
Srinivas Matrumurthy.
తూర్పు జర్నలిస్టుల ఔదార్యం..
తోటి జర్నలిస్ట్ కు అండగా తూర్పు జర్నలిస్టులు.
రిపోర్టర్ శ్రీనివాస్ మాతృమూర్తీ అంతిమయాత్రను నిర్వహించిన తూర్పు రిపోర్టర్లు.
వరంగల్ తూర్పు, నేటిధాత్రి.
జర్నలిస్టుకు సమస్య వస్తే తోటి జర్నలిస్టు అండగా ఉండాలి అని కోరుకుంటాం. వరంగల్ తూర్పులో జరిగిన సంఘటన అందుకు నిదర్శనం. తూర్పులో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు తాము నిస్సహాయ స్థితిలో ఉన్న కూడా, కష్ట సమయాల్లో ఉన్న మిత్రుడికి అండగా నిలిచి అందరిచే మన్ననలు పొందారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని వేచి చూడకుండా, సాటి మిత్రుడికి అండగా నిలబడి ఉన్నారు. వరంగల్ తూర్పులో పనిచేసే జర్నలిస్టులు మరోసారి తమ ఐక్యతను చాటుకున్నారు అని చెప్పొచ్చు. గతకొద్ది సంవత్సరాలుగా వరంగల్ తూర్పు ఎలెక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న చిత్తోజు శ్రీనివాస్ తల్లి గారు శుక్రవారం మధ్యాహ్నం చనిపోయారు అనే విషయం తెలువగానే, వెంటనే తోటి జర్నలిస్ట్ కు అండగా నిలిచిన వరంగల్ తూర్పు జర్నలిస్ట్ మిత్రులు చూపిన ఔదార్యం మాటల్లో చెప్పలేనిది. ఆర్థికంగా వెనుకబడిన రిపోర్టర్ శ్రీనుకు నా అనే వారు ఎవరు లేకపోయినా, మేము ఉన్నాం నీకు తోడు అంటూ, ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు ఆర్ధికంగా, ఇంకా ఒక కుటుంబ సభ్యునిలాగా వ్యవహరించిన తీరు అద్భుతం. సదరు రిపోర్టర్ కిరాయి ఉండే ఇంట్లో ఓనర్ తో సైతం మాట్లాడి, దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు తూర్పు జర్నలిస్టులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జర్నలిస్ట్ కు పేరుపేరునా అభినందనలు తెలియచేశారు తోటి మిత్రులు. ఇలానే అందరూ కలిసి డబల్ బెడ్ రూముల కొరకు కలిసి నడవాలని, వరంగల్ లో సపరేట్ గా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకునే వరకు ఇలా ఎప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు కొందరు సీనియర్ జర్నలిస్టులు.