Workers Oppose New Labor Codes
కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి వేస్తుందని, కార్మికులకు నష్టం కలిగించే నూతనంగా తెచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి షేకు హుస్సేన్, టీబీజీకేఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బడి తల సమ్మయ్యలు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య స్మారక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడుతూ..
అనేక సంవత్స రాలుగా కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న
29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కేంద్రం కాలరాస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక సంఘాల ప్రమేయం లేకుండానే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను ఏర్పాటు చేయడం యావత్ కార్మిక లోకానికి తీరని నష్టమని అన్నారు.బిజెపి అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 25, 26న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బి ఎం ఎస్ తప్ప భారీ ప్రదర్శనలకు ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా మంగళవారం భూపాలపల్లి ఏరియాలో అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అనంతరం నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ ల ప్రతులను దహనం చేశారు. నేడు కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా 26 న జిల్లా కలెక్టర్, ముందు ఉదయం 10 :00 గంటలకు ధర్నా నిర్వహించి, సాయంత్రం 4 గంటల కు జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 26న జరిగే ఆందోళన పోరాటాలలో కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు దేవరకొండ మధు, బాషనపల్లి కుమార్, బి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
