అవి వరాలా! మరమరాలా!!

https://epaper.netidhatri.com/

`చెప్పినవి ఆరు అలవి కానివే!

` తెలంగాణ రాష్ట్రం సంపన్నమైనదా?`అప్పులపాలైందా?

`ఏదో ఒకటి స్పష్టంగా చెప్పండి?

`అప్పుల రాష్ట్రంలో ఈ హామీలు ఎలా అమలు చేస్తారు?

`లేదంటే తెలంగాణ సంపన్న రాష్ట్రమని ఒప్పుకుంటారా?

`ప్రతి మహిళలకు రెండున్నర వేలు, ఇచ్చి ఆసరా పెన్షన్‌ ఇస్తారా? ఆపేస్తారా?

`ఏదో ఒకటి అమలు చేస్తారా?

`ఆసరా పెన్షన్‌ కట్‌ చేస్తామని ముందే చెబుతున్నారా?

`కౌలు రైతుకు, అసలు రైతుకు ఇద్దరికీ రైతు బంధు ఇస్తారా?

`కౌలు రైతు పేరు చెప్పి అసలు రైతుకు మంగళం పాడతారా?

`ఆర్టీసి బస్సులంటే అన్ని రకాల సర్వీసులా?

`పల్లె వెలుగుకు పరిమితమా?

`తెలంగాణ మొత్తం ఉచిత ప్రయాణం సాధ్యమయ్యే పనేనా?

`గృహలక్ష్మి పథకం పేరుతో ఇందిరమ్మ ఇళ్లే ఇవ్వొచ్చు కదా?

