
`హీరోలను నెత్తిమీద.. కార్మికులను కాళ్ళ కింద
`నిర్మాతలు ఏళ్ల తరబడి కార్మికుల రక్తం తాగుతున్నారు.
`కనికరం లేకుండా కార్మికుల కష్టం దోచుకుంటున్నారు.
`అబద్దాల లెక్కలు చెబుతారు!
`సినిమాకు కోట్లు ఖర్చు పెడుతున్నామంటారు.
`కార్మికులకు వందలు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడతారు.
`రోజు వారీ కూలీ ఇచ్చేందుకు నెలల సమయం తీసుకుంటారు.
`కార్మికులను మర మషులకన్నా ఎక్కువ వాడుకుంటున్నారు.
`సమయపాలన లేకుండా గంటల తరబడి పని చేయించుకుంటారు.
`కార్మికుల సినిమా పిచ్చిని ఆసరా చేసుకుంటున్నారు.
`కార్మికుల బతుకులు బండలు చేస్తున్నారు.
`ఏడాదికి పది శాతం పెంచడానికి ఏడుస్తున్నారు?
`మూడేళ్లకు ముప్పై శాతానికి ముక్కుతున్నారు!
`కార్మికుల కష్టం దోచుకుంటున్నారు.
`వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు.
`కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్నారు.
`పని గంటలకు లెక్క లేకుండా పని చేయించుకుంటున్నారు.
`కార్మికులను వేధించుకు తింటున్నారు.
`మూడేళ్లు గడిచినా జీతాలు పెంచడానికి ముఖం చాటేస్తున్నారు.
`రాసుకున్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.
`తుమ్మితే ఊడిపోయే ముక్కులుగా తీసిపడేస్తున్నారు.
`కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారు.
`కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
`కార్మికులపైనే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు.
`సమ్మె చేస్తే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు.
`గుర్తింపు కార్డులు రద్దు చేస్తామంటున్నారు.
`బెదిరించి కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు.
`కార్మికులకు న్యాయం జరిగే వరకు ‘‘నేటిధాత్రి’’ అక్షర పోరాటం చేస్తుంది.
`కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతుంది.
`నిబంధనల ప్రకారం జీతాలు పెంచే దాక పోరు సాగిస్తుంది.
`హీరోలను నెత్తిమీద, కార్మికులను కాళ్ల కింద చూసే సంస్కృతి మారాలి.
`కార్మికులకు సినీ రంగంలో ఆత్మ గౌరవం పెరగాలి.
`కార్మికు చట్టాల ప్రకారం జీతాలు పెరగాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
సినిమా ఒక కళావ్యాపారం. ఆ సినిమా అనేది ఎంతో మంది కలిసి చేసే కృషి. కొన్ని వందల మంది కలిసి పనిచేస్తే పూర్తయ్యే యజ్ఞం. తెర మీద కనిపించే నటులే కాదు, ఆ తెరమీద బొమ్మలు ఆడడానికి అవవసరమయ్యే వారు ఎంతో మంది కష్టం కలిసి వుంటుంది. కాని అవేవీ పైకి కనిపించవు. వాళ్లెవరో ప్రపంచానికి తెలియదు. కాని వారి కష్టంకూడా సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా అనేది ఏ ఒక్కరో తయారు చేస్తే పూర్తయ్యే వంటకంకాదు. అందరూ కలిస్తేనే పూర్తవుతుంది. అలాంటి సినిమాకు 24 క్రాఫ్ట్స్ వర్స్ వుంటాయి. లైట్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే, దర్శకుడి వరకు అందరూ శ్రమించాల్సిందే. ఏ పని విభాగాన్ని బట్టి వారి కష్టం ఆధారపడి వుంటుంది. కాని ఏం లాభం. హీరోలకు ఇచ్చేంత రెమ్యునరేషన్, హీరోయిన్లకు ఇవ్వరు. దర్శకుడికి ఇచ్చేంత సొమ్ము, ఇతర విభాగాలకు ఇవ్వరు. ఎవరికి ఇచ్చినా అది కేవలం పారితోషికం మాత్రమే. నిర్ధిష్టమైన, నిర్ధారిత సొమ్ము కాదు. నిర్మాతలు సినిమా నిర్మాణాన్ని బట్టి నిర్ణయం చేసేది. సినిమా నటుల విషయంలో బేర సారాలుంటాయి. ఎందుకంటే ఆ విలువ వేలల్లో, లక్షల్లో వుంటుంది. హీరోల విషయంలో కోట్లలో వుంటుంది. కాని లైబ్ బాయ్‌కి మాత్రం పారితోషికం వందల్లోనే వుంటుంది. వేలు దాటింది ఇప్పటి వరకు లేదు. బైట అడ్డాకూలీలకంటే అద్వాహ్నంగా వుంటుంది. ఆ వందల రూపాయల పారితోషికమైనా నిత్యం వుంటుందా? అంటే అదీ లేదు. సినిమా వాళ్లు పిలిచినప్పుడు మాత్రమే వుంటుంది. ఆ సినిమా పూర్తయ్యే వరకు మాత్రమే వుంటుంది. ఇక వీరిలో జూనియర్ ఆర్టిస్టుల పరిస్ధితి మరీ అద్వాహన్నం. టెక్నికల్ కార్మికులకు సినిమా నడిచినంత కాలం వుండొచ్చు. కాని జూనియర్ ఆర్టిస్టులైన కార్మికులకు మాత్రం సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు అవసరం వున్నంత కాలం మాత్రమే వుంటుంది. ఆ సినిమా అయిపోయిన తర్వాత మరో సినిమా వచ్చేదెప్పుడో తెలియదు. అంత వరకు ఖాళీగానే వుండాలి. ఇంత కష్టపడి సినిమాలోనే ఎందకు పనిచేయాలన్న ప్రశ్న కూడా ఉత్పన్నతమౌతుంది. సినిమా అనేది ఒక వ్యసనం. అదో రంగుల ప్రపంచం. కొందరు తమ టాటెంట్‌ను ప్రదర్శించే రోజు రాకపోతుందా? అప్పటి వరకు ఏదో పని చేసుకోవాలన్న ఆలోచనతో పనిచేస్తుంటారు. అలా ఆ రంగంలోకి చేరిన వారు మళ్లీ బైటకు రాలేరు. జీవిత కాలం ఎదురుచూస్తూ ఆ పరిశ్రమలోనే కాలం కరిగిపోయిన వారు ఎంతో మంది వున్నారు. ఆకలి దహిస్తున్నా, సమస్యలు పరిగెత్తిస్తున్నా సినిమాను విడిచి వెళ్లలేరు. సినిమాను కాదనుకొని బతకలేరు. అది వారి బలహీనత. ఇదే నిర్మాతల పాలిట వరమైపోతోంది. ఇప్పుడే కాదు కొన్ని దశాబ్ధాలుగా ఈ దోపిడీ జరుగుతూనే వుంది. ఆ సినిమా ప్రపంచంలో జరుగుతున్న దోపిడీ ఏ హీరోకు కనిపించదు. కాని సినిమా పాత్రలతో మాత్రం ఏ పరిశ్రమలో నైనా కార్మికులకు ఇబ్బందులు ఎదరైతే హీరో వెళ్తాడు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తాడు. యాజమన్యాన్ని భయపెట్టిస్తాడు. వారి చేత కార్మికులను న్యాయం చేస్తాడు. కార్మికుల చేత జేజేలు కొట్టించుకుంటాడు. సినిమా అయిపోతుంది. కాని అదే సినీ పరిశ్రమలో