
The case against Rahman editor of Janam Sakshi should be withdrawn.
జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సామంతుల శ్యామ్, తడుక సుధాకర్ లు మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పోతరాజు రవిభాస్కర్, చెరుకు సుధాకర్, సర్వేశ్వర్, తిక్క ప్రవీణ్, క్యాతం మహేందర్, విజయ్, మారపెల్లి చంద్రమౌళి, వెంకన్న, అంబాల సంపత్, రాజు, వెంకన్న, మోహన్, సమ్మయ్య, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.