`స్థలాలు ఇవ్వడం సాధ్యం కాదని ముందే చెప్పినట్లా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికల తరుణం ముంచుకొస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి. లేకుంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు అన్నది కలగా మిగిలిపోతుంది. దేశంలోనే కాంగ్రెస్‌ పార్టీ పరిస్దితి అద్వాహ్నంగా వుంది. పదేళ్ల కాలంలో కోలుకోలేని దెబ్బలు తింటూ, ఎదుగూ బొదుగూ లేకుండాపోయింది. అయితే ఎదగాలన్న ఆశ బాగానే వున్నా, ప్రజలకు కాంగ్రెస్‌ మీద విశ్వాసం కలగడం లేదు. కారణం ఆ పార్టీ చేసుకున్న స్వయం కృతాపరాధాలు అనేకం వున్నాయి. అవి ఏ తరమైనా కావొచ్చు. ఆది నుంచి కొన్ని మంచి పనులు చేస్తూ వచ్చిన, వేసిన అడుగుల్లో చాలా వరకు తప్పటడుగులు కూడా వున్నాయి. అవే ఇప్పుడు శాపంగా మారిపోయాయి. ఎందుకంటే తెలంగాణ అస్ధిత్వాన్ని మొదట దెబ్బతీసింది కాంగ్రెస్‌ పార్టీయే. ఆత్మ గౌరవం లేకుండా చేసింది కాంగ్రెస్‌ పార్టీయే. 1946 నుంచి 1950 దాకా నాటి నిజాంను వ్యతిరేకంగా నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి, విముక్తి కలిగిన ప్రాంతం తెలంగాణ. దాని అస్దిత్వాన్ని చూసి మురిసిపోకముందే, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసేశారు. ఇదీ తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన తొలి అన్యాయం. అప్పటి నుంచి అరవైఏళ్ల పాటు మాకు మేముగా వుంటాం. మా పాలన మేం చేసుకుంటాం. మా అభివృద్ధి మేం చేసుకుంటాం. మా ఉద్యోగాలు మేం కల్పించుకుంటాం. అని ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు వినలేదు. దాంతో పాలన సీమాంధ్ర ప్రాంత నాయకుల గుప్పిట్లో పెట్టుకొని, తెలంగాణ నాయకులను పదవులు ఆశలో ఓలలాడిస్తూ తెలంగాణ సంపద దోచుకున్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టారు. తెలంగాణ నిధులతో సీమాంధ్రలో ప్రాజెక్టులు కట్టుకున్నారు. తెలంగాణ ఎండబెట్టారు. ఎడారి చేశారు. తెలంగాణ ఊళ్లను వల్ల కాడు చేశారు. పల్లెను చిదిమేశారు. బతుకు లేకుండా చేశారు. బతకలేని స్ధితిలోకి తెలంగాణను నెట్టేశారు. తెలంగాణ ప్రజలను ద్వితీయ పౌరులుగా చూశారు. ఆధిపత్య పైత్యంలో తెలంగాణను అణచివేశారు. తెలంగాణ యువతకు జీవితాలు లేకుండా చేశారు. ఉపాది లేకుండా చేశారు. నక్సలైట్లుగా మారిన వారిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు. తెలంగాణను అల్ల కల్లోలం చేశారు. తెలంగాణ పల్లెలకు నిద్రలేకుండా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఇరవైఏళ్ల క్రితం తెలంగాణ పల్లె ఎప్పుడు నిద్రపోయిందో కూడా గుర్తులేని జీవితం గడిపింది. తొలి తెలంగాణ ఉద్యమంలో 375 మంది ఉద్యమాకారులు చంపిన పాపం కాంగ్రెస్‌ పార్టీదే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకుంటే, పుబ్బలో పుట్టిందన్నారు. మగలో మాడిపోతుందన్నారు. ఉద్యమాన్ని ఊదేస్తామన్నారు. ఉద్యమకారులను హింసించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అణిచివేశారు. మలి దశలో వందలాది మంది ఉద్యమ కారులు ప్రాణాలు పోవడానికి కారణం కాంగ్రెస్సే అన్నది ప్రజల్లో ఏనాడో నాటుకుపోయింది. దాంతో కాంగ్రెస్‌కు తెలంగాణ లో నూకలు లేకుండా పోయాయి. తెలంగాణ ఇచ్చింది మేమే..అని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. ఇస్తామన్న తర్వాత వెంటనే ఇచ్చి వుంటే ఆ క్రెడిట్‌ నిజంగా కాంగ్రెస్‌కే దక్కేది. కాని కాలయాపన చేస్తూ, పదేళ్లు జాప్యం చేసి, ఇక తప్పని పరిస్ధితి వచ్చి తెలంగాణ ఇచ్చారే గాని, ప్రజల మీద ప్రేమతో ఇవ్వలేదు. తెలంగాణ అంటే గౌరవంతో ఇవ్వలేదు.
పదేళ్ల తర్వాతనైనా పార్టీ అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్తు వుండదనే భయంతోనే ఆనాడు 2004లో తెలంగాణ ఇస్తామని ఎలా మోసం చేసి అధికారంలోకి వచ్చిందో..ఇప్పుడు కూడా అదే దారిలో కాంగ్రెస్‌ నడుస్తోంది.
