Farmer Durgayya Passes Away in Tonigandla
రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..
రామాయంపేట, అక్టోబర్ 22 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన రైతు పేగుడ దుర్గయ్య (68) మృతి చెందడంతో గ్రామం మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి.
సుమారు 25 రోజుల క్రితం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లుచిరుగి పొలం వద్దనే కుప్పకూలిన దుర్గయ్యను చుట్టుపక్కల రైతులు గమనించారు. వెంటనే స్పందించిన వారు 108 అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వగా, అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి ఆయనకు రక్తపోటు అత్యధికంగా పెరగడంతో కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించిన కుటుంబ సభ్యులు, మేడ్చల్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయితే 26 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దుర్గయ్య చివరకు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.
రైతు దుర్గయ్య భార్య లక్ష్మి కూడా సుమారు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను విడిచి వెళ్లిపోయిన దుర్గయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల విలాపాలతో తోనిగండ్ల గ్రామం మునిగిపోయింది.
గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు దుర్గయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. “ఆయన ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. కుటుంబం కోసం జీవితాంతం శ్రమించారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేం” అని గ్రామస్థులు కన్నీటి కణాలతో గుర్తుచేశారు.