నిత్యం కార్మికులు పడే కష్టాన్ని దగ్గరుండి చూస్తూనే వుంటారు. వారి చేతనే హీరోలు సేవలు చేయించుకుంటారు. మీకున్న కష్టమేమిటి? అని ఏ హీరో ఏ ఒక్క కార్మికుడిని అడిగిన సందర్భం వుండదు. అది ఎంత పెద్ద హీరో అయినా సరే కార్మికుల కోసం మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలా ఎవరికి వారు ప్రతి సినిమాకు మరమనుషులను వాడినట్లు కార్మికుల కష్టం దోచుకుంటుంటారు. కోట్లరూపాయలు పెట్టి సినిమా తీస్తున్నామంటారు. లెక్కలు మాత్రం కోట్లలో చెబుతుంటారు. సినిమా నిర్మాణ విలువల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదంటారు. హీరో ఎంత రెమ్యునరేషన్ అడిగితే అంత ఇస్తుంటారు. కాని కార్మికుల విషయానికి వచ్చే సరికి రూపాయి, రూపాయి లెక్కలు వేసుకుంటారు. పనిగంటలకన్నా, ఎక్కువ పనిచేసినా రూపాయి ఎక్కువ ఇచ్చేందుకు ఏ నిర్మాతకు చేతులు రావు. ఏ నిర్మాత ఎంత ఇస్తే అంతతీసుకునే రోజుల నుంచి కొంత డిమాండ్ చేసే వరకు కార్మికులు వచ్చారు. కాని వారి డిమాండ్ పెద్ద విలువైందేమీ కాదు. అయ్యా…ఓ పది రూపాయలు పెంచాలంటూ చేసుకున్న విన్నపాలే. అంతకు మించి కార్మికులు డిమాండ్ చేసిందెప్పుడూ లేదు. ఎందుకంటే అవన్నీ తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి పనులు. మొత్తం 24 క్రాఫ్ట్‌లలో సుమారు 24వేల మందికిపైగా కార్మికులు వున్నారు. ఏ ఒక్కరు నోరు తెరిచినా, వారిని పనికి పిలువరు. అందుకే కార్మికులు నోరు తెరిచేందుకు కూడా ధైర్యం చేయరు. ఇంత మంది వుండడంతో నిర్మాతలు వద్దను కుంటే ఆ మాత్రం ఉపాధి కూడా పోతుందేమో? అన్న భయం వారిని వెంటాడుతుంది. సరే ఒక సినిమాకు పనిచేసినా అది రోజూ వారి కూలీ పని అయినా ఏ రోజుకారోజు పారితోషికం ఇవ్వరు. కొన్ని సార్లు సినిమా పూర్తయ్యే వరకు కూడా ఇవ్వరు. ఆ సినిమా పూర్తి కాకముందే మరోసినిమా మొదలు పెట్టే నిర్మాతలు, ఆ సినిమా ఆశచూపి పనిచేయించుకుంటారు. రెండో సినిమా పూర్తయ్యే నాటికి మొదటిసినిమా పారితోషికం చేతుల్లో పెడుతుంటారు. ఇలా కూడా కార్మికులను వాడుకుంటారు. వారి శ్రమను దోచుకుంటారు. ఇక కార్మికులు ఎంత సమయం పనిచేయాలన్నదానిపై కార్మిక చట్టాలు స్పష్టంగా వున్నాయి. రోజుకు ఒక కార్మికుడి చేత 8 గంటలకన్నా ఎక్కువ పనిచేయించుకోకూడదు. కాని ఆ చట్టాలను సినీ వర్గాలు ఎప్పుడో తుంగలో తొక్కేశాయి. ఒక కార్మికుడు సినిమా షూటింగ్ స్పాట్‌కు ఉదయం 6 గంటల వరకు చేరుకోవాలి. అంటే ఆ కార్మికుడు రాత్రి 3 గంటలకు నిద్రలేవాలి. