`మదించి కొత్త మార్గంలో పెడితే కొంత మంచిదే.
`ఎత్తి వేయాలని చూస్తే కొరివితో తల గోక్కున్నట్లే.

`జిల్లాల తేనే తుట్టే..ఓట్లుకు తూట్లే
`జనం నుంచి తిరుగుబాటు తథ్యమే.

`పంతానికి పొతే రాజకీయం పరేషానే!
`ఎన్నికల హామీ అనుకుని సాగితే పొరపాటే
`మున్సిపల్ ఎన్నికల ముందు ఈ నిర్ణయం గ్రహపాటే!
`పదేళ్ల తర్వాత జిల్లాలు తొలగిస్తే కష్టమే!
`సరిహద్దులు కొన్ని జిల్లాలలో మార్చితే మంచిదే.
`ప్రజాభీష్టాన్ని నెరవేర్చడం అవసరమే.
`జిల్లాలే కుదిస్తే తుపాన్ కొని తెచ్చుకోవడమే.
హైదరాబాద్, నేటిధాత్రి:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారంటే అది చేసి తీరుతారు. ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు చెప్పిన విషయాలలో చాలా వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశారు. నిజానికి కొన్ని కీలకమైన నిర్ణయాలను అమలు చేస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆదిలోనే ఒక్కసారిగా నెరవేర్చడం కష్టమని తేల్చేశారు. తాము లంకెబిందెలు వున్నాయని కొని వచ్చాం. కాని ఇక్కడ ఖాళీ కుండలు దర్శనమిస్తున్నాయన్నారు. అంతే ఒక్కసారిగా జనం విస్తుపోయారు. అయితే ఖజాన ఆదాయం పెంచి దశల వారిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటూ మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. సమయం చూసి పధకాలు అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. కాని అవి కార్యరూపం దాల్చచడం లేదు. ఏవైతే చేయడానికి వీలైనంత సులువుగా వున్నాయో వాటిని చేయడానికి సిఎం వె నుకాడడం లేదు. అందులో తెలంగాణ బోర్టుల విషయంలో టిఎస్కు బదులు టీజి పేరు పెడతామన్నారు. ఎందుకంటే ఉద్యమ సమయంలో టిజి అని సంబోదించారు. బోర్టుల మీద కూడా అప్పటి ఏపి పేరు చెరిపేసి టిజి అని ఉద్యమ కారులు రాసేవారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసిఆర్ తెలంగాణ పేరును టిజి కాకుండా, టిఎస్ అని మార్చారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. టిఎస్ అంటే బిఆర్ఎస్ అని పిలికేలా వుండడం కోసమే అలా మార్చారని అన్నారు. కాని కేసిఆర్ మాత్రం తెలంగాణ ఉనికిని చెప్పడానికి తెలంగాణ స్టేట్ అని తెలిసేలా వుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు ఆనాడు వినలేదు. కాంగ్రెస్ ఆనాడే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టిఎస్ను ఖచ్చితంగా టిజిగా మార్చుతామని చెబుతూ వచ్చారు. గత ఎన్నికల హామీలలో ఇది కూడా చేర్చారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎం. రేవంత్ రెడ్డి సర్కులర్ జారీ చేశారు. టిఎస్ స్ధానంలో టిజి అని నామకరణం చేశారు. బోర్టులన్నీ మార్చేశారు. టిఎస్ ఆర్టీసిని, టిజి ఆర్టీసిగా మార్చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై కూడా టిజి అని బోర్డులు మార్చారు. వెయికిల్స్కు ఇచ్చే నె ంబర్ ప్లేట్లపై కూడా టిజిగా మార్చేశారు. మరి కొంత కాలానికి తెలంగాణ విగ్రహంలో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. అలాగే చేశారు. బిఆర్ఎస్ ప్రభత్వ హాయాంలోనే కాదు, ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ తల్లి అంటే ఒక ముద్ర నాటుకుపోయింది. కొన్ని లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ మలిదశ ఉద్యమం పురుడు పోసుకున్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం సాదాసీదా తెలంగాణ మహిళ రూపంలో వుండేలా చిత్రీకరించారు. ఉద్యమం ఊపందుకున్న తర్వాత తెలంగాణ తల్లికి కొత్త శోభను తెచ్చారు. తెలంగాణ తల్లిని దేవతా మూర్తిలా మలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మందు విగ్రహాన్ని మార్చుతామని చెప్పారు. తెలంగాణ తల్లి సాదాసీదా మహిళగా వుండేలా రూపకల్పన చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఏఐసిసి నాయకురాలు సోనియాగాందీని పోలి వుందనే మరో వివాదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ తల్లి దేవతా మూర్తి రూపంలో నగలు, కిరీటంతో వుండడం కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. సాధారన సగటు తెలంగాణ మహిళ రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపునిచ్చారు. ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం ఖర్చుతో కూడుకున్నది. ఖజానా ఖాళీగా వున్నప్పుడు ఆ పథకాలు ఎలాగూ అమలు చేయలేరు. కాని పెద్దగా ఖర్చుతో సంబంధం లేని వాటిని అమలు చేస్తూ వచ్చారు. అందులో టిజి, తెలంగాణ తల్లి విగ్రహం వున్నాయి. ఇక మూడోది జిల్లాల పునర్వవ్యవస్థీకరణ మిగిలి వుంది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులకు చేర్పులకు కొదవలేదన్నట్లే వుంది. కొత్తగా జిల్లాల పునర్వవస్దీకరణ మీద చర్చ మళ్లింది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నింటికన్నా ముందు చెప్పిన విషయాలలో జిల్లాల పునర్వవ్యస్ధీకరణ చేస్తామన్నారు. దాంతో ప్రభుత్వం వచ్చిన తొలిరోజుల్లోనే రాజకీయం వేడెక్కింది. తర్వాత ఆ విషయం అటకెక్కింది. అప్పుడే రావాల్సినంత వ్యతిరేకత వచ్చింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ప్రకటనను ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి ప్రకటనలు పాలకుల నుంచి రావడం సహజమే అనుకున్నారు. ఆదిలోనే బిఆర్ఎస్ జిల్లాల పునర్విభజన ఎలా చేస్తారో చూస్తామని ఆనాడే సవాలు విసిరింది. తర్వాత కాలంలో ఆ మాట మరుగున పడిరది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో అసంబద్దంగా, అన్యాయంగా, అశాస్త్రీయంగా చేసిన జిల్లాను మార్చుతామని చెప్పడం జరిగింది. జనం ఎంత వరకు ఆ మాటలు విన్నారో..నమ్మారో తెలియదు కాని, ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సిఎం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కాని ఆదిలోనే తేనె తుట్టేను కదిలించడం వల్ల లేని తలనొప్పి పెట్టుకోవడం ఎందుకు అనుకున్నారు. జిల్లాల పునర్విభజన అంశం పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్లీ తెరమీదకు తెచ్చారు. సాక్ష్యాత్తు సిఎం. రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైకోర్టు జడ్జి చేతనో, సుప్రింకోర్టు రిటైర్డ్ జడ్జి చేతనైనా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వారిచ్చిన సూచనలు సలహాలతో జిల్లాల పునిర్వభన చేపడతామన్నారు. దాంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిజానికి కేసిఆర్ జిల్లాల ప్రకటన చేసినప్పుడు అకున్నది వేరు. తర్వాత పూర్తిగా అమలు చేసే సమయం వచ్చేసరికి చేసిన జిల్లాలు వేరు. కొన్ని జిల్లాలు తాత్కాలికంగా వచ్చిన ఉద్యమాల వల్ల కూడ ఏర్పాటయ్యాయి. అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన జిల్లాలు కూడా వున్నాయి. హాటాత్తుగా తెరమీదకు వచ్చిన జిల్లా సిరిసిల్ల. కేవలం కేటిఆర్ కోసమే ఆ జిల్లా ఏర్పాటు చేశారన్న విమర్శలు ఆనాడే ఎదుర్కొన్నారు. సిరిసిల్ల ప్రజలకు కూడా అప్పటి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. కేటిఆర్ రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం చూపేదాకా వెళ్లాయి. దాంతో వెంటనే సిరిసిల్లను ప్రకటించారు. జనగామ, ములుగు లాంటి జిల్లాలు సుమారు మూడేళ్లపాటు నిరంతం పోరాటాల వల్ల ఏర్పాటు జరిగాయి. జనగామ జిల్లా మొదట యాదాద్రి, భువనగి జిల్లాలో చేర్చారు. జనగామ ప్రాంతంలో మూడేళ్లపాటు జరిగిన ఉద్యమం మూలంగా జిల్లా ఏర్పాటుచేశారు. తొలుత ఇరవై నాలుగు జిల్లాలు ఏర్పాటు చేద్దామనుకున్న కేసిఆర్ ఆఖరుకు 33 జిల్లాలు చేశారు. అది కూడా కేసిఆర్ లక్కీనెంబర్ 6 కలిసొచ్చేలా చేశారని ఇప్పటికీ అంటుంటారు. ఏది ఏమైనా తర్వాత కాలంలో 33 జిల్లాలలో పెద్దఎత్తున ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయాల సముదాయాలు నిర్మాణం చేశారు. జిల్లాల విభజన వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేశారు. అంతే కాకుండా 33 జిల్లాలలో 33 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు. ఉద్యోగుల విభజన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ జిల్లాల మదింపును తెరమీదకు తెచ్చారు. నిజం చెప్పాలంటే కేసిఆర్ హాయంలో జిల్లా ఏర్పాటు అంశం పక్కన పెడితే ప్రాంతాల కూర్పు అంతా అశాస్రీయంగా జరిగిందన్న వాదన మొదటి నుంచి వుంది. తమకు అన్యాయం జరిగిందని ఉద్యమాలు చేసిన ప్రాంతాలున్నాయి. కొత్తగా రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు డిమాండ్ చాలా వచ్చాయి. అందులో కొన్ని పూర్తి చేశారు. మండలాల ఏర్పాటులో కూడా కొన్ని డిమాండ్లు వచ్చాయి. వాటిలో కొన్ని పూర్తి చేశారు. ఇంకా చేయనివి ఉన్నాయి. చేసిన వాటిలో అసంబద్దంగా, అన్యాయంగా చేసిన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఆనాటి నుంచే పోరు సాగుతోంది. వాటన్నింటికీ న్యాయం చేస్తూ, కొత్త జిల్లాల కూర్పు, మదింపు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కొన్ని జిల్లాల కోత తప్పదని ప్రభుత్వం పరోక్షంగా కొన్ని విషయాలు లీక్ చేశాయి. అంటే పరోక్షంగా తెనె తుట్టెను కదలించినట్లే అవుతుంది. అశాస్త్రీయంగా వున్న జిల్లాలను బాగు చేయడంవరకు ఓకే కాని, జిల్లాలకు జిల్లాలే ఎత్తి వేస్తే మాత్రం ప్రజలను ంచి నిరసన వ్యక్తమయ్యే పరిస్తితులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం తప్పు చేసినా పట్టుకుందామని చూస్తున్న బిఆర్ఎస్కు జిల్లాల మార్పు అంశం రాజకీయంగా ఉపయోగపడుతుందా? లేదా? అనేది కాలమే చెప్పాలి.
