Panjala Srinivas Goud Launches Githa Workers Association Calendar
తెలంగాణ రాష్ట్ర గీత పని వారల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన-పంజాల శ్రీనివాస్ గౌడ్
కరీంనగర్, నేటిధాత్రి:
గీతాపని వారాల సంఘం క్యాలెండర్ ను కరీంనగర్ లోని బద్ద ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత పని వారాల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం సంతోషదాయకమని ఇది గీత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.‘దున్నేవాడికి భూమి’ అనే నినాదానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం నినదించిన ‘గీసేవాడిదే చెట్టు’ అనే నినాదానికి అంతే ప్రాధాన్యత ఉన్నదని, ఇప్పటికీ ప్రజల మనసులో ఉండిపోయిందని గుర్తు చేశారు. బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా గీత పనివారల సంఘాన్ని విస్తరించారని, అనేక ఉద్యమాలను చేపట్టారని తద్వారా అనేక హక్కులను సాధించారని గుర్తు చేశారు. నీరా శీతలపానియంగా మారాలన్న బొమ్మగాని ధర్మభిక్షం కోరిక అమలులోనికి వచ్చినప్పటికీ, మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి ఉందన్నారు. ఈసంఘం సహకార సంఘాల ఏర్పాటును, ఎక్స్ గ్రేషియాను చెల్లించడాన్ని సాధించిందన్నారు. ధర్మభిక్షం ఆశయాల అమలుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
దీంతోపాటు గీతా పరివారల సంఘం రానున్న కాలంలో పేద వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారల సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలపట్ల రాజు గౌడ్, కార్యవర్గ సభ్యులు పైడిపల్లి రాజు గౌడ్, బుర్ర చంద్రశేఖర్ గౌడ్, బీసీ నేత కటికరెడ్డి బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.
