Justice Is Crying Behind Closed Doors: Mamata Banerjee
న్యాయదేవత దుఃఖిస్తోంది: సీఎం మమతా బెనర్జీ
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదంపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమె.. తన పిటిషన్పై స్వయంగా వాదనలు వినిపించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదంపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమె.. తన పిటిషన్పై స్వయంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తలుపుల వెనుక న్యాయ దేవత దుఃఖిస్తోంది’ అని అన్నారు. సుప్రీంకోర్టులో అయినా తమకు న్యాయం జరగాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు మమత.
పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎం మమతా బెనర్జీ, మోస్తారీ బాను, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లు అన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తన పిటిషన్పై స్వయంగా వాదనలు వినిపించిన సీఎం మమతా బెనర్జీ.. ఎన్నికల సంఘాన్ని ‘వాట్సాప్ కమిషన్’గా అభివర్ణించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలు చూపించినా ఎస్ఐఆర్ అధికారులు అంగీకరించడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు.ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న అసోంలో కాకుండా.. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ను చేపడుతున్నారంటూ ఈసీ తీరుపై మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్న అసోంలో ఎందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం లేదని ప్రశ్నించారామె. బీఎల్ఓలపై ఒత్తిడి తెచ్చి ఓట్లను తొలగిస్తున్నారని.. ఈ అంశంపై ఈసీకి ఆరుసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో బెంగాల్లో వంద మంది చనిపోయారన్నారు. సుప్రీంకోర్టులో అయినా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు సీఎం. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల హక్కులను కాపాడండి’ అని సీజేఐకి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. మమత అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
