ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ
ఆధిపత్యం నిలుపుకునేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల పోరు
ఎన్నికలు జరపాలంటూ విద్యాశాఖ మంత్రిపై దాడి
ర్యాంగింగ్, రాజకీయం, హింసలతో కునారిల్లుతున్న యూనివర్సిటీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల్లో కోత
విద్యార్థుల విపరీత పోకడలే కారణం
నిధులు తగ్గడంలో కుంటుపడుతున్న యూనివర్సిటీ పాలన
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒకప్పుడు దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, విద్యాసంస్థలుగా పేరుపడ్డ చాలా సంస్థలు నే డు విద్యార్థి రాజకీయాల పేరుతో వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు హింసాత్మక సంఘటనలకు దారితీసి మొత్తంమీద విద్యార్థులకు విద్యతో పాటు రాజకీయ పరిజ్ఞానం కలిగించాలన్న అసలు లక్ష్యం పూర్తిగా దెబ్బతింటోంది.యూనివర్సిటీలు భ్రష్టుపట్టి పోవడానికి ప్రధాన కారణం ఈ విద్యార్థి రాజకీయాలు ముదిరిపోరు హింసకు దారితీయడమే. ఎంతోకష్టపడి తమ పిల్లల్ని ఉన్నతవిద్యకోసం పంపితే రాజకీయాల పేరుతో తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవడం ఆయా తల్లిదండ్రుల హృదయాలు ఎంతటి తీవ్ర మనోవేదనకు గురవుతాయో అర్థంచేసుకోవచ్చు. దేశంలో ప్రైవేటు విద్యకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ విద్య అన్నిరకాలుగా భ్రష్టుపట్టిపోవడమే. హింస, ఘర్షణలు, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా యూనివర్సిటీలకు కేటాయించే నిధుల్లో కోత విధిస్తుండటంతో అక్కడి విద్యాప్రమాణాలు, మౌలిక సదుపాయాలు దారుణంగా పడిపోతున్నదన్నసత్యం వర్తమాన చరిత్ర స్పష్టం చేస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణ కోల్‌కతాలోని జాదవ్ యూనివర్సిటీ. ఇది ఒకప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుండేది. కానీ ప్రస్తుతం భయంకరమైన రీతిలో ర్యాగింగ్, హాస్టళ్లలో బెదిరింపులు వంటివి సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ సీనియర్ విద్యార్థులు జూనియర్లను చాలా హేయనీయమైన రీతిలో భౌతిక, మానసిక హింసకు పాల్పడుతూ ర్యాగింగ్‌లు నిర్వహిస్తారన్న ఆరోపణలున్నాయి. ఈ యూనివర్సిటీలోవామపక్ష విద్యార్థి సంఘాలదే ఆధిపత్యం. ఇటీవల ఈ యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సం ఘాల నాయకులు, పశ్చిమబెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో మళ్లీ ఈ యూనివర్సిటీ పతాకశీర్షికలకెక్కింది. విద్యాపరంగా ఒకప్పుడు అత్యున్నత ప్రమాణాలను పాటించే సంస్థగా పేరుపడ్డ ఈ యూనివర్సిటీ ప్రస్తుతం సీపీఎం, తృణమూల్ మరియు బీజేపీల మధ్య ఆధిపత్యపోరుకు ప్రధాన కేంద్రంగా మారడం విషాదం.
మార్చి1వ తేదీన యూనివర్సిటీలో తృణమూల్ అనుబంధ సంస్థ అయిన ‘వెస్ట్ బెంగాల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అసోసియేషన్ (డబ్ల్యుబీసీయుపీఏ)’ ఏర్పాటు చేసిన ఒక సదస్సుకు అధ్యక్షత వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు యూనివర్సిటీకి విచ్చేశారు. సరిగ్గా ఇదే సమయంలో యూనివర్సిటీకి చెందిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆయనతో గొడవకు దిగారు. 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికలను మళ్లీ ఎప్పుడు ప్రకటిస్తారనేది ప్రధానంగా వారు లేవనెత్తుతున్న ప్రశ్న. ఇదే అంశంపై స్పష్ట మైన సమాధానం ఇవ్వాలని వారు విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేయడంతో గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చి, సదస్సు ప్రదేశం, అక్కడి ఫర్నీచర్ విద్యార్థుల చేతుల్లో ధ్వంసమయ్యాయి. ఇదేసమయంలో ఓంప్రకాశ్ మిశ్రా అనే ఒక ప్రొఫెసర్‌పై దాడిచేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన గూండాలు తమపై దాడిచేయడం, మంత్రి కారును వేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో తమ సహచరులు గాయపడటం వల్లనే తాము ఎదురుదాడికి దిగామని లెఫ్ట్ రివల్యూషనరీ ఫ్రంట్ మరియు ఎస్‌ఎఫ్‌ఐ (సీపీఎం అనుబంధ సంస్థ) విద్యార్థి నాయకులు వెల్లడిరచారు. తర్వాత పోలీసులు దాడికి బాధ్యులైన విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మార్చి 6వ తేదీన కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేర నిర్లక్ష్యంగా కారును నడిపినందుకు కారుడ్రైవర్ మరియు మంత్రిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే సమస్య అంతటితో సమసి పోలేదు. వామపక్ష విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులను కొనసాగిస్తూ వచ్చాయి. ముఖ్యంగా మార్చి 17వ తేదీన వారు తాత్కాలిక యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ భాస్కర్ గుప్తా ఎన్నికలు ఎప్పుడు జరిపేదీ నిర్ణయించేందుకు తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేయడంతో మళ్లీ యూనివర్సిటీలో హింసాత్మక వాతావరణం నెలకొంది.
