తెలంగాణ పర్యాటక రంగంలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. చేరువలోని ప్రాంతాలు, అంతర్రాష్ట్రాల మధ్య సందడి మొదలవుతోంది. పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త ఆకర్షణలతో తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌తో పాటు ఇటు జిల్లాల్లోనూ ఏర్పాట్లపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగానే కృష్ణమ్మ పరవళ్లపై ఆహ్లాదకరంగా లాంచీ ప్రయాణం చేసే సౌకర్యాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించింది.
కృష్ణమ్మ పరవళ్లు… మరోవైపు చుట్టూ కొండలు… మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు… ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు.
సాగర్ నుంచి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల మేర 7 గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600 టికెట్ ధర నిర్ణయించారు.
ప్రపంచ వాణిజ్యంలో పర్యాటకరంగం ఎంతో కీలకమైనది. కొన్ని దేశాల ఆర్థికవ్యవస్థలు పూర్తిగా పర్యాటకరంగంపైనే ఆధారపడి ఉన్నాయి.
ఒకప్పుడు పర్యాటకం ఒక విలాసం కాగా.. ఇప్పుడు అది నిత్యావసరం. ప్రజల జీవన స్థాయుల్లో వచ్చిన మార్పులే అందుకు ప్రధాన కారణం.
పర్యాటకం అంటే కేవలం అందమైన ప్రదేశాలు చూడటమే కాదు. వైద్యం, విద్య, వ్యాపార అవసరాలు, విశ్రాంతి తీసుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారిని కూడా పర్యాటకులనే అంటారు.
పర్యాటక రంగానికి కలిసి వచ్చే అంశాలను సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే తెలంగాణలో ఉన్న టూరిస్ట్ స్పాట్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని.. ప్రకృతి ప్రేమికులు.. పర్యాటకులు కోరుతున్నారు