
కులాల , మతాల వారీగా ఉన్న గురుకుల వ్యవస్థను రద్దు చేయాలి
గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలనే బలోపేతం చేయాలి
టి పి టి ఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
గురుకుల వ్యవస్థతో పిల్లలు – తల్లిదండ్రుల మధ్య కనుమరుగవుతున్న ఆప్యాయత, అనురాగాలు.
ఇది కుటుంబ వ్యవస్థకే పెను ప్రమాదమని హెచ్చరిక
ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలలు పిల్లలను యాంత్రికలు గా మార్చే కర్మాగారాలు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత, అనుభవం కలిగిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు
కేసముద్రం/ నేటిదాత్రి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పులి చింత విష్ణువర్ధన్ రెడ్డి ఉద్ఘాటన.
గ్రామ గ్రామాన ఉండే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా, వచ్చిన ప్రతీ ప్రభుత్వం గురుకుల పాఠశాలల పై మోజు చూపించడం తగదని వీటిని రద్దు చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం టి పి టి ఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజుల నేతృత్వంలో మూడవ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పులి చింత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కులాల వారీగా మతాల వారీగా గురుకులాలను తీసుకొచ్చి కుటుంబాల నుంచి పిల్లల్ని దూరం చేయడం తగదని వెంటనే వాటిని రద్దు చేయాలని, గ్రామ గ్రామాన అర్హత, అనుభవం కలిగిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండే ప్రభుత్వ పాఠశాలలనే బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి తల్లిదండ్రి వాళ్ళ గ్రామంలో ఉండే ప్రభుత్వ పాఠశాలకే తమ పిల్లల్ని పంపాలని , అప్పుడు మాత్రమే పిల్లలు తమ కళ్ళ ముందు పెరుగుతారని, వారి ఆరోగ్యాన్ని, ప్రవర్తనను చక్కదిద్దే అవకాశం కూడా వీరికి దొరుకుతుందని,ఆ క్రమంలోనే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ప్రేమ, అనురాగాలు,ఆప్యాయతలు ఏర్పడతాయని, బాధ్యతలు తెలుస్తాయని హితువు పలికారు. అప్పుడు మాత్రమే ఆ బంధాలు నిలబడతాయని, అందరూ కుటుంబ, సామాజిక విలువలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని తద్వారా అభిలషీనీయమైన సమాజ నిర్మాణం జరుగుతుందని సూచించారు.
బట్టి చదువులను ప్రోత్సహించే, అవగాహనను విస్మరించే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు పిల్లలను పంపించి డబ్బులను, వారి అందమైన జీవితాన్ని వృధా చేయరాదని అన్నారు.
అనంతరం కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ మూడో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెనుగొండ ఉన్నత మరియు ప్రాథమికపాఠశాలల తో పాటు, యుపిఎస్ బేరువాడ, యుపిఎస్ అన్నారం, మర్రితండ , చెరువు ముందు తండా, వాచ్య తండా, గొప్య తండా, చెరువు ముందు తండా, నరసింహుల గూడెం, బోడ మంచ్యా తండా, గుడితండా, రేకుల తండా, రాజీవ్ నగర్ కాలనీ, సర్వాపురం,రంగాపురం, ధన్నసరి, అమీనాపురం మాతృతండా, గాంధీనగర్, తాళ్లపూసపల్లి, ధర్మారం తండా ప్రాథమిక పాఠశాలలను సందర్శించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి నన్నపురాజు నరసింహరాజు, ఉపాధ్యక్షులు, పూర్వ బాధ్యులు అంజన్న, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊట్కూరి ప్రణయ్ కుమార్, జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి ఉపేందర్
తదితరులు పాల్గొన్నారు.