పార్లమెంటు ఎన్నికలలో గులాబీ రెపరెపలే! కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌

https://netidhatri.com/telanganas-interests-are-protected-only-by-brs-says-karimnagar-brs-candidate-boinapally-vinod-kumar/

పార్లమెంటు ఎన్నికలలో గులాబీ రెపరెపలే!

కాంగ్రెస్‌, బిజేపి ఆశలు అడియాసలే అంటున్న తెలంగాణ ఉద్యమ కారుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే…

కాంగ్రెస్‌ అబద్ధాలు ఇక జనం నమ్మరు.

మూడు నెలల్లోనే మోసం చేసిన వారికి ప్రజల్లో స్థానం లేదు.

బండి గెలిచేది లేదు..కమలానికి తెలంగాణలో చోటు లేదు.

ఐదేళ్లు బండి సంజయ్‌ నయా పైస పని చేయలేదు.

నేను ఎంపిగా సాధించిన వాటిని తనవిగా చెప్పుకుంటున్నాడు.

కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ తెచ్చింది నేను.

బండి అదనంగా తెచ్చిందేమిటో చూపించమనండి.

పార్లమెంటులో ఒక్కసారి కూడా మాట్లాడలేని వాళ్లను ఎన్నుకుంటే వృధా!

ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చేసేవారిని నమ్మొద్దు.

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఒక్క బిఆర్‌ఎస్‌ మాత్రమే.

జై తెలంగాణ అనని వాళ్లలో ఆత్మగౌరవం ఎక్కడుంటుంది.

డిల్లీ పెద్దలు దగ్గర నిలబడే వారి నోటి నుంచి మాటేమి వస్తుంది.

కొట్లాడే తత్వం బిఆర్‌ఎస్‌ సొంతం.

తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నా అనుభవం.

నిధులు సాధించిన ఘనత నాకే దక్కుతుంది.

కరీంనగర్‌ ప్రగతికి పాటుపడిరది నేను అని గర్వంగా చెబుతాను.

కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు. నష్టాలు.

కరెంటు కోతలు, మంచి నీటి వెతలు.

కాంగ్రెస్‌ అంటేనే సాగు విధ్వంసం.

బిజేపికి రైతంటేనే కోపం.

పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదంటే రైతులంటే బిజేపికి ఎంత ద్వేషమో చెప్పొచ్చు.

రైతు లేనిదే దేశం లేదు.

బిజేపి వ్యాపారస్తులను పెంచి, రైతులను చిదిమేస్తోంది.

దేశంలో మళ్ళీ ప్రాంతీయ పార్టీల వైపే ప్రజలు చూస్తున్నారు.

జాతీయ పార్టీలను ఈ ఎన్నికలలో సమాధి చేస్తారు.

