ప్రకృతిని పూజించే పండుగ .

ప్రకృతిని పూజించే పండుగ సిత్ల పండుగ…

గిరిజనుల ప్రకృతి ఆరాధనే సిత్ల…

బంజారాల సంస్కృతీ -సిత్ల భవాని పండుగ…

బంజారాలు ఎంతో పవిత్రంగా జరుపుకునే మొదటి పండుగ సిత్ల పండుగ…

సిత్ల పండుగ రోజును సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న గిరిజనులు…

నేటిధాత్రి-

 

 

 

 

 

 

 

 

 

మహబూబాబాద్-గార్ల గిరిజనుల కట్టు,బొట్టు వేషధారణ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అతి పవిత్రంగా ఉంటాయి.ప్రకృతిని పూజించడం,ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత.ప్రతి సంవత్సరం పెద్ద పూసల కార్తె మొదటి లేదా రెండవ మంగళవారం గిరిజన జాతి శోభ ఉట్టిపడేలా సీత్ల పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.సీత్ల పండుగను బంజారా జాతి మొత్తం ఓకే రోజున జరుపుకొని జాతీ ఐక్యతను చాటుతారు.పశు సంపదకు గాలికుంటు వ్యాధి రాకుండా, పశు సంపద బాగా వృద్ధి చెందాలని, వర్షాలు కూరవాలని, పంటలు సమృద్ధిగా పండాలని,ప్రకృతి కరుణించాలని,తండ ప్రజలందరిని దేవత సల్లగా ఉండేలా దీవించాలని, పశువులకు ఎటువంటి రోగాలు రాకూడదని,ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉండాలని, తండా వాసులు వారి పశువులను ఒకే చోటికి చేర్చి అందరు కలిసి సిత్ల భవాని (సాతు భవానీలను )దేవత ను బంజారాల సాంప్రదాయ పద్దతిలో పూజిస్తారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పూర్వం గిరిజనులు ఎక్కువ సంఖ్యలో పసుపు సంపదను కలిగి ఉండి వ్యవసాయమే జీవన ఆధారంగా జీవించేవారు.తండాలో పశువులు, గోర్లు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలని, దూడలకు పాలు సరిపోను ఉండాలని,గడ్డి బాగా దొరకాలని, క్రూరమృగాల బారిన పడకుండా ఉండాలని, అటవీ సంపద తరగకూడదని సిత్ల భవాని మొక్కులు తీర్చుకుంటారు.ప్రకృతి ఆధారంగా తరతరాలుగా తండాలను ఏర్పరుచుకొని లంబాడిలు తమ మనుగడను కాపాడుకున్నారు. సిత్ల పండుగ సందర్బంగా వాంసిడో ను కన్నెపిల్లలు సిత్ల భవానీలకు సమర్పించడం ఆనవాయితీ.ఒకరోజు ముందు జొన్నలు, పప్పుధాన్యాలను నానబెట్టి తయారు చేసిన ఘుగ్రీ (గుగ్గిళ్ళు )నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని గిరిజనులు వాంసిడో (ప్రాచీన నైవేద్యం గా చెబుతారు. సిత్ల పండుగ ప్రకృతి ని ఆరాధించే సాంప్రదాయ పండుగ. పశు సంపద, అభివృద్ధి, ఆరోగ్యం, తండా సౌభాగ్యం కోసం సిత్ల యాడి పూజ చేయడం గిరిజనుల ఆనవాయితి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆషాడం లో జులై మాసంలో పెద్ద పూసాల కార్తె లో మంగళవారం రోజున ఎంతో ఘనంగా సిత్ల పండుగ నిర్వహిస్తారు. లంబాడిలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. (1)మేరమ్మ 2)తుల్జ 3)సిత్ల 4)అంబా భవాని 5)హింగ్లా 6) ద్వాళాంగర్ 7)కంకాళి ఏడుగురు దేవతలతో పాటు ముందు భాగంలో లుంకడియా దేవుడిని ప్రతిష్టించి పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్ళు (ఘుగ్రీ ), పాయసం (లాప్సీ )సమర్పిస్తారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి వాటిపై నుంచి పశువులను దాటిస్తారు. అలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండుతాయని బంజారాల నమ్మకం. సిత్ల యాడి దేవతను పూజించే క్రమంలో పెద్దమనిషిని పూజారిగా ఉంచి, అతని చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 8న మంగళవారం రోజు బంజారాలు నిర్వహించే సిత్ల పండుగ రోజున సెలవు ప్రకటించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!