గుజరాత్ నమూనాకు దీటైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ అందిస్తుందా?
బలమైన నాయకులను పార్టీలో వుండనివ్వరు
బలంలేని అనామక నాయకులతో ప్రయోజనం శూన్యం
యువతరం రావాలంటే వృద్ధ నాయకుల సంతానమే దిక్కు
ఓటమి శిథిలాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్
ప్రాంతీయ పార్టీలకు తోకగా మారిన దైన్యం
అంపశయ్య నుంచి అధికారం పీఠానికి ఎదగడమంటే భగీరథ యత్నమే
నిజమైన సెక్యులర్‌గా మారకపోతే పార్టీ మనుగడ కష్టం
కేవలం ఒక్క వర్గం ఓట్లు అధికారాన్ని కట్టబెట్టవు
మైనారిటీ భజన మారకపోతే పార్టీ పతనం తప్ప ఉత్థానం వుండదు
హైదరాబాద్,నేటిధాత్రి:
1961లో గుజరాత్‌లో భావ్‌నగర్‌లో కాంగ్రెస్ జాతీయ సదస్సు జరిగింది. మళ్లీ 64 సంవత్సరాల తర్వాత రెండోసారి అహమ్మదాబాద్‌లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహిం చింది. 1961 సదస్సు తర్వాత గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో అధికారంలో చాలా సంవత్సరాలపాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. ఇన్నేళ్ల తర్వాత నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన గుజరాత్ మోడల్‌ను సవాలు చేయడమే ఇప్పుడు అహ్మదాబాద్‌లో జాతీయ సదస్సు నినిర్వహణ ప్రధాన లక్ష్యం. మరిప్పుడు జాతీయ సదస్సును నిర్వహించేందుకు గుజరాత్‌నే ఎందు కు ఎంచుకుంది? ఇది పార్టీకి ఏమేరకు ప్రయోజనం? అనేవి ప్రధానంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు. తొలిరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ హాలులో, పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగింది. రెండోరోజు మాత్రం సబర్మతి ఆశ్రమం వద్ద జరిగిన సదస్సుకు ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గన్నారు.
గుజరాత్‌ను ఎంచుకోవడానికి కారణాలు
మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించి వందో ఏడు కావడం ఒక కారణం కాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి రెండో కారణం. ముఖ్యంగా ఈ రెండూ గుజరాత్‌కు సంబంధించినవి. ఇప్పటివరకు బీజేపీ సర్దార్ వల్లభాయ్‌పటేల్‌కే తన విధానాల్లో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడైన పటేల్ వారసత్వాన్ని తాము అనుసరిస్తున్నామని తెలియజెప్పడమే సబర్మతి ఆశ్రమం, సర్దార్ పటేల్ మెమోరియల్‌ను ఎంచుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సు ద్వారా 2027 నాటికి గుజరాత్‌లో అనుసరించబోతున్న వ్యూహాన్నికాంగ్రెస్ స్పష్టం చేసింది. గుజరాత్‌నుంచి ఒక కొత్త రాజకీయ సంస్కృతి ప్రారంభమైతే దాని ప్రభావం దేశవ్యాప్తంగా తప్పనిసరిగా వుండితీరుతుందనేనది కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయం. ఇప్పటివరకు రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన బీజేపీ నమూనాను పెకలించి వేయగలిగితే అప్పుడు గుజరాత్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆసక్తితో వున్నదని, ఇక్కడ పార్టీ ఎంతో చురుగ్గా పనిచేస్తున్నదన్న సందేశం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు వెళుతుందని పార్టీ అధినాయత్వం భావిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా అప్రతిహతంగా గుజరాత్‌ను భాజపా ఏలుతున్న నేపథ్యంలో, ఇక్కడ కాంగ్రెస్ ఉనికిని ఒక ‘జోక్’గా తీసుకునేవారి మైడ్‌సెట్‌ను మార్చాలన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇక్కడ మరో అంశాన్ని కూడా గుర్తించాలి. సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన 2002 సంవత్సరం నుంచి కాంగ్రెస్ సదస్సులు ఢల్లీికే పరిమితమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏటావివిధ రాష్ట్రాల్లో పార్టీ సదస్సులు జరిగేవి. ప్రస్తుతం ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అత్యంత బలంగా వున్న గుజరాత్ రాష్ట్రం నుంచే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
గుజరాత్ మోడల్ ప్రాధాన్యత ఏమిటి?
ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తాను గుజరాత్ ముఖ్యమంత్రి వున్నప్పుడు అభివృద్ధి విషయంలో ‘గుజరాత్ నమూనా’ను ప్రవేశపెట్టారు. గుజరాత్ నమూనాను ఒక రాజకీయ అస్త్రంగా మలచుకొని 2014లో ఆయన ప్రధాని అయ్యారు. ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు ఆధారం గుజరాత్ నమూనా మాత్రమే! ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ రాజకీయాలు గుజరాత్ నమూనా చుట్టూనే తిరుగుతుండటం గమనార్హం. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి వున్నప్పుడు వై బ్రెంట్ గుజరాత్ పేరుతో, పెట్టుబడుల ఆకర్షణ, రవాణారంగ అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. ‘అచ్ఛేదిన్ ఆనేవాలే హై’ అనే ని నాదంతో 2014లో బీజేపీ ఎన్నికల బరిలో దూసుకెళ్లడానికి ఈ వైబ్రెంట్ గుజరాత్ గొప్ప ఆధా రంగా నిలిచింది. ముఖ్యంగా నరేంద్రమోదీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమన్న ఇమేజ్‌ను సృ ష్టించుకోవడంతోపాటు, చేపట్టిన అభివృద్ధి పనుల్లో విజయం సాధించడం 2014, 2019 మరి యు 2024 ఎన్నికల్లో కేంద్రంలో భాజపా అధికారానికి రావడానికి గొప్ప నిచ్చెనగా ఉపయోగ పడిరది. గుజరాత్‌లో ‘సెజ్’లను ప్రోత్సహించడం, పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అందరికీ తెలిసేలా చేయడం మోదీ సాధించిన విజయాలు. ఇవే తర్వాతి కాలంలో ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమాల రూపంలో కేంద్ర స్థాయిలో అమలు చేయడానికి దోహదం చేశాయి. గుజరాత్ అభివృద్ధి నమూనాను విజయవంతంగా అమలు చేయ డం ద్వారా, కాంగ్రెస్‌కు అభివృద్ధి విజన్ లేదంటూ బీజేపీ డిఫెన్స్‌లో పడేసింది. 2002 తర్వాత గుజరాత్‌లో ఇప్పటివరకు ఏవిధమైన అల్లర్లు జరగలేదు. ఇందుకోసం రాష్ట్రంలో అనుసరించిన పద్ధతినే జాతీయ స్థాయిలో కూడా అమలుచేస్తున్నారు. ఈవిధంగా గుజరాత్ నమూనా దేశ ప్రజలను సమ్మోహితులను చేసిందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. మరి తానుకూడా అంతటి స్థాయి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో పనిచేస్తానని దేశ ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏర్పడిరది. దీన్ని మరే ఇతర రాష్ట్రం నుంచైనా చేపట్టవచ్చు. కాకపోతే బీజేపీ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి కనుక వాటిని దెబ్బతీయాలంటే తన ప్రయత్నాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలి. ఇప్పుడు కాంగ్రెస్ సదస్సు రూపంలో చేసింది ఇదే.
గుజరాత్‌లో కాంగ్రెస్ పరిస్థితేంటి?
