తీరొక్క పూల పండగ జాతర..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T123437.493.wav?_=1

 

తీరొక్క పూల పండగ జాతర..

#నేడే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభం.

#తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

ప్రపంచంలో తీరొక్కపూలతో పండుగ జరుపుకునే సాంప్రదాయం తెలంగాణ బతుకమ్మ దే. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు ప్రకృతి, సంస్కృతి కలయికలో పుట్టిన సజీవకావ్యం. రంగురంగుల పువ్వులతో అందంగా దొంతరాలుగా పేర్చే బతుకమ్మలతో ఆడబిడ్డలు సంబుర పడే ఈ పండుగ తెలంగాణ సాంస్కృతికి అద్దం పడుతుంది. చేలకల్లో, చేనుల్లో వాటంతట అవే మొలిచే సహజ పూలనే సేకరించి రంగురంగుల గుండ్రటి ఆకారంలో శిఖరంగా పేర్చడం బతుకమ్మ పండుగకు జీవం. పేత్రమాస(పితృ అమావాస్య) నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలతో ఊరువాడ కళకళలాడుతుంది పూలరంగుల మేలవింపుతో ప్రతి ప్రాంతం బతుకమ్మ పూదటగా గుబాలిస్తుంది. సాయంత్రం ఆడబిడ్డలు ముస్తాబై వలయకారంలో నిలబడి నెమ్మదిగా కదులుతూ కోలాటం ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేయడం ఈ పండుగ గుండెచప్పుడు.

#బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…!

అచ్చ తెలుగు తెలంగాణ గీత సుధ లలో బతుకమ్మ పాటలకు ప్రత్యేక స్థానం ఉంది.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
గోరింటాకు గోరుముద్దలు..
తంగేడు పువ్వు తాలoలో..
జాతి పూల జడలో..
ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ..

 

అంటూ ఇలాంటి పాటలు సజీవంగా పల్లెల గాలిలో వినిపిస్తాయి. ప్రతి పాటలో మహిళల మనసు, ప్రకృతి, పంటల పట్ల మమకారం ధ్వనిస్తూ ఉంటుంది. బతుకమ్మ పండుగను తెలంగాణ మహిళలు తమ ఆత్మ గౌరవంగా భావిస్తారు. బతుకమ్మ పాటలు అన్నిట్లో ఒక కథ, ఒక సంస్కృతి, ఒక ఆశ, ఒక స్ఫూర్తి ఉంటాయి. ఈ వేడుకల్లో ప్రతి పువ్వుకు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రధానంగా ఉపయోగించే తంగేడు పువ్వు శక్తికి, గుమ్మడి పువ్వు సౌందర్యానికి ప్రతికలుగా నిలుస్తాయి.

#ప్రపంచ దేశాలలో బతుకమ్మ పండుగ.

తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్న బతుకమ్మ పండుగను అత్యంత వైభో పేతంగా జరుపుకుంటారు. ఆయా దేశాలలో తెలంగాణ యాసతో జానపదాలు మారుమోగుతాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని ప్రాంతాల్లో కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ బొడ్డెమ్మ సందడితో ప్రారంభం కావడం ఆనవాయితీ. అయితే తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల వారికి ఈ సాంప్రదాయం లేదు. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూడా ఈ పూల పండుగను జరుపుకోరు.

#బతుకమ్మకు నేలతో, నీటితో అనుబంధం.

మారుతున్న కాలం కారణంగా తంగేడు, గునుగు పువ్వుకు కరువు వచ్చింది, చిలక భూముల్లో కాంక్రీట్ అరణ్యాలు విస్తరించడంతో ప్రకృతికి సహజ అలంకారాలైన పూల మొక్కలు కనిపించడం లేదు ఫలితంగా కాగితాలతో తయారు చేసిన పూల బతుకమ్మలు మార్కెట్లోకి వచ్చాయి. వెదురు కర్రతో బుట్టలను చేసి వాటికి పూల మాలలు చుట్టడం ప్రారంభమైంది. బతుకమ్మ వేడుకల సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజులపాటు ఆటలాడి పాటలు పాడి పూలతో తయారు చేసిన బతుకమ్మను నీటిలో వదులుతారు. అందుకే గౌరమ్మను గంగమ్మ ఒడిలోకి చేర్చడం అని పూర్వీకులు చెబుతుంటారు. పూలు బాగా వికసించే కాలంలో జల వనరులు నిండుకుండలా ఉండే సమయంలో వచ్చే ఈ పండుగ నేలతో, నీటితో మానవులకు ఉన్న అనుబంధాన్ని చాటుతుంది.

#తీరొక్కపూలు అంటే ఏమిటి..!

ఎలాంటి పశుసంపద ముట్టని ఎంగిలి పుష్పాలు తంగేడు, గునుగు, గుమ్మడి పువ్వు, గోరింట, బీర, బంతి, చామంతి, తామర, గులాబి, కమలం పూలతో బతుకమ్మగా పేర్చి మధ్యలో పసుపుతో గౌరమ్మను తయారుచేసి అమర్చి తొమ్మిది రోజులపాటు నైవేద్యాలు సమర్పించి నిష్టగా ప్రతి మహిళ సంబరంగా జరుపుకునే తెలంగాణకు ప్రతీకగా నిలిచిన ఏకైక పండుగ సద్దుల బతుకమ్మ పండుగ గొప్పతనం. ఇలాంటి సాంప్రదాయ పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే మహిళలందరూ జరుపుకోవడం గర్వించదగ్గ విషయమని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version