
రామాయంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చెరువుల తలపిస్తున్న రోడ్ల పరిస్థితి.. ఇబ్బంది పడుతున్న ప్రజలు..
రామాయంపేట నేటి ధాత్రి
(మెదక్)
రామాయంపేట పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంత రోడ్లు చెరువులను తలపించే స్థితిలో ఉన్నాయి. వర్షపు నీరు నిలిచిపోయి భారీగా గుంతలు ఏర్పడటంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్, వివాహ సంబంధిత పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రజల అభిప్రాయాల ప్రకారం, సబ్ రిజిస్టర్ కార్యాలయం అనేది రోజూ వందలాది మంది ప్రజలు సందర్శించే ప్రధాన కార్యాలయం. అయితే అక్కడి రోడ్ల పరిస్థితి మూలంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు నడవడానికే ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. కొంతమంది ప్రజలు పొలిమేరల మధ్య నడిచేలా మారిందని చెబుతున్నారు.
స్థానిక నివాసితుడు ఒద్ది స్వామి మాట్లాడుతూ, “ఇంతటి ప్రధాన కార్యాలయం వద్ద రోడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటం బాధాకరం. ప్రజల సమస్యను పరిగణనలోకి తీసుకొని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు రామాయంపేట మున్సిపాలిటీ మరియు రోడ్లు & భవనాల శాఖ (R&B) అధికారులను రంగంలోకి దిగి, అక్కడి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగా అయినా గుంతలు పూడ్చి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.