
# రైతులు ఆందోళన చెందవద్దు…
# చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే.
# రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవు..
# నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.ఆదివారం నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా అలాగే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను పట్ల ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడారు. వర్షాలకు ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దని,కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.తడిసిన ధాన్యాన్ని నాణ్యత లోపం పేరుతో రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.అలాగే తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కటింగులు చేయరాదని ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే సూచించారు.
ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.రైతు సంక్షేమానికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.తడిసిన ధాన్యం పట్ల రైతులను ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉసిగొల్పడాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు.ధాన్యం కొనుగోళ్లపై తక్షణమే దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశిస్తూ కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించరాదన్నారు.నిత్యం నియోజకవర్గ రైతులకు అండగా నిలుస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.