“నేటిధాత్రి”, హైదరాబాద్:
స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. పలు రంగాలకు భూ కేటాయింపులు జరిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ కూడా ఇస్తామన్నారు.
‘‘రాష్ట్రంలో కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నల్సార్‌లో స్థానిక విద్యార్థులకు 50శాతం సీట్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. నల్సార్ వర్సిటీకి గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా 7 ఎకరాలు ఇస్తాం. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కేంద్రం కొనుగోలు చేసినా.. చేయకపోయినా మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తాం. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేశాం. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించాం. మెట్రో రెండో దశను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఎస్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు
