
US President Trump's
భారత్‌పై సుంకాలు..20% లోపే
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సన్నాహాలు
బ్రిటన్ తర్వాత మనతోనే ఈ తరహా అవగాహన
ట్రంప్ సర్కారు నిర్ణయం
వాషింగ్టన్, జూలై 12: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచ షేర్ మార్కెట్లు ‘బేర్’మంటున్నాయి. చైనా లాంటి దేశాలపై పదుల్లో కాకుండా.. వందల శాతాల మేర సుంకాల బాదుడుతో ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇటీవల బ్రిక్స్ దేశాలకు 50శాతానికి పైగా సుంకాలు తప్పవని, భారత్ కూడా మినహాయింపు కాదని హెచ్చరించిన సంగతి తెలిసిందే..! అయితే.. త్వరలో భారత్‌తో కుదరనున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 26%(ముందుగా ప్రకటించినది) కాకుండా.. 20% కంటే తక్కువగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పలు వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ ఒప్పందంతో ట్రంప్ పాలనలో వాణిజ్య ఒప్పందం చేసుకున్న అరుదైన దేశాల జాబితాలో భారత్ చేరనుంది. ఇప్పటికే బ్రిటన్ ఈ జాబితాలో ఉంది.
ఇక ఆసియా దేశాలైన మయన్మార్‌పై 40%, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లపై 20% మేర అమెరికా సుంకాలు కొనసాగుతున్నాయి. భారత్ మాత్రం అధిక సుంకాల జాబితాలో చేరకపోవచ్చని బ్లూమ్‌బెర్గ్ కూడా ఓ నివేదికలో పేర్కొంది. మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ ప్రతినిధి బృందం అమెరికాకు చేరుకుని, అక్కడి అధికారులతో చర్చలు జరపనుంది. ఇప్పటికే భారత్ తన తుది ప్రతిపాదనను అమెరికాకు అందజేసింది. జన్యు మార్పిడి(జీఐ) పంటలకు భారత్ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే..! అయితే.. అమెరికా తన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్‌పై జీఐ పంటల విషయంలో ఒత్తిడి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి భారత్ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. ఇటు ఔషధ రంగ నియంత్రణ సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుత చర్చల తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదురుతుందని, ఈ ఏడాది చివరికి తుది ఒప్పందంపై ప్రకటన ఉంటుందని సమాచారం.