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 182. 1985లో కాంగ్రెస్ 149 సీట్లలో గెలిచి రాష్ట్రాన్ని పాలించింది. అదే 2022 నాటికి ఇక్కడ బీజేపీ ఏకంగా 156 సీట్లు గెలిస్తే, కాంగ్రెస్ కేవలం17 స్థానాలకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ మొట్టమొదటిసారి గుజరాత్‌లో పోటీచేసి 13% కాంగ్రెస్ ఓట్లకు గండికొట్టింది. ఇక 2022 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌నుంచి వలసలు మొదల య్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ బలం 12కు కుంచించుకుపోయింది. ఇదే స మయంలో బీజేపీ సీట్లు 161కి పెరిగాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే రా ష్ట్రంలోని మొత్తం 26 లోక్‌సభ సీట్లలో బీజేపీ 25 గెలుచుకోగా, 61.86% ఓట్లు నమోదయ్యా యి. ఇక అసెంబ్లీ ఎన్నికల గుణపాఠం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి పోటీచేసి నా ఈ రెండిరటికి కలిసి వచ్చిన ఓట్లశాతం 31.24%. గెలుచుకుంది కేవలం ఒక్క సీటు మాత్రమే. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక అనుకూలాంశాన్ని గుర్తించాలి. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, 2024లోక్‌సభ ఎన్నికల్లో 20 అసెంబ్లీ సెగ్మంట్లలో ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకోవడం విశేషం. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో తన ఆధీనంలో వున్న 13 మున్సిపాలిటీల్లో కేవలం ఒక్కదాన్ని మాత్రమే నిలబెట్టుకోగలిగింది. అదే బీజేపీ 68 మున్సిపాలిటీల్లో 60 గెలుచుకొని తన సత్తా చాటింది.
బీజేపీ హవాను కాంగ్రెస్ అడ్డుకోగలదా?
మార్చి 7వ తేదీన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఒక కీలక ప్రకటన చేశారు. ‘‘గుజరాత్‌లో రెండు రకాల నాయకులున్నారు. కాంగ్రెస్‌ను తమ హృదయాల్లో ఇప్పటికీ ప్రతిష్టించుకొన్న ప్రజలతో మమేకమయ్యే నాయకులు ఒకరకం కాగా, పార్టీలోనే వుంటూ, బీజేపీతో అంటకాగే రకం నాయకులు మరికొందరు. ఇటువంటివారిని తొలగించి మనం ఒక ఉదాహరణగా నిలవాలి’’. బాగానేవుంది కానీ ఈ ప్రక్షాళన సాధ్యమయ్యే పనేనా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ మాదిరిగా వున్నది ముస్లింలు, గిరిజనులు. మిగిలిన గుజరాతీలను ఆకర్షించాలంటే అభివృద్ధి పేరుతో మాత్రమే సాధ్యం. ఇప్పటికే గుజరాత్ ఒక నమూనా రాష్ట్రంగా నిలిచింది కాబట్టి, చిన్న సమస్యలేమైనా వుంటే వాటిని పట్టుకొని ముందుకెళ్లాల్సి వుంటుంది. గత మూడు దశాబ్దాలుగా భాజపా గుజరాత్‌లో అధికారంలో కొనసాగుతోంది. అందువల్ల ప్రస్తుత తరానికి కాంగ్రెస్ గురించి తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ఈ కొత్తతరం యువతను, మహిళలను తనవైపు తిప్పుకుంటే తప్ప ఫలితం వుండదు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయినిస్తోంది కనుక, అంతకుమించిన అద్భుతం తాను సృష్టించగలనని కాంగ్రెస్ ప్రజల్లో నమ్మ కం కలిగించగలగాలి. గుజరాత్ అసెంబ్లీకి మరో రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లోని నాయకత్వంలో ఉత్తేజం నింపి ఎంతో శ్రమిస్తే తప్ప ఫలితం వుండబోదు. మరి ఇది సాధ్యం కావాలంటే పార్టీకి సుశిక్షతమైన కార్యకర్తలతో కూడిన సైన్యం, మంచి కమాండర్ అవసరం. దురదృష్టవశాత్తు ఈ ఇద్దరూ పార్టీకి లేరు. అన్నింటికీ మించి పార్టీకి ఆర్థిక వనరుల కొరత పెద్ద స మస్యగా మారింది.
