హద్దులు దాటుతున్న మాటలు!

https://epaper.netidhatri.com/view/338/netidhathri-e-paper-4th-aug-2024%09

`ప్రజా క్షేత్రం వేరు..చట్ట సభ వేరు!

`చట్ట సభ పవిత్రమైనది.

`సద్విమర్శలు సాహేతుకం.

`ఆరోపణలు రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనం.

`పాలక పక్షాన్ని నిలదీయడం ప్రతిపక్షాల హక్కు.

`ప్రతిపక్షాన్ని నిందించడం పాలక పక్షం పై ఎత్తు.

`వ్యూహాలు రచించడం అవసరం.

`వ్యక్తిగత విమర్శలు అనర్థదాయకం.

`భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కరం.

`ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ ఏ నాయకుడు కట్టు దాటలేదు.

`స్పీకర్‌ను అమ్మా! అంటేనే తప్పు పట్టారు.

`సవాళ్లు, ప్రతి సవాళ్లు సహజం.

`గతంలో ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి నోరు జారారు.

`జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

`కేసిఆర్‌ సభకు క్షమాపణ చెప్పారు.

`కొత్త సభ్యుడికి అవగాహన లేక నోరు జారాడని చెప్పారు.

`భవిష్యత్తులో ఎవరూ నోరు జారొద్దని సూచనలు చేశారు.

`తాజాగా దానం నాగేందర్‌ అసహనానికి లోనయ్యారు.

`బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.

`దానం వ్యాఖ్యలను సిఎం తప్పు పట్టలేదు.

`బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించారు.

`అక్భరుద్దీన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

`దానం వ్యాఖ్యలను స్పీకర్‌ రికార్డులనుంచి తొలగించారు.

`తెలంగాణ రాజకీయాలు ఆరోగ్య కరంగా వున్నాయి.

`కలుషితం చేసి చరిత్ర హీనులు కావొద్దు.

`ప్రతిపక్షాలు అతి చేయొద్దు.

`పాలక పక్షం తొందరపడొద్దు.

`ప్రజల ముందు రెండు పార్టీలు చులకన కావొద్దు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ అసెంబ్లీలో మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎమ్మెల్యేలు కట్టు దాటి మాట్లాడుతున్నారు. తెలంగాణకే తలవంపులు తెచ్చిపెడుతున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కించపర్చుతున్నారు. తమ అవగాహనా లోపాన్ని తెలంగాణ మీద రుద్దుతున్నారు. వారి అసహనాన్ని తెలియజేసే క్రమంలో బూతుల పంచాంగం వల్లెవేస్తూ, అదే తెలంగాణలో సహజం అంటూ సమర్ధించుకుంటున్నారు. అలాంటి ఘటన తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్నది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం ఆవేశంతో ఊగిపోయారు. సహనం కోల్పోయారు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడ్డారు. తనను తాను మర్చిపోయి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్టు తిట్లదండకం అందుకున్నారు. ఇలాంటి సన్నివేషంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాతే కాదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర్రంలో ఎప్పుడూ వినలేదు. ఎవరూ అలాంటి బూతుల పంచాంగం చదవలేదు. ఏపి అసెంబ్లీ సమావేశాలలో జరుగుతున్న తీరును తెచ్చి తెలంగాణలో వున్న ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన రాజకీయాలను కలుషితం చేయాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నలు విని పిస్తున్నాయి. తెలుగు భాషలో తెలంగాణ యాస చాల గొప్పది. తెలంగాణ యాసలో ఎక్కడా బూతు పదాలకు తావులేదు. వ్యవహారిక బాషలోకూడా తప్పులకు చోటు లేదు. సంస్కృతాన్ని మించిన అందమైన యాస తెలంగాణలో వుంది. అలాంటి యాసలో తెలంగాణ ప్రాంతంలో వ్యవహారిక నామంతో తిట్టులను ఆనవాయితీ అంటూ చట్ట సభలు ఎంపికైన వ్యక్తులు మాట్లాడడం ప్రాంతాన్ని కించపర్చడమే. కుటుంబ వ్యవస్దను నిందించడమే అవుతుంది. ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ యాసను విలన్ల నోటి నుంచి వల్లిస్తేనే తెలంగాణ సమాజం అంగీకరించలేదు. సిని పరిశ్రమ మీద యుద్దం ప్రకటించినంత పనిచేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యాసను సినీ రంగం కూడా నెత్తిన పెట్టుకొని పూజిస్తున్న దశలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సభ్య సమాజం ఖండిస్తోంది. దానం నాగేందర్‌ మాట్లాడిన మాటలు తెలంగాణకే అవమాన కరం. పైగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టడం వల్లనే తాన అదుపు తప్పి మాట్లాడినట్లు దానం సమర్దించుకోవడం సరైంది కాదు. తల్లిదండ్రులను గౌరవించడం మన సంప్రదాయం. వారిని అగౌరపర్చేవిధంగా వ్యాఖ్యలు చేయడం ఎవరూ సహించలేనిది. సహజంగా సమాజంలో కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలకు, పవిత్రమైన చట్ట సభల్లో వ్యాఖ్యలకు చాలా తేడా వుంటుంది. చట్ట సభ సభ్యులు ఎంత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం వుంటుంది. ఒక వ్యక్తికి కోపమొచ్చిన ప్రతీసారి అమ్మను జోడిస్తూ మాట్లాడడాన్ని ఎవరూ స్వాగతించరు. సమాజంలోనే ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తేనే పెద్ద వివాదమౌతుంది. అలాంటిది శాసన సభ్యుడు దానం నాగేందర్‌ మాట్లాడాడం సమర్ధనీయం కాదు. పైగా దానం నాగేందర్‌ తెలంగాణలో అలా మాట్లాడడం ఆనవాయితీ అనడం ఆయన తన తప్పును సమర్ధించుకోవడమే అవుతుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబించేదే మన భాష. అలాంటి బాషలో బూతులు జత చేసి, అవే మన సంస్కృతి అని చెప్పుకోడం సరైంది కాదు. 

