సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాలా వెంకట్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల,ఏప్రిల్ -30(నేటి ధాత్రి):
ఇటీవల ఆరోగ్యంతో బాధపడుతూ మరణించిన సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ సామల మల్లేశం కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి కలిసి ఓదార్చారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ కామ్రేడ్ సామల మల్లేశం మరణం సిపిఐ పార్టీకి కార్మిక లోకానికి తీరని లోటు అన్నారు. రాయిని చెరువులో వేలాది మంది ప్రజలను సమీకరించి ఇళ్ల స్థలాల కోసం నిరంతరం పోరాటం కొనసాగించి వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు అన్నారు. ఈ వాడకు తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి పేరును బి వై నగర్ గా నామకరణం చేయడంలో సామల మల్లేశం ఎంతో విశ్వాసంతో దృఢమైన సంకల్పంతో పోరాడారన్నారు. సిరిసిల్ల అంటేనే పారిశ్రామిక రంగంగా బీడీ పరిశ్రమ పవర్లూమ్ పరిశ్రమ అనుబంధముతో లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మిక వర్గానికి మూడు దశాబ్దాలుగా కార్మికుల కోసం పోరాటం చేశాడన్నారు. బీడీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలోనూ బీడీ కార్మికులను పోరాటాలలో సమీకరించి తమ హక్కుల కోసం పోరాటం చేయడంలో గొప్ప పోరాట కార్మికవర్గ నాయకుడిగా కార్మిక వర్గం ముందు నిలబడ్డాడని, అక్రమ కేసులు జైలు జీవితాలను అనుభవించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం అన్నారు. అలాంటి గొప్ప నాయకుడు కోల్పోవడం కార్మిక వర్గానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, కడారి రాములు, అజ్జ వేణు, మీసం లక్ష్మణ్, సోమ నాగరాజు, నల్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
సామల మల్లేశం మరణం కార్మిక లోకానికి సిపిఐ పార్టీకి తీరని లోటు
