-గత ప్రభుత్వ హయాంలోనే బిల్లు పొందిండా…?
-కల్వర్టు అసంపూర్తి నిర్మాణానికి, పనుల జాప్యానికి కాంట్రాక్టరే కారణమా…?
-కల్వర్టుకు దూరమైన అప్రోచ్ రోడ్డు
-కల్వర్టు కష్టం తీర్చాలని అమరవాది గ్రామ ప్రజల విన్నపం.
రామకృష్ణాపూర్, మార్చి 21 నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డు అమరవాది గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన అమరవాధి-మంచిర్యాల రహదారి మద్యలో కల్వర్టు కు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ కల్వర్టు నిర్మాణానికి సుమారు 35 లక్షల నిధులను విడుదల చేయించి కల్వర్టు నిర్మాణానికి స్థానిక మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లతో భూమి పూజ చేయించారు. అనంతరం కల్వర్టు నిర్మాణ పనులు కొంతమేరకు జరిగాయి. కల్వర్టు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే బిల్లును కూడా కాంట్రాక్టర్ పొందినట్లు తేటతెల్లమవుతుంది. నిర్మాణం కొంతమేర పూర్తయినప్పటికీ అప్రోచ్ రోడ్డు పనులు ఆగడం వలన ఆంతర్యం ఏమిటో అని గ్రామ ప్రజలు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా కల్వర్టు నిర్మాణ పనులు జరగకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ బిల్లులు లేపి పని ఆపిండా అనే సందేహం సైతం వ్యక్తం అవుతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామ ప్రజలు కాంట్రాక్టర్ తో చరవాణి ద్వారా సంప్రదించగా నిర్మాణ పనులు త్వరలో చేస్తామని రోజులు దాటవేస్తున్నారని గ్రామ ప్రజలు అంటున్నారు. పనుల జాప్యానికి కాంట్రాక్టరే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.
5 వ వార్డ్ కౌన్సిలర్ జిలకర మహేష్ ను వివరణ కోరగా…
గత ప్రభుత్వ హయాంలో సుమారు 35 లక్షల రూపాయలతో అమరవాది నుండి మంచిర్యాలకు వెళ్లే రహదారి మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే పనులు ఆలస్యం జరుగుతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్ కు ఏ సందర్భంలో ఫోన్ లో సమాచారం అందించినా సరే పనులు త్వరలోనే మొదలు పెడతామని చెబుతున్నారే తప్ప పనులు మాత్రం గత నాలుగు నెలల నుండి జరగడంలేదని అన్నారు. పనుల ఆలస్యం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
మున్సిపాలిటీ ఏఈ అచ్యుత్ ను వివరణ కోరగా….
5 వ వార్డులో కల్వర్టు పనులు, అప్రోచ్ రోడ్డు పనులు గత కొన్ని రోజులుగా జరగడంలేదని మా దృష్టికి కూడా వచ్చిందని ,కాంట్రాక్టర్ పదే పదే పనులు చేసేందుకు బిల్లులు ఆమోదించాలని కోరుతున్నారని అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయం యొక్క అధిక పని భారం వలన కాంట్రాక్టర్ కు బిల్లులు ఎంతవరకు వచ్చాయో చూడలేకపోయానని, వారం రోజులలో పనులు ప్రారంభం అయ్యేలా చూస్తామని అన్నారు.