
Fake corn seeds.
నకిలీ విత్తనాల పుణ్యమా అంటూ లక్షల్లో నష్టపోయిన రైతన్న…
నకిలీ విత్తనాలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతన్న…
నకిలీ మొక్కజొన్న విత్తనాలతో అన్నదాతకు నష్టాలు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -బయ్యారం:-
అధిక దిగుబడి వస్తుందని,వ్యవసాయం లాభసాటిగా మారుతుందని భావించిన రైతన్నకు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతూ మోసం చేస్తున్నారు.పంట ఏపుగా వస్తుందని భావించి దుకాణదారుడు విక్రయించిన విత్తనాలు 40 రోజులు దాటిన పంట ఎదుగుదలలో మార్పు రాకపోవడంతో రైతన్న ఆవేదన చెందుతున్నారు.పెరిగిన మొక్క ఒక్కొక్కటిగా కళ్ళముందే చనిపోవడంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.బాధిత రైతు కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలం, గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న ఏడు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.మొక్కజొన్న పంట సాగు నిమిత్తం మదీనా ట్రేడర్స్ వద్ద నుండి పైనియర్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేశారు.

నాటిన విత్తనాలు 40 రోజులు దాటినప్పటికీ ఎదుగుదల రాకపోవడంతో రైతు కన్నీటి పర్యంతమైనారు.భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులతో విత్తనాలు కొనుగోలు చేసిన రైతుకు మొక్కలు ఒక్కొక్కటిగా చనిపోవడంతో భార్య, భర్తలు పంట చేలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని రైతు వాపోయాడు.తనకు కాలం చెల్లిన నకిలీ విత్తనాలను విక్రయించి,మోసం చేసిన సదరు మదిన ట్రేడర్స్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కౌలు రైతు వెంకన్న డిమాండ్ చేశారు.నష్టపోయిన మొక్కజొన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే తమకు చావే శరణ్యమని రైతు వాపోయాడు.నకిలీ విత్తనాలను అంటగడుతూ రైతును నిండా ముంచి, పంట నష్టానికి కారకుడైన సదరు వ్యాపారస్తుడిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులు,రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.