
-వలసవాదుల అవమానాలు భరించలేకే పార్టీ మారనున్నారా..?
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 2
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పటి నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి, 2001 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా, అనంతరం మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ..పార్టీ ప్రతిష్టతకు విశేష కృషి చేసిన గాజుల మల్లయ్య గౌడ్ చూపు ఎటువైపోనని మండలంలో చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామానికి చెందిన గాజుల మల్లయ్య గౌడ్ సమైక్యాంధ్రలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు నాటి ఉద్యమ నేత..ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీలో 2001 సంవత్సరంలో చేరారు. అప్పటినుండి తెలంగాణ ఉద్యమ నేతగా ఏరోంది.. గ్రామంలోని యువకులను, రైతులను, మహిళా సోదరీమణులను, విద్యార్థులను ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలను కలుపుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని పటిష్టం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రధాన అనుచరుడిగా గ్రామంలో పేరు సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి తనకు పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం, పార్టీలో అవమానాలు జరగడంలాంటివి భరించలేక ఆయన పార్టీని వీడెందుకు సిద్ధమైనట్లు తన అనుచరుల ద్వారా తెలిసింది. గాజుల మల్లయ్య గౌడ్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో పాటు తెలంగాణ ఉద్యమకారులతో సత్సంబంధాలు కలిగి ఉండడం, పర్లపల్లి గ్రామంలో మంచి పట్టు ఉండడంతో ఆయన పార్టీ మారితే ఎమ్మెల్యే గండ్రకు భారీ షాక్ తగిలే ప్రమాదం ఉంది. ఆయనతో కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.