కాంగ్రెస్‌కు తక్షణం కావలసినవి
బీజేపీ మాదిరిగా సంస్థాగతంగా బలోపేతం కావడం. ‘ఎన్నికల మిషన్’ మాదిరిగా పనిచేస్తున్న బీజేపీ స్థాయిలో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలను ఏర్పరచుకొని, తన సిద్ధాంతా లను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేయగలగాలి. ఇందుకోసం విశ్వసనీయమైన నాయకులు, కార్యకర్తలు అవసరం. ప్రస్తుతం పార్టీకి ఈ రెండిరటి కొరత తీవ్రంగా వుంది. బీజేపీతో యుద్ధా నికి ఇంతటి బలీయమైన ఆధారం కావాలి. ఈ హంగు లేదన్న సంగతి రాహుల్‌గాంధీకి తెలి యంది కాదు. అందువల్ల కేవలం సదస్సుల నిర్వహణ ద్వారా బలమైన మోదీని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేదు. బీజేపీ తాను అనుకున్నవాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగలుగుతోంది. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఇంతటి బలమైన క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు. అయితే సదస్సువల్ల అస లు ప్రయోజనం వుండదా? అంటే ఎంతోకొంత వుండితీరుతుంది. కానీ అది ఎంతమాత్రం సరిపోదు.
రాహుల్ శపథం
బీజేపీ అహంకారాన్ని తప్పకుండా దెబ్బకొడతామని రాహుల్ గాంధీ అన్నారు. కానీ ప్రస్తుతం వున్న కంగాళీ నాయకులతో ఇది సాధ్యమా? ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది రాహుల అభిమతం. కాంగ్రెస్‌లో పాతుకుపోయిన వృద్ధ నాయకులు ఈ ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డుకొట్టక మానరు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ సంస్కృతి కదా! ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా వున్న మల్లికార్జున ఖర్గే 2022, అక్టోబర్ 26న పార్టీ అధ్యక్షుడయ్యారు. ఇప్పటికే ఆయన వృద్ధుడైపోయారు. అందరినీ ముందుకు పొమ్మనగలరు కానీ, తాను కదలలేరు. బీజేపీలో మాదిరిగా పార్టీ అధ్యక్షుడు ఇంత కాలం మాత్రమే పదవిలో కొనసాగాలన్న నియమం లేదు. నెహ్రూ కుటుంబం అభీష్టం మేరకే ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఈ వ్యవహారశైలి బాగా తెలిసినవాడు కనుకనే ఖర్గే, తన తర్వాత కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేపట్టాలని కోరుతున్నారు. నిజం చెప్పాలంటే ఆయన పేరుకే అధ్యక్షుడు. నెహ్రూ కుటుంబానిదే అంతా అధికారం! ఆయన నిర్ణయాలు తీసుకునేదేం లేదు! సోనియా చెప్పింది చేయాలంతే. రాహుల్ పేరు చెబితేనే పదవిలో ఉన్నంతకాలం కొంతమేర ప్రశాంతంగా వుండగలరు! ఇదిలావుండగా ప్రియాంకా వాద్రాకు కూడా కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఉద్దేశం వుందంటున్నారు. కానీ ఈ సదస్సు సమయానికి ఆమె అమెరికా వెళ్లిపోయారు. ముఖ్య సమయాల్లో రాహుల్ లేదా ప్రి యాంక లేదా ఇద్దరూ వుండరు. కాంగ్రెస్ పార్టీ ‘మొదటి కుటుంబంలోనే’ మూడు గ్రూపులలున్నాయన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఒకటి సోనియా, రెండు రాహుల్, మూడు ప్రియాంక. ఇ టువంటి అసంబద్ధ నాయకత్వాన్ని నమ్ముకొని విశ్వసనీయంగా కేడర్ పనిచేయడం కష్టమే. అయితే దేశవ్యాప్తంగా జిల్లా, బ్లాక్ స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలన్నది అగ్ర నాయకత్వం ఉద్దే శంగా కనిపిస్తోంది. ఇది నిజం కావాలంటే ముందు అగ్రనాయత్వం వ్యవహారశైలిలో మార్పు రావాలి.
