పల్లెల్లో పచ్చ జెండాలు!

https://epaper.netidhatri.com/view/302/netidhathri-e-paper-26th-june-2024%09/2

`ఊరూరా వెలుస్తున్న గద్దెలు!

`తెలుదేశానికి మళ్ళీ ఊపిరులు

`అమరావతి కేంద్రంగా మంతనాలు.

`ముందు జెండాలతో మొదలు.

`త్వరలోనే కమిటీలు.

`పార్టీ పదవుల కోసం తెలుగు తమ్మళ్ల ఎదురుచూపులు.

`టిఆర్‌ఎస్‌ వల్లనే టిడిపికి ఊపిరి.

`బిఆర్‌ఎస్‌ ప్రశ్నించలేదు.

`కేసిఆర్‌ ప్రశ్నించినా తెలంగాణ ప్రజలు ఇక నమ్మరు.

`టిఆర్‌ఎస్‌ ను బిఆర్‌ఎస్‌ చేసినప్పుడే హక్కు కోల్పోయింది.

`తెలంగాణలో టిడిపికి అనుకూల వాతావరణం మొదలైంది.

`హైదరాబాదులో బలంగా వుంది.

`ఓ ఐదు జిల్లాలలో ఉనికి బాగానే వుంది.

`భవిష్యత్తులో క్రియాశీలక పాత్రకు అవకాశం వుంది.

`బిజేపితో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తుకు రెడీ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. పైకి పెద్దగా ఫోకస్‌ కాకపోయినా, ఏపిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో లేదో..అప్పుడే తెలంగాణ పల్లెల్లో పచ్చ జెండాలు రెపరెపలాడుతున్నాయి. రాత్రికి రాత్రే ఎక్కడిక్కడ తెలుగుదేశం కొత్త గద్దెలు ఏర్పాటు చేశారు. జెండాలు ఎగుర వేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోని చాలా పల్లెల్లో గత వారంలో రోజుల్లోనే ఈ గద్దెల నిర్మాణం, జెండాల ఎగురవేత కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరుకు చంద్రబాబు చేసిన పని వల్ల ఓటుకు నోటు కేసు కలిసి వచ్చి, ఉమ్మడి రాజధాని కాస్త అమరావతికి వెళ్లిపోవాల్సివచ్చింది. ఆ తర్వాత ఉద్యమ కారులైనా, తెలంగాణ వాదులైనా తెలుగుదేశం పార్టీని నమ్మడానికి ఇష్టపడలేదు. ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయో? అన్న భయం వారిలో ఏర్పడిరది. దీనికి తోడు 2014లో కేంద్ర ప్రభుత్వంలో మొదటి క్యాబినేట్‌ మీటింగ్‌లోనే తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఏపిలో రాత్రికిరాత్రే కలిపేయడం వంటివికూడా చంద్రబాబుకు వ్యతిరేకతకు కారణమైంది. దానికి తోడు సీలేరు విద్యుత్‌ కేంద్రం నుంచి తెలంగాణకు విద్యుత్‌ సరఫరా నిలిపేయడం వంటివి అప్పట్లో సంచనాలుగా మారాయి. కేసిఆర్‌ చెప్పింది తెలంగాణ సమాజం విన్నది. దాంతో ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదన్న భావన అందరిలోనే మొదలైంది. కాని హార్డ్‌ కోర్‌ తెలుగుదేశం పార్టీ నాయకలు, శ్రేణులు చాల మంది పార్టీ మారేందుకు ఇష్టపడక ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్న వాళ్లు చాలా మంది వున్నారు. ఇప్పటికీ వాళ్లు తెలుగుదేశం నాయకులుగానే చెలామణి అవుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ 15 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్నది. దాంతో కేసిఆర్‌లో అప్పుడే కంగారు మొదలైంది. హైదరాబాద్‌తోపాటు, ఖమ్మం, మహూబూబ్‌ నగర్‌, వరంగల్‌ జిల్లాలు అప్పటికీ కూడా తెదేపా బలంగానే వుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా 2014లో తెలుగుదేశం పార్టీ నుంచే గెలుపొందడం జరిగింది. కూకట్‌పల్లి నుంచి, జూబ్లీహిల్స్‌ నుంచి కూడ తెలుగుదేశం గెలిచింది. ఖమ్మం జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకున్నది.

