బైపాస్ రోడ్డు నుంచి డంపు యార్డ్ ను తరలించాలి
డంపు యార్డు వద్ద పొగలు ఆర్పి వేయుటకు తక్షణ చర్యలు తీసుకోవాలి-సిపిఐ
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ నగర శివారు బైపాస్ రోడ్ లోని డంపు యార్డును తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని, డంప్ యార్డ్ నుంచి వచ్చే పొగను వెంటనే ఆర్పివేయాలని కోరుతూ సోమవారం రోజున సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి నిర్వహించడం జరుగుతుందని దీనిలో వందలాదిగా ప్రజలు తరలి రావాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజులు ఒక సంయుక్త ప్రకటనలో నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ లో గల డంప్ యార్డు వల్ల నగరంలోని దాదాపు పది డివిజన్లలో ముఖ్యంగా కోతిరాంపూర్, అల్కాపురి కాలని, హనుమన్ నగర్, గణేష్ నగర్, లక్ష్మీ నగర్, హౌసింగ్ బోర్డు, కట్టరాంపూర్, పోచమ్మ వాడ, శాషామహల్, మారుతి నగర్, అలుగునూర్, బొమ్మకల్ ప్రజలకు ఎండాకాలంలో మంటలు అంటుకుని పొగ రావడం వల్ల వాయు కాలుష్యం నెలకొని చాలామంది ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిల పాలవుతున్నారని, గర్భిణతో ఉన్న స్త్రీలు ఈపొగ పీల్చడం ద్వారా పుట్టే బిడ్డలకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయని కనీసం నగరపాలక అధికారులకు డంపు యార్డు తరలింపుపై ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో కరీంనగర్ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావు కొన్ని కోట్ల రూపాయలతో చెత్తను శుద్ధి చేయడం కోసం మిషనరీని ఏర్పాటు చేశారని ఆమిషనరీ రెండు, మూడు రోజులు మాత్రమే నడిచి మూలకు పడ్డదని కోట్ల రూపాయల మిషనరీలో కుంభకోణానికి మేయర్, ఎమ్మెల్యే పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపు యార్డ్ మిసనరి కొనుగోలుపై న్యాయవిచారణ చేయాలన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా మాజీ మేయర్ తన హయంలో స్మార్ట్ సిటీలో డంప్ యార్డ్ మిషనరీలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి తన హాయంలో జరిగిన పనులలో అవినీతి జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కరీంనగర్ లోని తీగల వంతెన, రివర్ ఫ్రంట్ లలో తీవ్ర అవినీతి జరిగిందని సాక్షాత్తు మాజీ మేయర్ సునీల్ రావు చెప్పడం చూస్తుంటే ప్రజలు వీస్తూ పోతున్నారని అన్నారు. తీగల వంతనపై నెలల తరబడి వీధి దీపాలు రాకపోవడం చూస్తుంటే నగరపాలక కమిషనర్ మొద్దు నిద్రలో ఉన్నారా అని వారు ప్రశ్నించారు. డంప్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని వివిధ వార్డులకు చెందిన ప్రజలు ప్రతి రోజు నిరసనలు తెలుపుతుంటే మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లు మొద్దు నిద్రలో ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి డంప్ యార్డులో వస్తున్న మంటలను ఆర్పి వేయుటకు చర్యలు తీసుకోవాలని వెంటనే డంపింగ్ యార్డ్ ని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.