వరుస పరాజయాలు
ఇటీవలి సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏ ఎన్నికల్లో విజయం సాధించడంలేదు. వచ్చే బిహార్ ఎన్నికల్లోమహా ఘట్‌బంధన్‌పై కాంగ్రెస్ ఆశపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇందెంత నిప్పచ్చరంగా వుంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే కాంగ్రెస్‌ను దేశంలోని ఏ ప్రాంతీయపార్టీ లెక్కచేయడం లేదు. ఒకప్పుడు వీరిని శాసించిన కాంగ్రెస్ ఇప్పుడు వాటికి తోకమాదిరిగా వుండాల్సిన దుస్థితి! విరిగిన కత్తులు, సొట్టపోయిన డాళ్లు, చక్రాలు ఊడిన రధాలతో, అన్ని హంగులూ వున్న శత్రువుతో పోరాడాలి? ఇది సాధ్యమయ్యేదేనా? ‘కురువృద్ధులతో’ నిండిన కాంగ్రెస్ పార్టీని యువత ఎంతవర కు విశ్వసిస్తారనేది కూడా ప్రశ్నే! రాహుల్‌ను యువ నాయకుడిగా ముందుకు తెద్దామన్నా ఆయన ఎక్కడ కాలుపెట్టినా కలిసిరావడంలేదు! ఆయన ప్రచారానికి వస్తారంటే, పార్టీలో గెలిచే అవకాశాలున్న నాయకులకు గుండెదడ మొదలైనట్టే! 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వ రుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందన్న సత్యాన్ని గుర్తించాలి.
కొత్త ఇన్‌చార్జ్‌లు
కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ రెండు రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శులను మరో తొమ్మిది రాష్ట్రాల కు ఇన్‌చార్జ్‌లను నియమించింది. మరో ఆరుగురు నాయకులకు ఉద్వాసన పలికింది. ఛత్తీస్‌గఢ్‌మాజీ ముఖ్యమం త్రి భూపేష్ భాగల్‌కు ఏ.ఐ.సి.సి. సెక్రటేరియట్‌లో స్థానం కల్పించి, పంజాబ్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించారు. రాజ్యసభ ఎం.పి. సయ్యద్ నసీర్ హుస్సేన్‌ను ప్రధానకార్యదర్శి గా చేసి, జమ్ము`కశ్మీర్, లద్దాఖ్‌లకు ఇన్‌చార్జ్‌గా నియమించారు.
రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లుగా నియమితులైనవారిలో రాజ్యసభ ఎం.పి. రజనీపాటిల్ (హిమాచల్ ప్రదే శ్, చండీగఢ్), బి.కె. హరిప్రసాద్ (హర్యానా), హరీష్ చౌదరి (మధ్యప్రదేశ్), గిరీష్ చోడంక్ (తమిళనాడు, పుదుచ్చేరి), అజయ్‌కుమార్ లల్లూ (ఒడిషా), కె.రాజు (రaార్ఖండ్), మీనాక్షి నటరాజన్ (తెలంగాణ), లోక్‌సభ ఎం.పి. సప్తగిరి శంకర్ ఉలక (మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్), కృష్ణ అల్లవారు (బిహార్) వున్నారు. కొత్తగా నియమితులైనవారు రాహుల్ గాంధీ, ప్రియాం కా వాద్రాలకు సన్నిహితులు కావడం గమనార్హం.
ఎంతగా చెప్పుకున్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఇప్పుడు పార్టీకి చాలా అవసరం. కార్యకర్తల్లో విశ్వాసం పాదుగొల్పే నాయకులు కాంగ్రెస్‌లో కరవయ్యారు. కాస్త గట్టి నాయకుడని అనుకున్న వారిన పొగబెట్టి బైటికి పంపించే సంస్కృతి జీర్ణించుకున్న కాంగ్రెస్‌కు అనామక నాయకులే విశ్వాసంగా పడివుంటారు. బలమైన నాయకుడెవరూ కాంగ్రెస్‌లో ఇమడలేరు. ఇప్పుడు శశిధరూర్, కర్నాటకలో డి.కె. శివకుమార్‌ల పరిస్థితి ఇదే! ఇటువంటి సంస్కృతి వున్న పార్టీ ఏవిధంగా బ లోపేతం కాగలదు?