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం6 గంటలకు పనిచేయించుకుంటారు. నిజానికి ఉదయం 6 గంటలకు వచ్చిన కార్మికుడి చేత మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేయించుకోవాలి. కాని ఆ వ్యక్తి చేత సాయంత్రం 6 గంటలకు వరకు పనిచేయించుకుంటారు. అవసరమైతే రాత్రి పది గంటల వరకు పని చేయించుకుంటుంటారు. కాని పారితోషికమేమైనా అదనంగా ఇస్తారా? అంటే అదీ లేదు. ఇలా కార్మికుల బతుకులు బండలు చేస్తున్నారు. ఇలా నిత్యం విసిగి, విసిగి వేసారిన కార్మికులు కొంత మంది 2022లో సమ్మె బాట పట్టారు. దాంతో అప్పుడున్న పిల్మ్ చాంబర్ చైర్మన్ దిల్ రాజు వారి వేతనాలను ఏటా పది శాతం పెంచాలన్న నిర్ణయం చేశారు. కాని అది మూడేళ్లకోసారి అమలు చేయాలి. మూడేళ్లకు 30శాతం చొప్పున పెంచుతూ పోవాలన్నారు. ఇప్పుడు మూడేళ్లు దాటి పోయింది. కార్మికుల రెమ్యునరేషన్లో 30శాతం పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కాని ఫిల్మ్ చాంబర్ స్పందించడం లేదు. కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. దాంతో కోపం వచ్చిన నిర్మాతలు, ఫిల్మ్ చాంబర్ పెద్దలు కార్మికుల మీద చర్యలు తీసుకోవాలంటూ కార్మిక శాఖకు పిర్యాధు చేసినట్లు సమాచారం. ఇది విచిత్రంగా వుంది. నిర్మాతలు తమ మాట తప్పితే, మూడేళ్ల వ్యవధి దాటినా రాసుకున్న బైలా ప్రకారం రేమ్యునరేషన్ చెల్లించడం లేదని కార్మికులు పిర్యాధు చేయాలి. కాని విచిత్రంగా నిర్మాతలే కార్మికుల మీద కేసులు నమోదు చేసే దాకా వెళ్లారని తెలుస్తోంది. ఇలా కార్మికులను అణిచి వేసి, భయపెట్టి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కార్మికులు కొంత మంది నేటిధాత్రిని ఆశ్రయించారు. కార్మికులకు ఇండ్ల విషయంలో నేటిధాత్రి పోరాటం వారికి తెలుసు. కార్మికుల పక్షాన నేటిదాత్రి పోరాటం, కార్మికుల విజయం చూస్తూనే వున్నారు. చిత్ర పురిపై నేటిధాత్రి కొన్ని సంవత్సరాలుగా పట్టువదలకుండా సాగిస్తున్న పోరాటంలో కార్మికులకు అనేక విజయాలు చేకూర్చిపెట్టింది. కార్మికులను నిలబెట్టింది. చిత్ర పురిలో ఎలాంటి సమస్యపైన అయినా సరే నేటిధాత్రి కార్మికుల అండగా సాగిస్తున్న పోరాటంతో 24 క్రాఫ్ట్ కార్మికులు కూడా ఆశ్రయించారు. తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. నిర్మాతలు చేస్తున్న అన్యాయాలను వివరించారు. తమ కష్టం నేటిదాత్రితో చెప్పుకున్నారు. తమకు న్యాయం జరగాలంటే నేటిధాత్రి వల్లనే సాద్యమౌతుందని గుర్తించారు. చిత్రపురి కార్మిక లోకమంతా నేటిధ్రాత్రికి ఎలా రుణపడి వుంటుందో, మాకు పారితోషకం విషయంలో అక్షర సాయం చేయాలని కోరుకున్నారు. దాంతో నేటిధాత్రి కార్మికుల పోరాటానికి అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నది. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నేటిధాత్రి యాజమాన్యం కార్మికులకు హమీ ఇచ్చింది.