టెక్స్ టైల్ పార్క్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి

# ప్రచారార్బాటంగా తూతూ మంత్రంగా సీఎం పర్యటన..

# ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి :

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని గత ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన వందల ఎకరాల భూమి నిరుపయోగంగా మారిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పించి నిర్వాసితులకు నిరుద్యోగ యువతకు తోడ్పాటు కల్పించాలని అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.గత కెసిఆర్ ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని సంగెం, గీసుకొండ మండల పరిధిలోని సుమారు 1300 ఎకరాల రైతులు రెండు పంటలు పండించే భూమిని టెక్స్టైల్ పార్కు కోసమని రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించి 8 సంవత్సరాలు పాలన కొనసాగించిన ఎలాంటి పరిశ్రమలు గాని ఉపాధి కల్పన గాని చేపట్టలేదని ఆరోపించారు. పైగా భూమి కోల్పోయిన రైతులు భూమిపై ఆధారపడిన కూలీలు జీవనాధారం కోల్పోయారని చెప్పారు.భూ సేకరణ చట్టం సరిగ్గా అమలు చేయకుండా నిర్వాసితులను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూతూ మంత్రంగా ప్రచార ఆర్భాటం కోసం పర్యటనలు చేపట్టకుండా, భూములు కోల్పోయిన నిర్వాసితులకు చట్ట ప్రకారం రావాల్సిన పరిహారం ఉపాధి నివాసం కల్పించాలని అలాగే పరిశ్రమలకు ఉపయోగం లేని భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్కు కోసం సేకరించిన భూముల చుట్టుపక్కల కొంతమంది దళారులు రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి రైతులను మోసం చేశారని,ఆ భూములను గుర్తించి తక్షణమే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. గత ఎనిమిది సంవత్సరాలుగా భూములు కోల్పోయిన రైతులు నిర్వాసితులు ఎలాంటి జీవన ఆధారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని మరోవైపు భూముల ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని తాకాయని ఇలాంటి పరిస్థితులలో నిర్వాసితులకు నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని రమేష్ పేర్కొన్నారు. లేకపోతే గత ప్రభుత్వంపై నిర్వాసితులు చేపట్టిన పోరాటం విధంగానే మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!