 

 సరిగ్గా పదేళ్ల క్రితం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్‌ సమావేశాల్లో కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టి, మంత్రి కూడా అయిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సమాధానం చెబుతున్న సందర్భంలో అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అప్పటి ప్రదాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్తున్న క్రమంలో సమాధానం కూడా వినే ఓపిక కూడా వాళ్లకు లేదు. అంటూ ఓ పదం వాడారు. అయితే అప్పుడు మైక్‌ ఆన్‌లో లేదు. రికార్డుల్లోకి కూడా వెళ్లలేదు. ఆ మాట విన్న జానారెడ్డి వాకౌట్‌ అనంతరం సభలోకి వచ్చిన వెంటనే ఈ విషయం సభ దృష్టికి తీసుకెళ్లారు. ఒక బాధ్యత కల్గిన మంత్రి నీ అవ్వ..అనడం ఏమిటని ప్రశ్నించారు. ఇది సభ్య సమాజానికి సిగ్గు చేటన్నారు. అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని జానారెడ్డి నిరసించారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ లేచి జగదీశ్‌రెడ్డి తరుపున సారీ చెప్పారు. సభ్యుడు తొలిసారి ఎన్నికై సభకు వచ్చారు. తెలిసి జరిగిన తప్పిదం కాదు. ఏది ఏమైనా జగదీశ్‌రెడ్డి అలాంటి వ్యాఖ్య చేయడం తప్పని భేషరుతుగా క్షమాపణ చెబుతున్నామని కేసిఆర్‌ ప్రకటించారు. తర్వాత కొత్త సభ్యులతోపాటు, అందరు ఎమ్మెల్యేలకు సభలో ఎలా మాట్లాడాలి? రూల్స్‌ మీద అవగాహన కల్పిందుకు క్లాసులు తీసుకోవాలని నిర్ణయం ప్రకటించారు. జగదీష్‌రెడ్డి చేత కూడా క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ఏనాడు తెలంగాణ అసెంబ్లీలో ఎవరూ ఎలాంటి తప్పుడు వ్యాఖ్య చేయలేదు. నోరు అదుపు తప్పలేదు. సభలో కోప తాపాలకు తావివ్వలేదు. కాని దానం నాగేందర్‌ వ్యవహార శైలిని ఎంఐఎం. సభా పక్ష నేత తీవ్రంగా వ్యతిరేకించారు. సీనియర్‌ సభ్యుడు దానం నాగేందర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరానిదని కూడా అన్నారు. 