అలవి కాని హామీలను గుప్పిస్తోంది. గతంలో ఓసారి పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు అబద్దాలాడైనా సరే..అదికారంలోకి రావాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్‌ వుంది. కాని ప్రజలు నమ్ముతారా లేదా? అన్న డైలమా కూడా కొనసాగుతోంది. అందుకే ప్రజల ముందైతే ముందు ఐదు వరాలు వుంచారు. తాజాగా వాటిని ఆరు వరాలుగా మార్చారు. ఇంత వరకు బాగానే వుంది. కాని వాటి అమలు విషయంలో ప్రజల్లో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న హామీలు అవి వరాల…లేక మరమరాలా? అని ప్రజలు నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సంపన్న రాష్ట్రమని చెబుతూ వస్తారు. దాన్ని కాంగ్రెస్‌ పదే, పదే ఎగతాళి చేస్తూ వస్తోంది. అసలు ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని స్దితిలో వుండి ఎలా సంపన్న రాష్ట్రమంటారని అనేక సార్లు ప్రశ్నించింది. మరి తెలంగాణ సంపన్న రాష్ట్రం కాకపోతే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రకటించిన పథకాలు ఎలా అమలు చేస్తారు? అంటే ఎన్నికల కోసం ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారా? అధికారం కోసం మభ్యపెట్టాలని చూస్తున్నారా? దీనికి సమాదానం చెప్పాల్సిన అవసరం వుంది. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ మాట్లాడిన కాంగ్రెస్‌ నాయకులు అప్పుల రాష్ట్రంలో అలవి కాని హమీలు ఎలా అమలు చేస్తారన్నదానిపై స్పష్టత ఖచ్చితంగా ఇవ్వాలి. ముఖ్యంగా తెలంగాణ అస్ధిత్వం మీద ఇప్పటికీ ఒక నమ్మకంలేని, విశ్వాసం లేని కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ పాలన చేతికిస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మన రాష్ట్రమన్న గౌరవమే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు లేదు. ఇక ప్రతి మహిళకు రెండున్న వేలు ఇస్తామని నోరుంది కదా? అని చెప్పేస్తే సరిపోతుందా? తెలంగాణ జనాభాలో సగం మంది మహిళలు వున్నారు. అంటే సుమారు రెండు కోట్ల మంది మహిళలువున్నారు. వారందరికీ ఇస్తారా? లేక ఎన్నికల్లో గట్టెక్కాక కొర్రీలు పెడతారా? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో సుమారు 48లక్షల మందికి ఆసరా ఫించన్లు అందుతున్నాయి. వీటికి తోడు మరికొన్ని పించన్లు కూడా అమలౌతున్నాయి. ఓ వైపు ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామంటున్నారు. ఆసరా ఫించన్లు నాలుగు వేలు ఇస్తామంటున్నారు. అటు ఆసరా, ఇటు మహిళా పించన్‌ రెండూ ఇస్తారా? లేక ఒకటి వుంటే మరోకటి లేదని చెబుతారా? ఏ ప్రాతిపదికన ఇస్తామన్నదానిపై ఇప్పుడు స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్‌ గతంలో చేసిన మోసాలు అనేకం వున్నాయి. ఇక కౌలు రైతులు ఓట్ల కోసం వారికి కూడా రైతుబంధు అమలు చేస్తామని చెబుతున్నారు. సంతోషం..కాని ఎలా ఇస్తారు? ఫలానా భూమి కౌలుకు చేస్తున్నానంటూ కౌలు దారుడు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకొని ఇచ్చేస్తారా? అదే జరిగితే అసలైన భూ యజమానికి రైతు బంధు కట్‌ చేస్తారా? ఇద్దరికీ ఇవ్వడం అన్నది సాధ్యమౌతుందా? కౌలు రైతుకు భూమిపై హక్కు కల్పించి, భూ తగాదాల చిచ్చు రేపినట్లు కాదా? ఇక మహిళలందరికీ తెలంగాణ అంతటా ఆర్టీసిలో ఉచిత ప్రయాణం అంటున్నారు. నిజంగా సాధ్యమయ్యే పనేనా? ఒక వేళ అధికారంలోకి వస్తే, పల్లె వెలుగుల్లో అంటూ తిరకాసు పెడతారా? అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే చెప్పే ధైర్యం కాంగ్రెస్‌ చేస్తుందా? ఇక గృహ లక్ష్మి పేరుతో స్థలం వున్నవారికి రూ.5 లక్షలు ఇస్తామంటే జనం నమ్మడానికి సిద్దంగా లేరు. నిజంగానే ఇందిరమ్మఇండ్లు గతంలో లాగా కట్టిస్తామంటే నమ్మేవారేమో? కాని ఇంటికి సాయం చేస్తామంటే ప్రజలు అసలే నమ్మరు. అయితే తెలంగాణలో పేద ప్రజలకు స్ధలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి సిద్దంగా లేమని ముందే తేల్చి చెప్పినంత పనిచేసిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారా? అలవి కాని హామీలైనా సరే నమ్మేలా వుండాలి. ఇందిరమ్మ ఇండ్లు అంటే అందరూ నమ్మేవారు. స్ధలం వుంటే అన్న తిరకాసు పెడితే ఊరికి పది మందికి కూడా ఇవ్వాల్సిన పరిస్దితి రాకపోకపోవచ్చు. పట్ణణాల్లో ఆ పథకం గురించి ప్రజలు ఆలోచించే పరిస్దితే లేకుండా పోవచ్చు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో పట్టణాల్లో స్థలం కొనుగోలు చేయడం అంటే సామాన్యుడు జీవితాంతం కష్టపడినా కొనుక్కోలేడు. కాంగ్రెస్‌ ఇచ్చే ఐదు లక్షలు తీసుకోలేడు. ఇదీ మాటరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!