రాజగోపాల్ రెడ్డి బిజేపిలో చేరడంతో వచ్చిన ఉప ఎన్నిక.
నాలుగు నెలలుగా మునుగోడు వార్తల్లో నిలిచింది.
ఎంతో ఆసక్తిని తేలుతున్న ఉప ఎన్నిక.
ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచే మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత వరుసగా బహిరంగ సభలు.
ఆ తర్వాత అక్కడే మకాం వేసిన రాజకీయ పార్టీలు.
మూడు నెలలుగా హోరెత్తిన ప్రచారం.
ప్రజలు ఎవరిని కనికరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి…
ఎవరికి వారే వేసుకుంటున్న లెక్కలు!
గెలుపు, బలాబలాలపై ఆరాలు…
మునుగోడు పోలింగ్ పై ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి.
హైదరాబాద్,నేటిధాత్రి:
మూడు నెలలుగా సాగుతున్న మునుగోడు ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. గ్రామాల్లో మైకుల మోత ఆగిపోయింది. ఒక్కసారిగా తుఫాను వెలిసినట్టు వాతావరణం చల్లబడ్డది. కాని లోపల ఈ గరం కనిపిస్తూనే వుంది. ప్రచారానికైతే స్వస్తి జరిగింది. కాని అసలు కథ ఈ రోజే మొదలౌతుంది. ప్రలోభాల పరిఘట్టం ఈ రోజే శ్రీకారం జరుగుతుంది. ఉప ఎన్నిక రోజు సాయంత్రం దాకా గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది. ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నిక కోసం సర్వం సిద్దం చేసింది. యంత్రాంగం సిద్ధమైంది. పూర్తి బందోబస్తు మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరగనున్నది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి, బలగాలను మోహరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మూడు నెలల క్రితం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు.
బిజేపి తీర్ధం పుచ్చుకున్నారు. నిజానికి రాజగోపాల్‌రెడ్డి రెండేళ్ల కిందనుంచే బిజేపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనే చెప్పుకున్నాడు. ఇదిలా వుంటే బిజేపికి వెళ్లడానికి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అంతకంతకూ దిగజారుతోందని టిఆర్‌ఎస్‌లో చేరాలని పలు ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది. ఈ విషయం సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా టిఆర్‌ఎస్ గాని, బిజేపిలోకి గాని వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాడు. అయితే టిఆర్‌ఎస్‌లోకి ఆయన ఆహ్వానించేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ సుముఖత వ్యక్తం చేయలేదు. కోమటిరెడ్డి సోదరులు ఒక్క మాట మీద నిలబడే వ్యక్తిత్వం వారిలో లేదని కేసిఆర్ చెప్పినట్లు కూడా కేటిఆర్ వివరించడం జరిగింది. ఆయను నమ్మిన రాజశేఖరరెడ్డిని, జగన్‌ను మోసం చేశారని, అలాంటి వారు అవకాశవాదులని చెప్పడం జరిగిందన్నది కేటిఆర్ చెప్పడం జగింది.
రాజగోపాల్‌రెడ్డి స్వయంగా కేటిఆర్‌ను కలిసి తాను టిఆర్‌ఎస్‌లో జాయినౌతానని కూడాచెప్పినట్లు వెల్లడిరచారు.
అంతే కాకుండా చాల మంది నేతలతో కూడా రాయబారాలు పంపినా మా పార్టీ రాజగోపాల్‌ను దరి చేరనీయలేదు. దాంతో ఆయన బిజేపి వైపు చూసినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా తన కొడుకు వ్యాపారమైన సుషి ఇన్‌ఫ్రా కోసం రూ.18వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కూడా వచ్చేందుకు బిజేపి సహకరించడంతో ఆ పార్టీలో చేరినట్లు రాజకీయ ఆరోపణలున్నాయి. కాకపోతే కాంట్రాక్టుకు సంబంధించిన విషయం రాజగోపాల్‌రెడ్డే చెప్పడంతో రాజకీయ పార్టీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లైంది. ఎప్పుడైతే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాడో అప్పటినుంచి రాజకీయ పార్టీలన్నీ మునుగోడులో మకాం వేశాయి.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన రెండో రోజే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చండూరులో పెద్ద ఎత్తున సభ జరిగింది.