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావుకూడా తెదేపా నుంచే పోటీ చేసి గెలిచారు.

తర్వాత పరిణామాలలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఎర్రబెల్లి తో పాటు అప్పటి ఎమ్మెల్యేలంతా బిఆర్‌ఎస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ అంత ప్రచారం చేసినా ఖమ్మంలో తెలుగుదేశం తన ఉనికిని చాటుకున్నది. కాని ఎక్కడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల మూలంగా మళ్లీ తెలంగాణలో టిడిపి చిగురించడం మొదలైంది. కాకపోతే గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఎంతో కొంత లాభం వుండేది. క్రియాశీలకపాత్ర పోషించే పరిస్దితి వచ్చేది. బిజేపి, జనసేన, తెలుగుదేశం కూటమి పోటీచేస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మెజార్టీ స్ధానాలు వచ్చేవి. కాని చంద్రబాబు అంత ధైర్యం చేయలేదు. అప్పటికి బిజేపి, తెలుగుదేశం పార్టీకి పొత్తు పొడవలేదు. జనసేన, బిజేపి కలిసి పోటీ చేయడం వల్ల బిజేపి ఆ ఎన్నికల్లో బిజేపికి ఎంతో కొంత లాభమైందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఏపిలో తెలుగుదేశం పార్టీ అదికారంలోకి రావడంతో మళ్లీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఆశలు చిగురించాయి. నాయకులు కూడా కొంత ఉత్సాహంగా వున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే కొంత మంది తెలంగాణ నేతలతో భేటీ అయినట్లు సమాచారం. మళ్లీ తెలంగానలో ఎన్టీఆర్‌ భవన్‌కు పూర్వ వైభవం తెద్దామని కూడా చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మూలంగానే తెలంగాణ పల్లెల్లో పచ్చ జెండాలకు మళ్లీ మంచి రోజులు వస్తాయని శ్రేణులు అనుకుంటున్నారు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఊపందుకోవడానికి అనేక కారణాలున్నాయి.

హైదరాబాద్‌ జిహెచ్‌ఎంసి పరిది జనాభా మొత్తం కోటికి పైగా వుంటారు. అందులో తెలంగాణకు చెందని వాళ్లు సుమారు 60 లక్షలుంటారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వాళ్లు ఓ పదిలక్షల మంది వరకు వుంటారు. ఏపికి చెంది ఎప్పుడో స్ధిరపడినవారితోపాటు, గత ఇరవై ఏళ్ల నుంచి స్ధిరపడుతూ వచ్చిన వారు కనీసం 30లక్షల మందికి పైగా వుంటారు. కూకట్‌ పల్లి నుంచి మొదలు, జూబ్లీహిల్స్‌, బంజారహిల్స్‌, కుత్భుల్లాపూర్‌, మణికొండ ఇలా అనేక ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు స్ధిరపడి వున్నారు. కాని వారి మూలాలన్నీ ఏపిలోనే వున్నాయి. ఇక నగర శివారు ప్రాంతాలైన ఉప్పల్‌,తోపాటు దిల్‌షుక్‌నగర్‌, కొత్తపేట నుంచి మొదలు హయత్‌ ప్రాంతాలలో కూడా పెద్దఎత్తున ఏపి ప్రజలు స్ధిరపడి వున్నారు. వాళ్లంతా తెలుగుదేశం పార్టీకి అభిమానులుగావుంటారు. ఈ ఎన్నికల్లో ఏపిలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయానికి తెలంగాణ నుంచి ఏపికి వెళ్లి ఓటు వేసిన వారి వల్లనే సాద్యమైందనేది అందరూ అంటున్న మాట. తెలంగాణ పల్లెల్లో వున్న తెలుగుదేశం శ్రేణులకు, జిహెచ్‌ఎంసి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రజల మద్దతు తోడైతే తెలంగాణలో టిడిపికి మళ్లీ పూర్వవైభవం రావడం పెద్ద సమస్య కాదు. అయితే తెలంగాణలో టిడిపి ఉనినికి పెరిగినా, క్రియాశీలక శక్తిగా మారే తరుణం ఆసన్నమౌతున్నా బిఆర్‌ఎస్‌ ప్రశ్నించేస్ధితిలోలేదు. అసలు బిఆర్‌ఎస్‌కు ఆ హక్కు కూడా లేకుండాపోయింది. ఎప్పుడైతే టిఆర్‌ఎస్‌ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చారో అప్పుడే కేసిఆర్‌ ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయారు. తెలంగాణలో ఏపి రాజకీయాలను అడ్డుకోవాలన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండాపోయింది. ఒక వేళ తెలంగాణ ప్రయోజనాలు అంటూ మళ్లీ కేసిఆర్‌ సెంటిమెంటు రగిలించాలని చూసినా ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చినప్పుడే తెలంగాణ ప్రయోజనాలు కేసిఆర్‌గాలికి వదిలేశారని చెప్పాలి.

ఒకప్పుడు తెలంగాణ వస్తే అంతకు మించిన ఆనందం నా జీవితంలో ఏదీ వుండదన్నాడు.

తెలంగాణ వస్తే తెలంగాణకు కాపాల కక్కలాగా వుంటానన్నాడు. తెలంగాణకు మొదటి మఖ్యమంత్రి దళితుడే అన్నాడు. ఇలా చెప్పి, చెప్పి ప్రజలను నమ్మించిన కేసిఆర్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కేంద్ర రాజకీయాలపై మోజు పెరిగింది. తన స్ధాయికి ముఖ్యమంత్రి పదవి కాదు, ప్రధాని కావాలని కలలు గన్నాడు. కేంద్రంలో చక్రంతిప్పాలనుకున్నాడు. తన అతి తెలివితో దేశమంతా కదిలిస్తానని కలలు గన్నాడు. కాని కుదరలేదు. తెలంగాణ ప్రజలే కేసిఆర్‌ను ప క్కన పెట్టాడు. తెలంగాణ ప్రజలనే కలవలేని నాయకుడు, దేశ రాజకీయాలను కదలిస్తానడాన్ని నవ్వుకున్నారు. ఇక తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టిన నీతో మాకేం పనిలేదని వద్దనుకున్నారు. 1999లో ఒకసారి కేంద్రంలో చక్రంతిప్పే అవకాశం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వచ్చింది. అయినా ఆయన జాతీయ రాజకీయాలకన్నా, తెలుగు నేల ప్రయోజనాలే ముఖ్యమన్నాడు. ఇంత కాలానికి మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం వచ్చినా ఏపి ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇదీ ఒక నాయకుడిని నిబద్దత. తెలంగాణ గోసపడుతోంది. తెలంగాణ ఆగమౌతోంది. తెలంగాణ, ఆంద్రా నాయకుల వల్ల దోచుకోవడుతోంది. తెలంగాణలో తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమం చేపట్టి, సాదించి కేసిఆర్‌ ఉద్దరించిందేమీ లేదు. అందుకే కేసిఆర్‌ జూటా మాటలని ప్రజలు తెలుసుకున్నారు. తన ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి, పదేళ్లు పదవిలో కూర్చోవడంతో, పెద్ద పదవి ప్రధాని కావాలన్న దూరాశ పెంచుకొని, తెలంగాణ ప్రజలను దూరం చేసుకున్న మూర్కుడు కేసిఆర్‌. ఎన్ని సంవత్సరాలైనా, ఎలాంటి అవకాశం వచ్చినా తెలుగు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పిన చంద్రబాబు ముందు కేసిఆర్‌ ఎప్పుడూ దిగదుడుపే..అందుకే తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని ఆహ్వానించేందుకు సిద్దంగానేవున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!