                                 

ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు లాంటి వారు కూడా తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదనే వారు..కాని ఏనాడు ఆయన కూడా అదుపు తప్పి మాట్లాడిరది లేదు. కాకపోతే తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపి రాజకీయాల్లో ఇలాంటి బాషకు చోటు పెరిగింది. అక్కడ విచ్చలవిడిగా అసెంబ్లీలో ఇలాంటి పదాలు వాడుతూ వస్తున్నారు. అందుకు తెలుగుదేశం పార్టీయే బీజం వేసిందని చెప్పాలి. విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ, అప్పటి ప్రతిపక్ష వైసిసి గుడివాడ ఎమ్మెల్యే నానిని అసెంబ్లీలో తీవ్ర పదజాలంతో దూషించాడు. అసెంబ్లీలో ఉపయోగించని పదాలను వాడాడు. ఏకంగా అసెంబ్లీలోనే పాతిపెడతాను..నా కొడకా! అంటూ హెచ్చరించారు. అది అసెంబ్లీలో పెద్ద దుమారం రేపింది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. ఆ తర్వాత అక్కడ కూడా అలాంటి సన్ని వేషాలు కనిపించలేదు. తర్వాత వైసిపి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత బైట క్షేత్ర స్ధాయిలో తెలుగుదేశం నాయకులను విపరీతంగా తిట్టేవారు. కాని అసెంబ్లీలో మాత్రం అలాంటి పదాలు ఎవరూ వాడలేదు. కాని తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా దానం నాగేందర్‌ వ్యాఖ్యానించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. గతంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నప్పుడు అప్పటి నాయకులు కొంత కట్టు దాటారు. 2004 ఎన్నికల తర్వాత అప్పటి ఆర్ధిక మంత్రిగా, శాసనసభ వ్యవహారా శాఖను నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఒక దశలో సహనం కోల్పోయారు. చంద్రబాబు చేయి తీసేస్తానంటూ అదుపు తప్పి మాట్లాడారు. అయితే తాను కోపంతో కాకుండా కావాలనే సరదాగానే అన్నాననంటూ సమర్ధించుకున్నారు. పదే పదే చంద్రబాబు వేలు చూపిస్తూ తనను బెదిరిస్తున్నారని అందుకే చేయి తీసేస్తాను అన్నట్లు చెప్పారు. అయితే అది కూడా తప్పని ఆయన తర్వాత అప్పాలజీ చెప్పారు. ఇక 2009 ఎన్నికల ముందు ఫిబ్రవరిలో జరిగిన ఆఖరు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునుద్దేశించి వైఎస్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వైఎస్‌ రాజకీయ జీవితంలో ఆ మాటలు మచ్చగా మిగిలిపోయాయి. సభలో సహనం కోల్పోయిన వైఎస్‌. రాజశేఖరరెడ్డి ఒక దశలో చంద్రబాబునుద్దేశించి, తన తల్లి కడుపున ఎందుకు పుట్టానా? అని ఏడ్చే రోజు తీసుకొస్తానంటూ హెచ్చరించారు. అది అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. వైఎస్‌. రాజశేఖరెరెడ్డి వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా ఖండిరచారు. ప్రజా సంఘాలు కూడా తప్పని చెప్పాయి. ముఖ్యమంత్రి స్ధానంలో వున్న వాళ్లు అలా సహనం కోల్పోవడం వల్ల ప్రజాస్వామ్యం పరిహాసమైతుందన్నారు. ఆ మాటల ప్రభావం 2009 ఎన్నికల్లో చూపిందని చాల మంది అనేవారు. ఎందుకంటే 2004 ఎన్నికల్లో 45 సీట్లు వున్న తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో 99 సీట్లు పొంది బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. పవిత్రమైన అసెంబ్లీలో నాయకులు చేసే వాఖ్యలు కూడా ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తాయి. అందువల్ల నాయకులు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడడం ఎంతో అవసరం. పార్టీలకు గౌరవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!