
Sarvai Papanna: The First Bahujan King
బహుజన రాజ్యాధికారమే ఆగిన ధ్యేయం.
సర్వాయి పాపన్న గొప్ప పోరాట, విప్లవకారుడు.
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప బహుజన విప్లవకారుడు, ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ నగరం పద్మావతి కాలనీ, గ్రీన్ బెల్ట్ లో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏండ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్‌పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు తొలి బహుజన రాజు అని ఆయన చెప్పారు.
బహుజన కులాలను ఏకం చేసి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొని జమీందారుల ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టాడన్నారు. తన సైన్యం ద్వారా చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించుకుంటూ, తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ను రాజధానిగా చేసుకుని, 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించాడన్నారు. ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న పాపన్న. ఔరంగజేబు మరణానంతరం మొఘల్ రాజు బహదూర్ షా పాపన్నను స్వయం పాలకునిగా సంధికి ఆహ్వానించి కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా కొనసాగవచ్చని బహదూర్ షా ప్రతిపాదన చేశాడని, దానికి అంగీకరించిన పాపన్న, మొఘల్ గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగురవేశాడని చెప్పారు. అయితే ఇది నచ్చని జమీందార్లు, దేశముఖ్‌లు, జాగీర్దార్లు పాపన్న పరిపాలనలో తాము కొనసాగలేమని, ఆయనను పదవి నుంచి తప్పించాలని బహదూర్ షాను వేడుకోవడంతో పాపన్నను బంధించి తేవాలని ఆయన సైన్యాన్ని ఆదేశించారు. మొఘల్ సైన్యం పెద్ద ఎత్తున పాపన్నపై మూకుమ్మడిగా దాడికి దిగగా, పాపన్న తీవ్రంగా గాయపడి కొన్నిరోజుల ఆజ్ఞాత జీవితం గడిపారని, ఆయన మరణంపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నా ఆయన ఒక యోధుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన బాటలో బహుజనులు, గౌడ కులస్తులు నడవాలని పిలుపునిచ్చారు, సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పాపన్న గౌడ్ స్పూర్తి నేటి యువతకు ఆదర్శంగా ఉండేలా ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో శంకుస్థాపన చేసుకుంటున్నామని, తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన చరిత్ర భవిష్యత్ సమాజానికి తెలిసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, టి.పీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇందిర, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.