ఆ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డినుద్దేశించి ఆ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ ఆగట్టునుంటావా? ఈ గట్టునుంటావా? అంటూనే ఓ వ్యాఖ్య చేశాడు. అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. వెంకటరెడ్డి ఆ ఒక్క మాటను అడ్డం పెట్టుకొని పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ గా వుంటూ కూడా ప్రచారం చేయలేదు. చేయనని కూడా తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అక్కడి నుంచి తమ్ముడు రాజగోపాల్ గెలుపు ప్రచారం మొదలుపెట్టారు. గ్రామ స్ధాయి నాయకులకు, అనుచరులకు ఫోన్లు చేశారు. ఇదిలా వుంటే బిజేపి కూడా మునుగోడు ఉప ఎన్నిక మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నది. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరమైన విజయాలు కాకపోయినా, వాటిని ఖాతాలో వేసుకొని దూకుడు కనిపించేలా ప్రచారం సాగించింది. ఒక దశలో తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం సృష్టించేందుకు కూడా ప్రయత్నం జరిగిందనేది తెలుస్తోంది.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికకు మరింత హీట్ పెంచింది. హోరా హోరీగా మార్చింది.
మునుగోడు ఉప ఎన్నికను అధికార టిఆర్‌ఎస్ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కొంత కాలానికి ముఖ్యమంత్రి కేసిఆర్ సభ నిర్వహించారు. ఎన్నికల నాటికి మళ్లీ వస్తానని చెప్పి అక్టోబర్ 30న మరోసారి సభ నిర్వహించారు. తెలంగాణలోని 80 మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీ మోహరించింది. ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు మొత్తం టిఆర్‌ఎస్ శ్రేణులన్నీ మునుగోడు ప్రచారం సాగించాయి. అదే విధంగా బిజేపి కూడా కేంద్రమంత్రులు, సీనియర్ నాయకులు, ఇతర జిల్లాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున మునుగోడులో ప్రచారం సాగించాయి. పెద్దఎత్తున వలసలు ప్రోత్సహంచారు. ఎవరు ఏ పార్టీలో వున్నారో, ఎటు వైపు వెళ్తున్నారో కూడా తెలియని గందరగోళం సృష్టించారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి ఆఖరు నిమిషం దాకా టిక్కెట్టు కన్‌ఫర్మ్ చేయలేదు.
ఆమె కూడా గట్టిపోటీ ఇస్తుందన్నది విశ్లేషకుల మాట. ఇలా మూడు నెలలుగా రకరకాల రాజకీయ విన్యాసాలతో ప్రచారం సాగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన ఏకైక అంశం అభివృద్ధి. అందులో ప్రధానంగా ఫ్లోరైడ్ సమస్య. ఫ్లోరైడ్ సమస్య తీర్చి, మునుగోడు కష్టంతీర్చడంతో టిఆర్‌ఎస్ పాత్రను ఎవరూ కాదనలేనిది. దశాబ్ధాలుగా జరగని పనిని తెలంగాణ వచ్చిన వెంటనే జరిగింది. మునుగోడులో ఫ్లోరైడ్ నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. ఈ విషయాన్ని బిజేపి సైతం ఓన్ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది కాని సక్సెస్ అయినట్లు కనిపించలేదు. కాంగ్రెస్ మాత్రం ఆ విషయం ప్రస్తావించకుండా సైలెంటుగా ప్రచారం చేసుకుంటూ వెళ్లింది.
ఇక ప్రచార పర్వం పూర్తయ్యింది. ఇక ప్రలోభ పర్వం మొదలౌతుందంటున్నారు.
ఏ ఎన్నికల్లో అయినా ఇది కామన్‌గా మారింది. ప్రచార సమయం ముగిసిన రోజు నుంచి పోలింగ్ రోజు వరకు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు నియోజకవర్గంలో రకరకాల తాయిలాలు గుట్టు చప్పుడు కాకుండా అందిస్తుంటారు. రాత్రికి రాత్రి పంపకాలు జరుగుతుంటాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో దసరా పండుగ రోజు రాజీకీయ పార్టీలు జరిపిన పంపకాలు కూడా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. ఇక దీపావళి పండుగను కూడా రాజకీయ పార్టీలు వదలలేదు. ఆ రోజు కూడా ప్రజలను మచ్చిక చేసుకునే ఎత్తుగడలు వేవారు. ఆ మధ్య జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో తమకు అందాల్సినవి అందలేదని ప్రజలు ధర్నా చేసిన సందర్భం కూడా చూశాం. అంటే ప్రజలను ఆ విధంగా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేసి పబ్బం గడుపుకుంటున్నాయి. ఓటర్‌ను అవినీతి పరుడిగా చిత్రీకరించే దుష్ట ప్రయత్నాలు కొన్నేళ్లుగా సాగుతూనే వున్నాయి. మునుగోడులోనూ అదే నడస్తోందన్న ప్రచారం ఊపందుకొన్నది. ప్రలోభాలు లేకుంటే ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఏ పార్టీకి లేదు. ఏది ఏమైనా ఓ వైపు ఎన్నిక టెన్షన్‌తోపాటు, లెక్కలు కూడా వేసుకోవడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. ఓటరు మహాశయుడు ఎవరిని కరునిస్తారో అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది.