
Praveena Paruchuri
నటీనటులను ఎడా పెడా బాదేసింది…
నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో’ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మంగళవారం ఈ సినిమా ప్రీవ్యూ షోను వేశారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ (Care of Kancharapalem), ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma maheswara ugra roopasya) చిత్రాల నిర్మాత పరుచూరి ప్రవీణ (Paruchuri Praveena) తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్తపల్లిలో…’ (Kothapalli lo). ఒకప్పుడు అనేది దాని ట్యాగ్ లైన్. 1980, 90లలో కొత్తపల్లి అనే గ్రామంలో జరిగే కొన్ని సంఘటనలను సినిమాగా దర్శకురాలు ప్రవీణ తెరకెక్కించింది.
ఇటీవల ఓ ఇంటర్వూలో ఆర్టిస్టుల పట్ల తాను సినిమా షూటింగ్ లో అనుచితంగా ప్రవర్తించానని, సన్నివేశం బాగా రావడం కోసం కొన్ని సందర్భాలలో వారిపై చెయ్యి చేసుకున్నానని, కోపంతో రాళ్లూ విసిరానని చెప్పుకోవచ్చారు. నిజానికి ఇవన్నీ సినిమా కథలో భాగంగానే ప్రవీణ పరుచూరి చేశారని ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అర్థమౌతోంది.
ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో నాగమణి అనే డీ గ్లామరైజ్డ్ పాత్రను ప్రవీణ పోషించారు. ఓ మారుమూల పల్లెటూరిలో అట్లు వేసుకుని జీవితాన్ని గడిపే నిరుపేదరాలు పాత్రను ఆమె చేసింది. హీరో ప్రేమ విషయంలో జరిగే తగవులో అతని తరఫున వకాల్తా పుచ్చుకున్న ఈ పాత్ర… అవతలి పాత్రలతో ఢీ అంటే ఢీ అంటూ బరిలోకి దిగుతుంది. జుత్తు జుత్తు పట్టుకుని ఇద్దరు మహిళలు వీరంగం సృష్టిస్తారు. దర్శక, నిర్మాత కూడా అయిన ప్రవీణ ఆ సమయంలో కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోయి… అవతలి వాళ్ళను తన్ని తగలేసి ఆ సన్నివేశాన్ని రక్తికట్టించింది. చిత్రం ఏమంటే… ‘కేరాఫ్ కంచరపాలెం’లో వేశ్యగా నటించడానికి వెనుకాడని ప్రవీణ… ఇందులోనూ తన పాత్రను కించపరిచే సంభాషణలను సైతం రాయించుకుంది. అక్కడ పాత్ర తప్పితే… మనకు నిర్మాతో, దర్శకురాలో కనిపించరు.
అమెరికాలో కార్డియాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్న పరుచూరి ప్రవీణకు సినిమా అంటే ఎంత పిచ్చో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థం అవుతుంది. మరి ఎంతో కష్టపడి, ఇష్టపడి పరుచూరి ప్రవీణ తెరకెక్కించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.