బుగ్గారం జి.పి.నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి!!

విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్*డైరెక్టర్ జనరల్ కు పిర్యాదు

చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ను కోరిన చుక్క గంగారెడ్డి

ఎండపల్లి జగిత్యాల, నేటి ధాత్రి జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్యం పై చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారి అయిన డైరెక్టర్ జనరల్ కు గురువారం చుక్క గంగారెడ్డి పిర్యాదు చేశారు.
కోటికి పైగా నిధులు దుర్వినియోగమై, జి.పి. రికార్డులు కూడా మాయం చేసినప్పటికీ పంచాయతీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడి పట్టించు కోవడం లేదన్నారు. గత నాలుగు ఏండ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విజిలెన్స్ కు ఇచ్చిన పిర్యాదులో చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు. మూడు సార్లు నామ మాత్రంగా విచారణ జరిపిన పంచాయతీ అధికారులు కేవలం రూ.4,58,924-00 మాత్రమే రికవరీ చేశారని తెలిపారు. అయినా సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయలేదని ఆయన ఆరోపించారు. అవినీతి మత్తులో ఉన్న సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు వారి అత్యంత విలువైన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారని పిర్యాదులో వాపోయారు. అనేక ఆర్టీఐ దరఖాస్తులకు పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఉన్నతాధికారులు సైతం సమాచారం ఇవ్వడం లేదన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఇచ్చిన 18 కేసుల తీర్పులను సైతం బేఖాతర్ చేశారని, గౌరవ జిల్లా కలెక్టర్ జారీ చేసిన అనేక ఆదేశాలను కూడా జిల్లా పంచాయతీ అధికారులు బే ఖాతర్ చేస్తున్నారని ఆయన విజిలెన్స్ అధికారులకు ఇచ్చిన పిర్యాదులో ఆరోపించారు. తక్షణమే బుగ్గారం సర్పంచ్ మూల సుమలత ను, ఉప సర్పంచ్ ని, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను, పాలక వర్గాన్ని, బాధ్యులైన అధికారులను, అత్యంత విలువైన విధులను కూడా దుర్వినియోగం చేసిన ఉన్నతాధికారులను సైతం వెంటనే సస్పెండ్ చేస్తూ బాధ్యులైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ఆయన విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ ను కోరారు.
పనులు చేపట్ట కుండానే దొంగ తీర్మానాలు, దొంగ ఎం.బి. రికార్డులు, దొంగ బిల్లులు, దొంగ రికార్డులు సృష్టించి లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆయన పిర్యాదు లో పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా కలెక్టర్ వరకు అనేక సార్లు మేము చేసిన పిర్యాదులపై చర్యలు శూన్యం అయ్యాయని ఆరోపించారు.
మూడు సార్లు జరిపిన విచారణ పారదర్శకంగా, న్యాయంగా, చట్టబద్దంగా కొనసాగలేదన్నారు. జరిగిన నిధుల దుర్వినియోగం వాస్తవ ఆధారాలతో సహా అధికారుల విచారణలో లభించినా వాటిని కప్పి పుచ్చడం జరిగిందన్నారు. అధికారులు నిర్వహించిన క్షేత్ర స్థాయి విచారణలో సాక్షాత్తు గ్రామ ప్రజల ముందు బయట పడ్డ నిధుల దుర్వినియోగాన్ని కూడా విచారణ అధికారులు, ఉన్నతాధికారులు కలిసి కట్టుగా కుమ్మక్కై వాస్తవ దుర్వినియోగాన్ని కూడా కప్పి పుచ్చారని తెలిపారు. ఇట్టి నిధుల దుర్వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై గౌరవ లోకాయుక్త (కోర్టు) కు కూడా పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ కేసులో కూడా అధికారులు కావాలనే న్యాయ స్థానానికి తప్పుడు సమాచారం అందజేశారని ఆరోపించారు.
తమరి ద్వారా పూర్తి స్థాయిలో తగు విచారణ చేపడితే మరింత భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందని విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఆయన సూచించారు.తక్షణమే పకడ్బందీగా సమగ్ర విచారణ వేగవంతంగా జరిపించి మా నాలుగేండ్ల న్యాయ పోరాటానికి, బుగ్గారం గ్రామ ప్రజలకు తగు న్యాయం చేస్తూ, మొత్తం దుర్వినియోగాన్ని వెలికి తీసి, తగు వడ్డీతో సహా దుర్వినియోగం అయిన సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయించాలని కోరారు. బాధ్యులైన వారందరిని చట్టపరంగా, కఠినంగా శిక్షించాలని విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులను చుక్క గంగారెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!