2019లో కూడా సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. 2019లో కేంద్రంలో మంత్రిగా వున్న బాబుల్ సుప్రియో (2021లో ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు) అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గనడానికి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగావామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్, భాజపాలు రాజకీయంగా ప్రత్యర్థులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. ప్రస్తుతం తృణమూల్ మంత్రిపై జరిగిన దాడి నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు వామపక్ష విద్యార్థి సంఘాల కువ్యతిరేకంగా తమ గళం విప్పడం విచిత్ర పరిణామం. ఇదే సమయంలో ఒకప్పుడు మితవాద వామపక్ష మరియు అతివాద వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య కూడా తీవ్ర విభేదాలుండేవి. తాజాపరిణామాల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు ఏకం కావడం మరో విచిత్ర పరిణామం.
నిజానికి జాదవ్ యూనివర్సిటీకి గతంలో హింసాత్మక సంఘటనల చరిత్ర వుంది. నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా వున్న 1970ల్లో అప్పటి యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ గోపాల్ చంద్రసేన్ క్యాంపస్‌లోనే దారుణహత్యకు గురయ్యారు. ఇంతటి దారుణ సంఘటనలు జరిగినప్పటికీ యూనివర్సిటీలో రీసెర్చ్ మరియు ఇతర అకాడమిక్ కార్యకలాపాలు దెబ్బతిన్న చరిత్ర లేదు. తాజా పరిణా మాల నేపథ్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తు న్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం విద్యార్థి సంఘాల ఎన్నికలు ఆలస్యమైనంత మాత్రాన ఇంతటి దారుణమైన దాడులకు హింసాత్మక చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏ మొచ్చిందని యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే గత ఐదేళ్లుగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపకపోవడం వల్ల పరిపాలన మొత్తం నిరంకుశంగా మారిందని, ప్రజాస్వామ్యం కనిపించడంలేదని వామపక్ష విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. క్యాంపస్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో 2017నుంచి కేంద్రం యూనివర్సిటీకి నిధులను నిలిపివేయగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన వాటా నిధులను గణనీయంగా తగ్గించింది. దీంతో యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల నిర్వహణ కష్టతరంగా మారింది. నిధుల కేటాయిం పు విషయంలో ఎవరి వాదనలు వారివే. తమ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా, అసలు క్యాంపస్‌లో అరాచకానికి ప్రధాన కారణం ఈ సంఘాలేనని తృణమూల్, బీజేపీ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలావుండగా కేంద్రం జాదవ్ యూనివర్సిటీకి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్’ గుర్తింపును రద్దుచేసింది. ఈ స్థాయి గుర్తింపునకు అవసరమైన ప్రమాణాలను పాటించక పోవడంవల్లనే ఈ చర్య తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత ముజందార్‌వెల్లడిరచడం గమనార్హం.
యూనివర్సిటీల్లో రాజకీయ ఆధిపత్యం పేరుతో పెరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, వెస్ట్‌బెంగాల్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ (కంపోజిషన్, ఫంక్షన్, ప్రొసీజర్ ఫర్ ఎలక్షన్స్ టు స్టూడెంట్స్ కౌన్సిల్స్)2017 పేరుతో ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. విద్యాసంస్థల్లో రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా చేయడమే దీని ముఖ్యోద్దేశం. నిజానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ఇది! ఈ చట్టం ప్రకారం విద్యాసంస్థ ల్లో రాజకీయ పార్టీల ప్రమేయం వుండకూడదు. ఎన్నికల్లో విద్యార్థి కేవలం తన పేరు మీద మా త్రమే పోటీచేయాలి. ఎన్నికల్లో పోటీచేసే విద్యార్థి సంఘాలు ఏ రాజకీయ పార్టీ బ్యానర్ లేదా చిహ్నాలను ప్రదర్శించడానికి వీల్లేదు. విద్యార్థి సంఘాలకు ప్రతి రెండేళ్లకోమారు ఎన్నికలు జరపాలి. అంతకుముందు ఏటా నిర్వహించేవారు. అంతేకాదు స్టూడెంట్స్ యూనియన్ పేరు స్థానంలో స్టూడెంట్స్ కౌన్సిల్ అని ప్రభుత్వం ఈ చట్టంలో పేర్కొంది. ఇక కళాశాలల్లో అయితే ప్రెసిడెం ట్, వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు విద్యార్థులను ప్రిన్సిపాల్/వైస్ ప్రిన్సిపాల్/ఇన్‌చార్జ్ టీచర్ నామినే ట్ చేయాలని చట్టం నిర్దేశించింది. ఇక ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్ సెక్రటరీలను విద్యార్థి ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను ఆయా తరగతులకు చెందిన విద్యార్థులు ఎన్నుకో వాల్సి వుంటుంది. అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు రెండు నుంచి ఐదువరకు వుండవచ్చు.
ఇక విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే ప్రెసిడెంట్, వైస్‌ప్రెసిడెంట్ పోస్టులకు విద్యార్థులను వైస్ చాన్స్‌లర్ నామినేట్ చేయాలి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులకు,వివిధ తరగతులకు చెందిన ప్రతినిధులు ఎన్నుకుంటారు. యూనివర్సిటీ స్థాయిలో పది అసిస్టెం ట్ సెక్రటరీ పోస్టులు వుండవచ్చు. ఈవిధంగా విద్యార్థి నేతలు నామినేట్ కావడంవల్ల వీరికి ఆర్థిక వ్యవహారాలపై ప్రశ్నించడానికి ఎటువంటి హక్కులుండవు. ఈవిధంగా విద్యార్థులు యూనియన్ల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. జాదవ్ యూనివర్సిటీలో ప్రస్తుతం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న గొడవలకు ఈ ఎన్నికలను గత ఐదేళ్ల కాలంగా నిర్వహించకపోవడమే ప్రధాన కారణం.