
Collector Dr. Satya Sharada.
ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి రాబోయే భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు గిరిజన సాంప్రదాయాలు, నృత్యాలు చేస్తూ అమరవీరుల స్తూపం నుండి పాకాల రోడ్డు లోని కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికతను నేర్పింది ఆదివాసీలేనన్నారు. ప్రకృతిని దైవంగా భావించే సాంస్కృతి ఆదివాసి గిరిజనులదని అన్నారు.గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు చేస్తున్న కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పక్కగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని 13 మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు సందర్శించి పరిష్కార నిమిత్తం తన దృష్టికి తీసుకురావాలన్నారు.గిరిజనుల హక్కులను రక్షిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొకావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య,గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.