కొట్లాట మాకు కొత్తకాదు. తెలంగాణ కోసం తండ్లాట మాకు ఎవరో నేర్పాల్సిన పనిలేదు. తెలంగాణ గోస చూసినోళ్లం. తెలంగాణ గోస తీర్చినోళ్లం. తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కొట్లాడినోళ్లం. తెగించి పోరాటం చేసినోళ్లం. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించినోళ్లం. మాకు ఎవరైనా నీతులు చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఉమ్మడి రాష్ట్రంలోనే బరి గీసి కొట్లాడిన చరిత్ర మాది. మా నాయకుడు కేసిఆర్‌ది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో చెప్పేది. తెలంగాణ తెచ్చి, అన్ని రంగాలలో అభివృద్ది చేసి, పదేళ్లపాటు తెలంగాణ ప్రగతిని సుస్ధిరం చేసి, అభివృద్దిని పరుగులు పెట్టించి, తెలంగాణను అన్న పూర్ణగా తీర్చిద్దితే, మూడు నెలలకే మళ్లీ పాత రోజులు తెచ్చిన కాంగ్రెస్‌ను నమ్మేదెవరు? వారి మాటలు వినేదెవరు? మొన్నటి శాసన సభ ఎన్నికల్లోనే ప్రజలు కాంగ్రెస్‌ను ఏమరపాటులో నమ్మితే ఏం జరుగుతుందో చూస్తూనే వున్నాం. ఒక్క అవకాశం అంటూ ప్రజలను పదే పదే వేడుకొని గెలిచి, మళ్లీ తెలంగాణ రైతాంగాన్ని నిప్పుల్లోకి తోస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ వాళ్లకు ఇసుమంతైనా తెలంగాణ మీద ప్రేమ లేదు. ఎంత సేపు అధికారం మీద యావ తప్ప, ప్రజాసంక్షేమం పట్టదు. అసలు కాంగ్రెస్‌ నాయకులకు, బిజేపి నాయకులకు తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. తెలంగాణ ఆకాంక్షలు తెలియదు. ప్రజలు కనికరించి అధికారమిస్తే ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందిపోయి, సోయి లేని మాటలు మాట్లాడుతున్నారు. రైతు బంధు అడిగినందుకు ప్రజలనే చెప్పుతీసుకొని కొడతామంటున్నారు. వాళ్ల మాటలు మరీ మితిమీరిపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన వాళ్లు సంపద సృష్టించాలి. ప్రజలకు పంచాలి. అభివృద్ది దారులు వేయాలి. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ వేసిన ప్రగతి దారులుకు కొనసాగింపు వుండాలే కాని కాంగ్రెస్‌ వాళ్లు మళ్లీ తెలంగానను తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారు. అధికారంలోకి వస్తే లంకెబిందెలుంటాయనుకున్నాం..కాని కుండలున్నాయని ఏ పాలకులైన అంటారా? అలాంటి మాటలు ఎవరు మాట్లాడతారో తెలుసా? ఇక తెలంగాణకు బిజేపి కూడా చేసిందేమీ లేదు. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు. ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు. గురుకులం ఇవ్వలేదు. తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన ఐటిఐఆర్‌ లాంటి ప్రాజెక్టులను గుజరాత్‌ తరలించుకుపోయారు. కాజీపేజ కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. సైనిక, రక్షణ వ్యవస్ధకు చెందిన ప్రాజెక్టును బుందేళ్‌ఖండ్‌కు తీసుకెళ్లారు. తెలంగాణకు ఇవ్వాల్సిన వాటిని బిజేపి మాయం చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్‌ తెలంగాణను ఆగం చేస్తోంది. దాంతో ప్రజలు అప్పుడే తేరుకున్నారు. మన కేసిఆర్‌ను కాదనుకున్నందుకు ఇబ్బందులు పడుతున్నామని మధనపడుతున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో బిజేపి, కాంగ్రెస్‌కు బుద్దిచెప్పడానికి సిద్దమయ్యారు. మళ్లీ తెలంగాణలో గులాబీ రెపరెపలు త్వరలోనే చూడబోతున్నాం. మెజార్టీ పార్లమెంటు సీట్లు మేమే గెలవబోతున్నామంటున్న తెలంగాణ ఉద్యమ కారుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి బోయిన పల్లి వినోద్‌ కుమార్‌ నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ మెజార్టీ స్దానాలు గెల్చుకుంటుంది. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ గుండెకాయ. సింహగర్జనతో మొదలు తెలంగాణ సాధన దాకా కరీంనగర్‌ ప్రస్ధానం గొప్పది. అందులో నా పాత్ర ప్రజలకు తెలుసు. అందుకే మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు, పట్టణ, పల్లె అన్న తేడా లేకుండా బిఆర్‌ఎస్‌కే జై కొడుతున్నారు. కేసిఆర్‌ నాయకత్వం కోసం మళ్లీ పరితపిస్తున్నారు. కేసిఆర్‌ వుంటే కరవు వుండదు. కష్టాలను దరి చేరనివ్వరు. తెలంగాణలో నీటి గోస లేకుండా చేశారు. తెలంగాణ సస్యశ్యామలం చేశారు. అన్ని రంగాలలో తెలంగాణను పరుగులు పెట్టించారు. కరంటు కష్టాలు తీర్చాడు. సాగును స్దిరీకరించేలా చేశాడు. ఇరవై నాలుగు గంటల ఉచితకరంటుతో పెద్దఎత్తున సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతోపాటు, పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తితో తెలంగాణను సాగుకు మణిహారం చేశారు. తెలంగాణ రైతాంగానికి స్వర్ణయుగం చూపించారు. అబద్దాలు ఆడితే తప్ప అధికారంలోకి రాలేమని గ్రహించి కాంగ్రెస్‌ ప్రజలను మాయ చేశారు. అధికారంలోకి వచ్చి వంచిస్తున్నారు. అలవికాని అబాద్దాలు చెప్పి, మాటలు కోటలు దాటించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కాళ్లు తంగేడు దాటవని అర్ధమైపోయింది. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టని నమ్మడానికి ఇక ప్రజలు సిద్దంగా లేరు. పదేళ్లలో ఏ ఒక్క రోజు చేను ఎండిపోలేదు. కనీసం మడి తడారలేదు. నీళ్లు అందడం లేదనో..కరంటు రావడం లేదనో..పంటకు గిట్టుబాటు దర రావడం లేదనో, దాన్యం కొనుగోలు జరగడం లేదనో ఒక్క రోజంటే ఒక్క రోజుకూడా రైతు రోడ్డెక్కింది లేదు. కాని కాంగ్రెస్‌ వచ్చింది. సాగు సొగసు కోల్పోయింది. పొలం నీళ్లకోసం ఏడుస్తోంది. రిజర్వాయర్లలో వున్న నీళ్లను కూడా వినియోగించక, రైతును కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ గోసపెడుతోంది. పొట్టకొచ్చిన పంట నీరు లేక, ఎండిపోతుంటే రైతు గుండె తరుక్కుపోతోంది.
ఇక కరీంనగర్‌ విషయానికి వస్తే బిజేపి చేసిందేమీలేదు. బండి సంజయ్‌ తెచ్చిన నిధులేమీ లేదు. కరీంనగర్‌కు ఫలానా ప్రాజెక్టు తెచ్చానని చెప్పగలడా? కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చాడు? ఎన్ని పనులు చేశాడో చెప్పగలడా? కనీసం పార్లమెంటులో కరీంనగర్‌కు వున్న సమస్యలు ఏనాడైనా ప్రస్తావించాడు. ఫలాన పనులకు నిధులు కావాలని కోరాడా? కాని నేను ఐదేళ్ల కాలంలో 106 సార్లు పార్లమెంటులో మాట్లాడాను. పిఆర్‌ఎస్‌ ఇండియా అనే సంస్ధ చేసిన సర్వేలో మొదటిస్ధానంలో వున్నాను. ప్రజా సమస్యల మీద ప్రైవేటు బిల్లులు పెట్టాను. ప్రశ్నోత్తరాల సమయంలో ఎక్కువ సమస్యలు వెలుగులోకి తెచ్చాను. పార్లమెంటు సమావేశాలకు విధిగా హజరయ్యాను. సమావేశాలున్నంత కాలం డిల్లీలో, తర్వాత కరీంనగర్‌లోనే వుంటూ, ప్రజా సమస్యలు పరిష్కరించాను. ఇప్పటికీ ఎప్పడూ అందుబాటులోనే వుంటున్నాను. వుంటాను. తెలంగాణ సమస్యలు పార్లమెంటులో ప్రస్తావించాను. కరీంనగర్‌ కు అవసరమైన నిధుల గురించి ప్రశ్నించాను. నిధులు కేటాయించాలని కోరాను. సాధించాను. కరీంనగర్‌కు రైలు తెచ్చాను. ఆ ప్రాజెక్టును పట్టుబట్టి సాధించాను. కొత్త పల్లి` మనోహరాబాద్‌ మార్గాన్ని సుగమం చేశాను. రైతుకూతను వినిపించాను. కరీంనగర్‌కు స్మార్టు సిటీ హోదా కల్పించాను. కేంద్రం నుంచి నిధులు తెచ్చాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వున్నాయి. నేను సాధించిన ప్రాజెక్టులను అనంతరం కాలంలో ప్రారంభిస్తూ, తన విజయాలుగా చెప్పుకోవడం తప్ప బండి సంజయ్‌ చేసిందేమీ లేదు. అది కరీంనగర్‌ ప్రజలకు బాగా తెలుసు. వారాలు లెక్కబెట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం, ప్రజల్లో అలజడిని పెంచడం, వారి మధ్య చీలిక తేచ్చి రాజకీయం చేయడం తప్ప బండి సంజయ్‌ చేసిందేమీ లేదు.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఒక్క బిఆర్‌ఎస్సే. జై తెలంగాణ అని కూడా అనడానికి నోరు రాని, బిజేపి, కాంగ్రెస్‌ వాళ్లకు తెలంగాణలో ఓట్లడితే నైతికతే లేదు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొని, మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్‌ నాయకులెవరైనా జై తెలంగాణ అంటారా? అనగా వింటున్నామా? కాంగ్రెస్‌, బిజేపి వాళ్లలో తెలంగాణ ఆత్మ లేదు. తెలంగాణ ఆత్మగౌరవం నిలపాలన్న సోయి లేదు. తెలంగాణను అభివృద్ది చేసుకోవాలన్న కోరికలేదు. తెలంగాణను అన్ని రంగాలలో ముందు వరసులో నిలపాలన్నది లేదు. ఎంత సేపు రాజకీయం..అధికారం.. మాత్రమే వారిలో కనిపిస్తోంది.

