీలర్ మెకానిక్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి రంగు ప్రకాష్,కార్యవర్గ సభ్యులు మహేష్, ముజామీల్,మడిపల్లి సత్యం హాస్పిటల్ వెళ్లి సంతోష్ ఆరోగ్య బాగోగులు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు మాట్లాడుతూ.. మెకానిక్ వృత్తిని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు.సామాన్య మానవుల జీవితంలో ఒక భాగమైన మోటార్ సైకిల్ రిపేర్ చేస్తూ ఎంతోమంది రోజువారి జీవన ప్రయాణంలో సహాయకులుగా నిలబడుతున్న మెకానికులకు గుర్తింపు లేకుండా పోతుందని వాపోయారు.ప్రభుత్వం వాళ్లకంటూ ఎటువంటి పథకాలు కానీ,లోన్స్ సౌకర్యాలు కానీ,వైద్య ఆరోగ్య వెసులుబాట్లు కానీ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు.అలాగే మెకానిక్ వృత్తిలో అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి వైద్య సేవలు ఉచితంగా అందించాలని కోరారు.
