మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ….
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల ఈద్గా ప్రాంతంలో సోమవారం పవిత్ర రంజాన్ పర్వదినంలో భాగంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ…

రంజాన్ పండుగ మతసామరస్యానికి,సుహృ ద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, ధాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.ప్రార్థనలో భాగంగా ముస్లింలు అందరు ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 కి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. రంజాన్ మాసంలో 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలలో ఉంటారని తెలిపారు. చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈద్గా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు, యాకుబ్ ఆలీ,డాక్టర్ సలీం, లాడెన్, ఎం డి పాషా, ఖలీం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, నాయకులు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, ధీకొండ శ్యాం గౌడ్,శ్రీనివాస్, గోపతి భానేశ్, సత్యపాల్, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.