ఒక్క బిఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ సంక్షేమాన్ని కోరుకుంటుంది. డిల్లీ పెద్దల వద్ద సాగిలపడి నిలబడేవారు తెలంగాణ కోసం నిధులు సాదిస్తారని అనుకోవడం మన భ్రమ. ఐదేళ్ల కాలంలో బిజేపి ఎంపిలు ఎన్నికల ముందు చెప్పిన మాటలుకూడా పూర్తి చేయలేదు. ఇచ్చిన హమీలను నెరవేర్చాలన్న ఆలోచన కూడా చేయలేదు. బిఆర్‌ఎస్‌ది కొట్లాడే తత్వం. కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా, కొట్లాడి నిధులు సాధిస్తాం. తెలంగాణ అభివృద్దిని కొనసాగిస్తాం.
తెలంగాణ ఉద్యమ ప్రస్తానంలో నా పాత్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని తరాలకైనా చరిత్ర నా గురించి చెబుతుంది. కరీంనగర్‌కు నిధులు సాధించిన ఘనత నాకే దక్కుతుంది. కరీంనగర్‌ ప్రగతికి పాటు పడిరది నేనే అని గర్వంగా చెప్పగలను. ఇక కాంగ్రెస్‌ అంటే ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు మోసుకొచ్చేది. ప్రజలకు నష్టాలు తెచ్చిపెట్టేది. ఎక్కడైనా ఒక కొత్త ప్రభుత్వం వస్తే ఏడాదికో, రెండేళ్లలో ప్రజలకు కొన్ని సమస్యలు మొదలౌతాయి. కాని కాంగ్రెస్‌ వచ్చిన పది రోజుల్లోనే ప్రజలను కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు. ఇచ్చిన హమీలను గాలికి వదిలేశారు. రైతు బంధుకూడా ఇవ్వలేకపోతున్నారు. అధికారంలోకి రాగానే రైతు బంధు ఎకరానికి ఏడున్నర వేలు ఇస్తామన్నారు. కనీసం ఐదువేలకే దిక్కులేదు. అడిగితే రైతులనే చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు. తెలంగాన అసహ్యించుకునే బాషను ఉపయోగిస్తున్నారు. అనుక్షణం అభద్రతలో పాలనసాగిస్తున్నారు. వారిలో అధికారం ఫోబియా పట్టుకున్నది. దాంతో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే రెండు లక్షల రైతు రుణ మాఫీ అన్నారు. అసలు ఆ ఊసు కూడా ఎత్తే పరిస్దితిలో లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలకు లెక్కేలేదు.
తెలంగాణలో బిజేపిని కూడా నమ్మే పరిస్ధితి లేదు. పదేళ్లలో దేశ ప్రజలను అరి గోస పెట్టారు. దేశంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. రైతుకన్నా, ప్రారిశ్రామిక వేత్తలు బిజేపికి ఎక్కువయ్యారు. బిజేపి వ్యాపారులను పెంచి, రైతులను ఆగం చేస్తున్నారు. డిల్లీ వీధుల్లో రైతుల పట్ల ఎంత అమానుషంగా, కర్కషంగా బిజేపి వ్యవహరిస్తుందో చూస్తూనే వున్నాం. బిజేపి ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదు. కాంగ్రెస్‌కు చిత్త శుద్ది లేదు. సుస్ధిర ప్రభుత్వాలుంటే ప్రజలపై ఎంత నిర్ధాక్ష పాలన సాగిస్తారో అన్నది బిజేపి నిరూపించింది. ప్రజా వాణికి భిన్నంగా ఎలా ప్రవర్తిస్తుందో చూపిస్తోంది. అందువల్ల దేశ రాజకీయాల్లో రానున్న రోజుల్లో, పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాంతీయపార్టీలే కీలక భూమిక పోషించనున్నాయి. తెలంగాణ ప్రయోనాలు మెరుగపడాలన్నా, తెలంగాణకు అత్యధిక నిధులు రావాలన్నా, బిఆర్‌ఎస్‌ మెజార్టీ స్ధానాలలో గెలవడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!